అన్నీ పరిశీలించాకే జడ్జీల నియామకం

Supreme Court Well Established Process With Sufficient Safeguards Exists For Judges Appointment - Sakshi

సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ  

న్యాయవాది శైలేష్‌ సక్సేనాకు రూ.5 లక్షల జరిమానా 

సాక్షి, న్యూఢిల్లీ:  అనుభవం, అర్హత, ప్రభుత్వం నుంచి సేకరించిన వివరాలు ఇలా అన్నింటినీ పరిశీలించాకే హైకోర్టు న్యాయమూర్తుల నియామకం జరుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకం నిర్దిష్ట ప్రక్రియ మేరకు జరుగుతుందని, హైకోర్టు కొలీజియం అన్ని వివరాలు పరిశీలించాకే సిఫారసు చేస్తుందని పేర్కొంది. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డిని న్యాయమూర్తిగా నియమించాలన్న ప్రతిపాదనను సవాల్‌ చేస్తూ బి.శైలేష్‌ సక్సేనా అనే న్యాయవాది దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌కౌల్, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం సక్సేనాకు రూ.5 లక్షల జరిమానా విధించింది.  

చట్టపరమైన ప్రక్రియ దుర్వినియోగం 
గత ఆగస్టు 17న సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం... తెలంగాణ హైకోర్టుకు జస్టిస్‌ వెంకటేశ్వర్‌రెడ్డి సహా ఆరుగురు న్యాయమూర్తుల నియామకంపై హైకోర్టు కొలీజియం చేసిన సిఫారసును ఆమోదించిన విషయం విదితమే. కాగా న్యాయమూర్తిగా వెంకటేశ్వర్‌రెడ్డిని నియమించాలన్న ప్రతిపాదనకు సంబంధించి కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం, హైకోర్టు రిజిస్ట్రార్‌ (నిఘా, పాలన)లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటూ సక్సేనా 2020లో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే సక్సేనా పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది.

‘ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ వెంకటేశ్వర్‌రెడ్డిపై పిటిషనర్‌ పలు ఆరోపణలు చేశారు. అయితే పిటిషనర్‌పై పలు ఫిర్యాదులు ఉన్నాయనే అంశాన్ని మేం పరిగణనలోకి తీసుకున్నాం. ఈ మేరకు నాడు రిజిస్ట్రార్‌ జనరల్‌గా ఉన్న జస్టిస్‌ వెంకటేశ్వర్‌రెడ్డి చేసిన ఫిర్యాదుతో హైకోర్టు ఏకీభవించింది. ఈ నేపథ్యంలో చట్టపరమైన ప్రక్రియను పిటిషనర్‌ దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించాం. సుప్రీంకోర్టు అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌కు నాలుగు వారాల్లోగా రూ.5 లక్షలు జమ చేయాలని ఆదేశిస్తూ రిటి పిటిషన్‌ కొట్టేస్తున్నాం..’అని ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొంది.   

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top