పది రోజుల్లో భర్తీ చేయండి.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

Supreme Court Order to Center To Recruit Vacancies of Tribunals Within 10 Days - Sakshi

ట్రైబ్యునళ్ల ఖాళీలపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం  

సాక్షి, న్యూఢిల్లీ: వివిధ ట్రైబ్యునళ్లలో ఖాళీలు పది రోజుల్లో భర్తీ చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. నియామకాల్లో జాప్యం కారణంగా ట్రైబ్యునళ్లు నిరీ్వర్యం  అయ్యే దశకు చేరుకుంటున్నాయని పేర్కొంది. ఖాళీల భర్తీపై అలసత్వం చేస్తున్నారంటూ కేంద్రంపై అసహనం వ్యక్తం చేసింది. జబల్‌పూర్‌ ప్రిసైడింగ్‌ అధికారి అందుబాటులో లేనందున జబల్‌పూర్‌ డెబ్ట్‌ రికవరీ ట్రైబ్యునల్‌ అధికార పరిధి బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ మధ్యప్రదేశ్‌ రాష్ట్ర బార్‌కౌన్సిల్,  జీఎస్టీ అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలంటూ న్యాయవాది అమిత్‌ సాహ్నిలు దాఖలు చేసిన పిటిషన్లను సోమవారం జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. మద్రాస్‌ బార్‌ అసోసియేషన్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రెండు రోజులకే ఆ ఆదేశాలను అధిగమించడానికి పార్లమెంటులో తగిన చర్చ లేకుండానే  ట్రైబ్యునల్‌ సభ్యుల సేవలకు సంబంధించి  కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌తో ముందుకొచి్చందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.  

ట్రైబ్యునల్‌ సంస్కరణల బిల్లు, 2021పైనా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. గతంలో కోర్టు కొట్టివేసిన ప్రొవిజన్లను తిరిగి పొందుపరుస్తూ ట్రైబ్యునల్‌ సంస్కరణల బిల్లు తీసుకొచ్చిందని వ్యాఖ్యానించింది. ‘‘రెండు రోజుల్లోనే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు. పార్లమెంటులో చర్చ జరిగినట్లుగా అనిపించలేదు. చట్టాలు రూపొందించే అధికారం సభకు ఉంది. కానీ ఈ చట్టాన్ని రూపొందించడానికి గల కారణాలు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంది’’ అని జస్టిస్‌ ఎన్‌వీ రమణ వ్యాఖ్యానించారు. ‘‘బిల్లుపై చర్చ ఏం జరిగిందో మాకు చూపించండి. ఇది చాలా తీవ్రమైన అంశం. చర్చ సమయంలో రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నంత మాత్రాన బిల్లులో నియమాలను కోర్టు కొట్టివేయలేదని  కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు..  ఎందుకు ఈ బిల్లు రూపొందిస్తున్నాం...  ట్రైబ్యునళ్లను కొనసాగించాలా..  మూసివేయాలా ? ఇదే ప్రధానమైన ప్రశ్న’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఖాళీలు భర్తీ చేయకపోతే ట్రైబ్యునళ్లు నిర్వీర్యం అయ్యే అవకాశం ఉందని జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యానించారు. చట్టాన్ని ప్రవేశపెట్టడానికి సదరు మంత్రిత్వశాఖ నోట్‌ సిద్ధం చేసే ఉంటుంది కదా అది మాకు చూపించగలరా అని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌మెహతాను సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రశ్నించారు.  బిల్లు పూర్తిగా చట్టరూపం దాల్చకముందే తాను స్పందించలేనని, బిల్లు చెల్లుబాటు ప్రశ్నార్థకం కానందున ప్రస్తుతం తాను స్పందించలేనని తుషార్‌ మెహతా తెలిపారు. ట్రైబ్యునల్‌ కేసుల్లో అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ హాజరు అవుతారని, ఏజీతో మాట్లాడి స్టేట్‌మెంట్‌ రూపొందించడానికి సమయం కావాలని తుషార్‌మెహతా కోరారు. ఖాళీ భర్తీపై స్టేట్‌మెంట్‌ రూపకల్పనకు పది రోజులు సమయం ఇవ్వాలని తుషార్‌మెహతా కోరగా.. గత విచారణ సమయంలో ఖాళీల జాబితా ఇచ్చారని, వారిని నియమించాలని భావిస్తే అడ్డుకోబోమని జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు.

కోర్టు చెప్పిన విషయాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని, పదిరోజుల్లో పురోగతి ఉంటుందని, కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌లో నియామకాలు జరుగుతున్నాయని, మిగతా వాటిల్లో నియామక ప్రక్రియ (అండర్‌ ప్రాసెస్‌) మొదలైందని తుషార్‌ తెలిపారు. అండర్‌ ప్రాసెస్‌ అంటే దీర్ఘకాల ప్రక్రియగా సీజేఐ అభివరి్ణంచారు. ఎప్పుడు నియామకాలు గురించి అడిగినా అండర్‌ ప్రాసెస్‌ అంటున్నారని, దీని వల్ల అర్థం లేదని, పదిరోజుల్లో నియామకాలు పూర్తి చేస్తారని విశ్వసిస్తున్నామని సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొంటూ విచారణ పది రోజులకు వాయిదా వేశారు.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top