ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు: నిర్ణయాన్ని తిరిగి సమీక్షించం 

Supreme Court on implementation of reservation in promotions for SCs and STs - Sakshi

ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టు 

రాష్ట్రాలే నిర్ణయించుకోవాలన్న కోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశాలిస్తూ తామిచ్చిన తీర్పును తిరిగి సమీక్షించేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆదేశాలు అమలు  ఎలా చేయాలో రాష్ట్రాలే నిర్ణయించుకోవాలని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు నోట్‌ రూపంలో రెండు వారాల్లో అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు  ఆదేశించింది. జర్నైల్‌ సింగ్‌ వర్సెస్‌ లచ్మి నరైన్‌ గుప్తా కేసులో ఇంప్లీడ్‌ అయిన 133 పిటిషన్లను మంగళవారం జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ గవాయిల ధర్మాసనం మంగళవారం విచారించింది. నాగరాజ్, జర్నైల్‌ సింగ్‌ కేసులు తిరిగి ప్రారంభించాలని భావించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఏ గ్రూపులు వెన కబడి ఉన్నాయో రాష్ట్రాలు ఎలా నిర్ణయిస్తాయని న్యాయవాది ఇందిరా జైసింగ్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘విధానాలు ఎలా అమలు ఎలా చేయాలో రాష్ట్ర ప్రభుత్వాలకు మేం చెప్పడం కాదు.. న్యాయసమీక్షకు లోబడి ఎలా అమలు చేయాలో రాష్ట్రాలు నిర్ణయించుకోవాలి’ అని ధర్మాసనం పేర్కొంది. ‘మూడు హైకోర్టులు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చాయి.. అందులో రెండు పదోన్నతులు కొనసాగించాలని చెప్పగా ఒకటి స్టే ఇచ్చింది. కేంద్రం ముందు ఈ సమస్య ఉంద’ని అటార్నీ జనరల్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. స్టేటస్‌ కో ఆదేశాల వల్ల 2,500 సాధారణ పదోన్నతులు ఏళ్ల తరబడి నిలిచిపోయానన్నారు.

అడ్‌హక్‌ రూపంలో వాటిని చేపట్టాలని కేంద్రం భావిస్తోందని వేణుగోపాల్‌ తెలిపారు. పదోన్నతుల్లో రిజర్వేషన్ల నిబంధనల్లో ఈ గందరగోళాన్ని పరిష్కరించాలని కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశాయి. నిబంధనల్లో గందరగోళం వల్ల పలు రాష్ట్రాల్లో పదోన్నతులు నిలిచిపోయాయని తెలిపాయి. పలువురు సీనియర్‌ న్యాయవాదుల వాదనల అనంతరం ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు నోట్‌ రూపంలో రెండు వారాల్లో అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top