సుప్రీం జడ్జీలుగా ఐదుగురికి పదోన్నతి | Supreme Court Collegium Recommends 5 High Court Judges For Elevation | Sakshi
Sakshi News home page

సుప్రీం జడ్జీలుగా ఐదుగురికి పదోన్నతి

Published Wed, Dec 14 2022 6:19 AM | Last Updated on Wed, Dec 14 2022 6:19 AM

Supreme Court Collegium Recommends 5 High Court Judges For Elevation - Sakshi

న్యూఢిల్లీ: పేరుకుపోతున్న కేసుల సత్వర పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానం మరో ముందడుగు వేసింది. ఐదుగురు హైకోర్టు జడ్జీలను సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అంతకుముందు ఢిల్లీలో మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమైంది. ఆ తర్వాత సంబంధిత జడ్జీల పేర్ల జాబితాను కేంద్రానికి పంపింది. ఈ వివరాలను సుప్రీంకోర్టు తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

రాజస్తాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్, పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కరోల్, మణిపూర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పులిగోరు వెంకట సంజయ్‌ కుమార్, పట్నా హైకోర్టులో మరో జడ్జి జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, అలహాబాద్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలను సుప్రీంకోర్టులో జడ్జీలుగా ఎంపికచేయాలంటూ కేంద్రానికి సిఫార్సుచేసింది. ఈ సిఫార్సులకు కేంద్రం ఆమోదముద్ర వేస్తే సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 33కు పెరుగుతుంది. మరోవైపు, ఉత్తరాఖండ్‌ హైకోర్టులో జడ్జి జస్టిస్‌ సంజయకుమార్‌ మిశ్రాను జార్ఖండ్‌ హైకోర్టు  ప్రధాన న్యాయమూర్తిగా, గువాహటి హైకోర్టు జడ్జి ఎన్‌ కోటీశ్వర్‌ సింగ్‌ను జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌ను గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుచేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement