న్యూఢిల్లీ: హిందూ వారసత్వ చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కుటుంబాల్లో వారసత్వ హక్కులపై తలెత్తే వివాదాలను నివారించేందుకు హిందూ మహిళలు తమ ఆస్తిపై వీలునామా రాసుకోవాలని సూచించింది. వయస్సుతో సంబంధం లేకుండా, మహిళలు ముందుగానే తమ ఆస్తులపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోర్టు అభిప్రాయపడింది.
ఓ హిందూ కుటుంబంలో ఆస్తి పంపకాలపై తలెత్తిన వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు, భర్త ఇంటి ఆస్తిపై హక్కు వంటి అంశాల్లో మహిళలు న్యాయపరంగా చిక్కుల్లో పడే అవకాశాలు ఉన్నాయని, అలాంటి పరిస్థితుల్లో విలునామా ఉంటే స్పష్టత ఉంటుందని కోర్టు పేర్కొంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ సందర్భంగా మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, అత్తమామల మధ్య తలెత్తే ఆస్తి వివాదాల్లో మహిళలు న్యాయపరంగా ఇరుక్కుపోవడం మంచిది కాదు. అలాంటి వివాదాల్లో మహిళలు న్యాయపరంగా జోక్యం చేసుకోవడం వల్ల కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి’అని పేర్కొంది.
కోర్టు అభిప్రాయం ప్రకారం, హిందూ వారసత్వ చట్టం ప్రకారం మహిళలకు తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు ఉన్నప్పటికీ, వాస్తవికంగా ఆ హక్కును వినియోగించడంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వివాహిత మహిళలు తమ తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు కోరినప్పుడు, అత్తింటి కుటుంబంతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపింది.
ఈ నేపథ్యంలో మహిళలు తమ ఆస్తులపై ముందుగానే వీలునామా రాసుకోవడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే వివాదాలను నివారించవచ్చని కోర్టు సూచించింది. ఇది కుటుంబ శాంతి, సౌహార్దతకు దోహదపడుతుందని అభిప్రాయపడింది. ఈ తీర్పు, హిందూ వారసత్వ చట్టం పరిధిలో మహిళల హక్కుల పరిరక్షణకు దోహదపడేలా ఉండగా..ఆస్తి పంపకాల విషయంలో ముందస్తు ప్రణాళిక అవసరమని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పు ఆధారంగా, హిందూ మహిళలు తమ ఆస్తులపై స్పష్టమైన వీలునామా ఉండడం వల్ల భవిష్యత్తులో తలెత్తే కుటుంబ వివాదాలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


