
ఒడిశాలో 15 ఏళ్ల బాలిక దహనం కేసుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
గ్రామీణ మహిళలు, పిల్లల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశం
న్యూఢిల్లీ: ఒడిశాలో 15 ఏళ్ల బాలిక దహనం దురదృష్టకరం, సిగ్గుపడాల్సిన విషయమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు సాధికారత, సురక్షితమైన వాతావరణాన్ని అందించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ‘గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల బాలికలు, గృహిణులు, పిల్లల పరిస్థితి అత్యంత దుర్బలంగా ఉంది. వారిని శక్తివంతం చేయాలి. అందుకు మా ఈ ఆదేశాలు ఉపయోగపడాలి’అని ఆదేశించింది.
వారి భద్రతకోసం కొన్ని స్వల్పకాలిక, దీర్ఘకాలిక కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరం ఉందని, తద్వారా తాలూకా స్థాయిలో నివసించే మహిళలకు అవగాహన, సాధికారత కలి్పంచవచ్చని ధర్మాసనం పేర్కొంది. తాలూకా స్థాయిలో మహిళలకు శిక్షణ ఇచ్చి పారా లీగల్ వలంటీర్లుగా నియమించవచ్చని, మహిళలకు వారి హక్కుల గురించి అవగాహన కలి్పంచడానికి అంగన్‌వాడీ కార్యకర్తల సహాయం కూడా తీసుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది. మహిళలు, పిల్లలు, ట్రాన్స్‌పర్సన్‌లకు సురక్షితమైన వాతావరణం కోసం పాన్–ఇండియా మార్గదర్శకాలను రూపొందించడానికి ఆదేశాలు కోరుతూ గత సంవత్సరం డిసెంబర్ 16న దాఖలైన ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు అంగీకరించింది.
దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగి్చలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఇది ప్రభుత్వాల వ్యతిరేక వ్యాజ్యం కాదని, మహిళల భద్రతకోసం కేంద్రం, అన్ని పారీ్టల నుంచి సూచనలు అవసరమని ధర్మాసనం పేర్కొంది. కేంద్రం తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి మాట్లాడుతూ, లైంగిక నేరస్థులను గుర్తించడానికి, సకాలంలో చర్యలు తీసుకోవడానికి బహిరంగ ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు, ఫేస్ స్కాన్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. బాధలో ఉన్న మహిళలకు సహాయపడేలా ప్రతి జిల్లాలో వన్–స్టాప్ సెంటర్లు పనిచేస్తున్నాయని ఆమె అన్నారు. అయితే, వన్–స్టాప్ సెంటర్ తాలూకా స్థాయికి వెళ్లాల్సిన అవసరం ఉందని ధర్మాసనం సూచించింది.