బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ అత్తగారినంటే ఎవరూ నమ్మలేదు: సుధామూర్తి

Sudha Murty: Immigration Officer Refused To Believe Her London Address - Sakshi

ఇన్ఫోసిస్‌ ఫౌండర్‌ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి అందరికీ సుపరిచితురాలే. రచయిత్రి, విద్యావేత్త, సామాజిక వేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. కోట్ల సంపద ఉన్నప్పటికీ సాధారణ మహిళగానే జీవిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంటారు. సుధామూర్తి సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ఇటీవల భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషన్‌ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే.

కాగా బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ సుధామూర్తికి సొంత అల్లుడు అన్న విషయం తెలిసిందే. నారాయణ మూర్తి, సుధామూర్తి దంపతుల కుమార్తె అక్షరతో రిషి వివాహం 2009లో జరిగింది. వీరికి ఇద్దరు సంతానం(కృష్ణ సునక్, అనౌష్క సునక్).  గతేడాది సెప్టెంబర్‌లో రిషి సునాక్‌ యూకే ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే ఇటీవల సుధామూర్తి లండన్‌కు వెళ్లగా అక్కడ ఎదురైన ఓ ఆసక్తికర విషయాన్ని బాలీవుడ్‌ టాక్‌షో ‘ది కపిల్ శర్మ షో’లో పాల్గొని పంచుకున్నారు.

లండన్‌లో తన అడ్రస్‌ చెబితే ఇమిగ్రేషన్‌ అధికారులు నమ్మలేదని తెలిపారు. తాను  ప్రధాని అత్తగారినంటే ‘జోక్‌ చేస్తున్నారా’ అని అడిగారని పేర్కొన్నారు. ‘నేను ఒకసారి యూకే వెళ్లాను. లండన్‌లో ఎక్కడ ఉంటారని ఇమిగ్రేషన్‌ అధికారులు నా రెసిడెన్షియల్‌ అడ్రస్‌ అడిగారు. నాతో పాటు మా అక్క కూడా ఉన్నారు. నా కొడుకు కూడా లండన్‌లో నివసిస్తున్నాడు. కానీ నాకు అతని పూర్తి అడ్రస్‌ తెలియదు. అందుకే అల్లుడు రిషి సునాక్‌  నివాసించే 10 డౌనింగ్‌ స్ట్రీట్‌’ను అడ్రస్‌గా రాశాను.

అది చూసిన ఇమ్మిగ్రేషన్‌ అధికారులు నావైపు అదో రకంగా చూశారు. మీరు జోక్‌ చేస్తున్నారా అని అడిగారు. నేను నిజమే అని చెప్పాను. కానీ ఆయన నమ్మినట్లు నాకు అనిపించలేదు.72 ఏళ్ల వయసున్న నాలాంటి సాధారణ మహిళ బ్రిటన్‌ ప్రధాని రిషి అత్తగారంటే అక్కడ ఎవరూ నమ్మలేదు.’ అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ షోలో సుధామూర్తితో పాటు బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌, నిర్మాత గునీత్‌ మోంగా కూడా పాల్గొన్నారు.
చదవండి: ఢిల్లీకి చేరుకున్న డీకే శివకుమార్‌.. సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top