జేఈఈ మెయిన్స్‌ ఫలితాలపై ఉత్కంఠ: ర్యాంకెంత? సీటెక్కడ?

Students Of JEE Mains Now Look On Their Ranks And Seats - Sakshi

కాస్త ఎక్కువ ర్యాంకు వస్తే నిరాశపడొద్దంటున్న నిపుణులు

తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్‌ కేటగిరీలో 75 వేల ర్యాంకుకూ సీటు

రిజర్వేషన్‌ కేటగిరీలో 2 లక్షల వరకు వచ్చినా ఓకే

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌ పూర్తయింది. ఇందులో అర్హత సాధిస్తే అడ్వాన్స్‌కు వెళ్తారు. అందులో లభించే ర్యాంకు ఆధారంగానే ఐఐటీ కాలేజీల్లో సీట్లు లభిస్తాయి. ఇలా అడ్వాన్స్‌ ర్యాంకును బట్టి ఐఐటీల్లో సీటు వస్తే... జేఈఈ మెయిన్స్‌ ర్యాంకు ఆధారంగా ఎన్‌ఐటీలు, ఐఐఐటీల్లో ఇంజనీరింగ్‌ సీట్లు పొందే అవకాశం ఉంది. ఇక్కడే విద్యార్థుల్లో అసలైన టెన్షన్‌ మొదలవుతుంది. జేఈఈ మెయిన్స్‌లో ఎంత ర్యాంకు వస్తుందో? జేఈఈ అడ్వాన్స్‌కు ఎంపిక కాకుంటే..? ఆ ర్యాంకుతో నిట్‌లు, ఇతర విద్యాసంస్థల్లో సీటు వస్తుందా? రాదా? అనే ఆలోచనతో సమమతమవుతుంటారు.

చాలామందిలో ఉన్న అపోహ ఏమిటంటే... జేఈఈ మెయిన్స్‌లో 10 వేల పైన ర్యాంకు వస్తే ఎన్‌ఐటీల్లో సీటు కోసం ప్రయత్నించడం వృధా అని. అయితే ఇది ముమ్మాటికీ తొందరపాటు చర్యే అంటున్నారు నిపుణులు. ‘గత కొన్నేళ్ళుగా ఏ సంస్థలో ఏ ర్యాంకు వరకు సీట్లు కేటాయించారు? పోటీ ఎలా ఉంది? అనే దానిపై విద్యార్థులు కొంత కసరత్తు చేయాలి. అలాగే తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేవరకూ వేచి చూడాలి..’అని స్పష్టం చేస్తున్నారు. 

కాస్త ఎక్కువ ర్యాంకు వచ్చినా సీటు ఈజీయే!
ఎన్‌ఐటీలు అంటే ఐఐటీల తర్వాత దేశంలో పేరెన్నికగన్న విద్యా సంస్థలు. వీటిల్లో ఏ కోర్సు చేసినా జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉంటుంది. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో కంపెనీలు భారీ వేతనాలిచ్చి ఎంపిక చేసుకుంటాయి. కాబట్టి ఫలానా కోర్సే కావాలి.. ఫలానా ఎన్‌ఐటీలోనే కావాలనే విషయాన్ని విద్యార్థులు పక్కన బెడితే, కాస్త ఎక్కువ ర్యాంకులోనూ సీటు ఈజీగానే సంపాదించే వీలుందని గత కొన్నేళ్ళ కౌన్సెలింగ్‌ డేటా చెబుతోంది. 

వరంగల్, తాడేపల్లిగూడెంలలో ఇలా..
గత ఐదేళ్ల సీట్ల కేటాయింపును పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్‌ కేటగిరీలో 75 వేల వరకు, రిజర్వేషన్‌ కేటగిరీలో 2 లక్షల వరకు ర్యాంకు వచ్చినా వీటిల్లో సీటు గ్యారెంటీ అని తెలుస్తోంది. వరంగల్‌ నిట్‌ సీఎస్‌ఈలో బాలురకు 3,089 ర్యాంకు, బాలికలకు 3,971 ర్యాంకు వరకు సీటు వస్తుంటే, అదే ఏపీ నిట్‌ (తాడేపల్లిగూడెం)లో బాలురకు 14 వేలు, బాలికలకు 28 వేల వరకు సీటు వస్తోంది. ఓబీసీలకు వరంగల్‌లో గరిష్టంగా 13 వేల వరకు, ఏపీలో 33 వేల ర్యాంకు వరకు సీట్లు వస్తున్నాయి. ఎస్సీ కేటగిరీకైతే గరిష్టంగా 97,139 వరకు, ఎస్టీలకు 48 వేల ర్యాంకు వరకు సీట్లు దక్కాయి. మెకానికల్‌ బ్రాంచి ఓపెన్‌ కేటగిరీలోనే వరంగల్‌ నిట్‌లో 17 వేల వరకు, ఏపీలో 75 వేల వరకు ర్యాంకులకు సీట్లొచ్చాయి.

వీటిల్లో అయితే 50 వేల వరకు..
తిరుచ్చి, సూరత్‌కల్, క్యాలికట్, నాగపూర్‌ వంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎన్‌ఐటీల్లో ఓపెన్‌ కేటగిరీ విద్యార్థులు కూడా గరిష్టంగా జేఈఈ ర్యాంకు 50 వేల వరకు వచ్చినా సీటు సంపాదించిన ఉదంతాలున్నాయి. 

జేఈఈ మెయిన్స్‌ ద్వారా 34,319 సీట్లు భర్తీ
దేశవ్యాప్తంగా ఐఐటీల్లో 16,050 సీట్లు, ఎన్‌ఐటీల్లో 23,056, ఐఐఐటీల్లో 5,643, కేంద్ర ఆర్థిక సహకారంతో నడిచే సంస్థల్లో 5,620... వెరసి 50,369 సీట్లు జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఉన్నాయి. అడ్వాన్స్‌తో భర్తీ చేసే ఐఐటీ సీట్లు 16,050 పక్కనబెడితే మిగిలిన 34,319 సీట్లు జేఈఈ మెయిన్స్‌ ర్యాంకు ద్వారానే భర్తీ చేస్తారు. 

అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకోవాలి
జేఈఈ మెయిన్స్‌ ర్యాంకులు, నిట్‌లలో సీట్లపై విద్యార్థుల్లో అవగాహన తక్కువ. 10 వేలు దాటి ర్యాంకు వస్తే నీరసపడి పోతున్నారు. కానీ ఏ కాలేజీ అయినా సరే, ఏ బ్రాంచీ అయినా ఫర్వాలేదు అనుకుంటే, ఓపెన్‌ కేటగిరీలో 40 వేల వరకు, రిజర్వేషన్‌ అభ్యర్థులకు 2 లక్షల వరకు ర్యాంకు వచ్చినా సీటు వచ్చే అవకాశం ఉందని గత కొన్నేళ్ల కౌన్సెలింగ్‌ ప్రక్రియను అధ్యయనం చేస్తే తెలు స్తుంది. అందువల్ల తొందరపడి ఇతర ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చేరవద్దు. 
– ఎంఎన్‌ రావు(గణిత శాస్త్ర నిపుణులు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top