వామ్మో.. కళ్లజోడులో స్పై కెమెరా పెట్టుకుని బద్రీనాథ్‌ ఆలయంలోకి.. | Spycam In Eyewear Inside Badrinath Temple | Sakshi
Sakshi News home page

వామ్మో.. కళ్లజోడులో స్పై కెమెరా పెట్టుకుని బద్రీనాథ్‌ ఆలయంలోకి..

Jul 6 2026 4:57 PM | Updated on Jul 6 2026 5:07 PM

Spycam In Eyewear Inside Badrinath Temple

డెహ్రాడూన్: కొన్ని హిందూ దేవాలయాల్లో ఫొటోలు తీయడం, వీడియోలు చిత్రీకరించడం నిషేధం. భద్రతతో పాటు ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఈ నిబంధనలు అమలు చేస్తుంటారు. అలాంటి నిబంధనలను ఉల్లంఘించిన ఓ భక్తుడు ఇప్పుడు పోలీసు చర్యలను ఎదుర్కొంటున్నాడు.

బద్రీనాథ్ ధామ్ గర్భగుడిలో స్పై కెమెరాతో అక్రమంగా వీడియో చిత్రీకరించిన ఓ వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. తన పేరు జైప్రకాశ్ పాండే అని చెప్పుకున్న అతడు.. క్షమాపణ చెప్పి, ఆ వీడియోను ఏ రూపంలోనూ షేర్‌ చేయబోనని హామీ ఇచ్చాడు. ఉత్తరాఖండ్ హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న విష్ణుమూర్తికి అంకితమైన బద్రీనాథ్ ఆలయ గర్భగుడిలో ఫొటోలు తీయడం, వీడియోలు చిత్రీకరించడం పూర్తిగా నిషేధం.

ముంబైకు చెందిన పాండే తన కళ్లజోడులో స్పై కెమెరా పెట్టుకుని గర్భగుడి లోపలి దృశ్యాలను రికార్డు చేశాడు. దీనిపై పాండే మాట్లాడుతూ.. "ఈ కెమెరాతో వీడియో తీస్తూ పట్టుబడ్డాను. ఇది నా తప్పు. ఇలా చేయకూడదని నాకు తెలియదు. ఇకపై ఇలాంటి పని చేయను. వీడియోను తొలగిస్తున్నాను. దానిని ఎక్కడా పోస్ట్ చేయను" అని చెప్పాడు.

ఈ చర్య ఆలయ యాజమాన్యం అమలు చేస్తున్న నిబంధనలు, భద్రతా ప్రమాణాలు, ఆధ్యాత్మిక మర్యాదలకు విరుద్ధమని చమోలీ పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఉత్తరాఖండ్ సెక్షన్ 81 కింద న్యాయపరమైన చర్యలు ప్రారంభించారు. ఆలయ గోప్యత, భద్రత దృష్ట్యా అతడి వద్ద ఉన్న అక్రమంగా చిత్రీకరించిన వీడియోలు, ఫొటోలు అన్నింటినీ తొలగించారు.

ఆలయ యాజమాన్యం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను ప్రతి భక్తుడు తప్పనిసరిగా పాటించాలని చమోలీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. నిషేధిత ప్రాంతాల్లో ఎలాంటి ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేయవద్దని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement