హిప్‌హిప్‌ హుర్రే..

Sonu Sood Helps Tamil nadu Medicos Travel From Russia - Sakshi

తమిళనాడు మెడికోలకు సోనూసూద్‌ బాసట 

రష్యా నుంచి  ప్రత్యేక విమానంలో చెన్నైకి రాక 

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడుకు చెందిన అనేక విద్యార్థి, విద్యార్థినులు రష్యాలోని మాస్కోలో కొన్నేళ్లుగా ఎంబీబీఎస్‌ వైద్యవిద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాపించడంతో విమానాల రాకపోకలు స్తంభించిపోయాయి. వందే భారత్‌ పేరున కేంద్రప్రభుత్వం ప్రత్యేక విమానాలు నడుపుతూ వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేరుస్తూ వస్తోంది. వందే భారత్‌ విమానంలో బహ్రెన్‌ నుంచి153 మంది, దుబాయ్‌ నుంచి 175 మంది మంగళవారం రాత్రి చెన్నైకి చేరుకున్నారు.

అయితే రష్యా నుంచి మాత్రం వందేభారత్‌ విమానం నడపలేదు. దీంతో తమిళనాడుకు చెందిన వైద్యవిద్యార్థులు స్వదేశానికి చేరుకునేలా తమకు సహాయం చేయాల్సిందిగా భారత్‌లోని అనేక ప్రజాప్రతినిధులకు, సినిమారంగ ప్రముఖులను వేడుకున్నారు. వీరి అభ్యర్థనకు ప్రముఖ బాలివుడ్‌ నటుడు సోనూసూద్‌ వెంటనే స్పందించి సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. 101 మంది ఎంబీబీఎస్‌ పట్టభద్రులు మాస్కో నుంచి బుధవారం చెన్నైకి చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో దిగగానే హిప్‌ హిప్‌ హుర్రే అంటూ కేరింతలు కొడుతూ తమ ఆనందాన్ని చాటుకున్నారు. 

రియల్‌ హీరో సోనూసూద్‌..డాక్టర్‌ టీఆర్‌ శక్తిప్రియదర్శిని 
డాక్టర్‌ టీఆర్‌ శక్తిప్రియదర్శిని చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ, తామంతా మాస్కోకు 500 కిలోమీటర్ల దూరంలో కుర్సక్‌ మెడికల్‌ యూనివర్సిటీలో వైద్యవిద్యను అభ్యసిస్తున్నామని తెలిపారు. జూలై 6న తమ వైద్యవిద్య ముగుస్తున్న దశలో మాస్కో నుంచి జూలై 3న వందేభారత్‌ ప్రత్యేక విమానంలో స్వదేశానికి చేరుకోలేకపోయామని అన్నారు. దీంతో తమను స్వదేశానికి చేర్చాలని సామాజిక మాధ్యమాల ద్వారా భారత్‌లోని ప్రముఖులకు విజ్ఞప్తులు పంపాం. గతనెల 23న సోనూసూద్‌కు మెయిల్‌ పంపగా సహాయం చేస్తానని ఆయన బదులిచ్చారు. చార్టర్డ్‌ విమానం ఏర్పాటుతో స్వదేశానికి సురక్షితంగా చేరుకున్నాం. రీల్‌ పరంగా విలన్‌ నటుడైనా రియల్‌లో హీరో అని సోనూసూద్‌ చాటుకున్నారని కృతజ్ఞతలు తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top