‘స్కిన్‌ టు స్కిన్‌’ కాకపోయినా నేరమే: సుప్రీం కోర్టు

Skin-To-Skin Condition Disastrous For Sex Assault Cases says Supreme Court - Sakshi

లైంగిక వేధింపులను బాధితుల దృష్టి కోణం నుంచి నిర్వచించాలి

సుప్రీంకోర్టు స్పష్టీకరణ

న్యూఢిల్లీ: ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌(పోక్సో) చట్టం కింద చిన్నారులపై లైంగిక వేధింపుల నేరాన్ని బాధితుల దృష్టి కోణం నుంచి నిర్వచించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగానే లైంగికంగా వేధించినట్లు భావిస్తే.. శరీరానికి శరీరం (స్కిన్‌ టు స్కిన్‌) తాకకపోయినా నేరంగానే నిర్ధారించాలని పేర్కొంది. లైంగిక నేరాన్ని నిర్ధారించడంలో స్కిన్‌ టు స్కిన్‌ కాంటాక్టు తప్పనిసరి అని చెబితే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.

లైంగిక నేరం వెనుక ఉద్దేశాన్ని కచ్చితంగా గుర్తించాలని సూచించింది. బాధితురాలికి, నిందితుడికి మధ్య స్కిన్‌ టు స్కిన్‌ కాంటాక్టు జరగలేదు కాబట్టి పోక్సో చట్టం కింద లైంగిక నేరంగా నిర్ధారించలేమంటూ బాంబే హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ రెండు పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును రిజర్వ్‌ చేసింది. పోక్సో చట్టంలోని సెక్షన్‌ 7ను ధర్మాసనం క్షుణ్నంగా పరిశీలించింది. లైంగిక వాంఛతో చిన్నారుల శరీర భాగాలను తాకితే.. దాన్ని లైంగిక వేధింపులుగానే భావించాలని ఈ సెక్షన్‌ చెబుతోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top