
న్యూఢిల్లీ: భారతదేశంతో పాటు విదేశాల నుండి జంతువులను, ముఖ్యంగా ఏనుగులను తీసుకురావడంలో చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణల నేపధ్యంలో అనంత్ అంబానీకి చెందిన ‘వంతారా’పై సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో గల గ్రీన్ జూలాజికల్ రెస్క్యూ, పునరావాస కేంద్రం వంతారాపై నిజనిర్ధారణ విచారణకు సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.
మీడియాతో పాటు సోషల్ మీడియాలో వచ్చిన పలు నివేదికలు, ఎన్జీఓలు, వన్యప్రాణుల సంస్థల నుండి ‘వంతారా’లో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ వచ్చిన ఆరోపణల మేరకు దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలను సుప్రీంకోర్టు విచారించింది. జస్టిస్‌లు పంకజ్ మిథల్, పీబీ వరలేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం మాజీ న్యాయమూర్తి జె. చలమేశ్వర్ నేతృత్వంలో నలుగురు సభ్యుల సిట్ కమిటీని ‘వంతారా’పై విచారణకు ఏర్పాటు చేసింది.
పిటిషన్లలో ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని, ప్రైవేట్ ప్రతివాది లేదా మరే ఇతర పార్టీల కౌంటర్‌ను లెక్కించడం వలన పెద్దగా ప్రయోజనం ఉండదని సుప్రీం కోర్టు పేర్కొంది. సాధారణంగా ఇటువంటి ఆధారం లేని ఆరోపణలపై ఆధారపడిన పిటిషన్‌ను చట్టపరంగా స్వీకరించేందుకు అర్హత లేదని, అందుకు బదులుగా దానిని తాత్కాలికంగా కొట్టివేయాలని కూడా పేర్కొంది. అయితే వంతారాలో వాస్తవ పరిస్థితిని ధృవీకరించాలని, అప్పుడు ఇటువంటి ఆరోపణలు నిజమా కాదా అనేది తేలుతుందని, అందుకే విచారణ అనేది న్యాయ దృక్పథంలో సముచితమని భావిస్తున్నామని తొమ్మిది పేజీల ఉత్తర్వులో సుప్రీం కోర్టు పేర్కొంది.
‘వంతారా’కు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల సిట్ బృందంలో జస్టిస్ చలమేశ్వర్‌తో పాటు, జస్టిస్ (రిటైర్డ్) రాఘవేంద్ర చౌహాన్, ముంబై మాజీ పోలీసు కమిషనర్ హేమంత్ నగ్రాలే, మాజీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారి అనిష్ గుప్తా ఉండనున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. భారతదేశంతో పాటు విదేశాల నుండి జంతువులను, ముఖ్యంగా ఏనుగులను సేకరించడం, వన్యప్రాణుల (రక్షణ) చట్టం అమలు, సజీవ జంతువుల దిగుమతి, ఎగుమతులకు సంబంధించి ‘వంతారా’ అనుసరిస్తున్న విధానాలపై దర్యాప్తు జరిపి, ఆ నివేదికను సమర్పించాలని ‘సిట్’కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్లలో ఆరోపించిన మనీలాండరింగ్ లాంటి ఆరోపణలను కూడా ఈ ప్యానెల్ పరిశీలిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది.