విరాళాల సేకరణలో శివసేన టాప్‌

Shiv Sena received highest donations - Sakshi

37,794 శాతం పెరిగిన జార్ఖండ్‌ ముక్తి మోర్చా విరాళాలు

2019–20లో రూ.233.686 కోట్లు స్వీకరించిన 27 పార్టీలు

సాక్షి, న్యూఢిల్లీ:  2019–20 ఆర్థిక సంవత్సరంలో జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం)కు వచ్చిన విరాళాలు 37,794 శాతం, లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ)కి విరాళాలు 410 శాతం, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి 317 శాతం, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కి 156 శాతం పెరిగాయి. 2018–19లో జేఎంఎంకు 0.017 కోట్లు, ఎల్‌జేపీకి 0.515 కోట్లు, ఎస్పీకి రూ.1.054 కోట్లు రాగా, 2019–20లో ఆయా పార్టీలకు వరుసగా రూ.6.442 కోట్లు, రూ.2.629 కోట్లు, రూ.4.392 కోట్లు వచ్చాయి.

పలు ప్రాంతీయ రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాలపై అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) రూపొందించిన నివేదిక శుక్రవారం విడుదలయ్యింది. 2019–20లో అత్యధిక విరాళాలు ప్రకటించిన టాప్‌–5 పార్టీల్లో శివసేన, ఏఐఏడీఎంకే, ఆప్, బీజేడీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉన్నాయి. 2018–19లో కంటే 2019–20లో తమకు విరాళాలు తగ్గాయని శివసేన, బీజేడీ, వైఎస్సార్‌సీపీ ప్రకటించగా, తాము స్వీకరించిన విరాళాలు పెరిగాయని ఏఐఏడీఎంకే, ఆమ్‌ ఆద్మీ పార్టీ వెల్లడించాయి.

టాప్‌–5 పార్టీలకు రూ.189.523 కోట్లు
తమకు అందినట్లుగా 27 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన విరాళాల మొత్తం రూ.233.686 కోట్లుగా ఉందని ఏడీఆర్‌ గుర్తించింది. ఇందులో రూ.62.859 కోట్లతో శివసేన ముందంజలో ఉంది. ఆ తర్వాత ఏఐఏడీఎంకే రూ.52.17 కోట్లను స్వీకరించినట్లు ప్రకటించింది. మూడో స్థానంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ రూ.37.37 కోట్లు అందుకుంటున్నట్లు తెలిపింది. ప్రాంతీయ పార్టీలు అందుకున్న మొత్తం విరాళాలలో 81.10 శాతం.. అంటే రూ.189.523 కోట్లు కేవలం టాప్‌–5 ప్రాంతీయ పార్టీలకే అందాయి.

తగ్గిన విరాళాలు
2018–19 నాటి విరాళాలతో పోలిస్తే 2019–20లో జేఎంఎం, ఎల్‌జేపీ, ఎస్‌పీ, ఆప్‌లకు విరాళాలు భారీగా పెరిగాయి. అదే సమయంలో వైఎస్సార్‌సీపీకి రూ.71.651 కోట్లు, తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌)కి రూ.40.876 కోట్లు, తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి రూ.23.573 కోట్లు, శివసేనకు రూ.7.371 కోట్లు, జేడీయూకు రూ.7.098 కోట్ల మేర విరాళాలు తగ్గాయి. ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం రూ.233.686 కోట్ల విరాళాలలో, 2019–20 ఆర్థిక సంవత్సరంలో 421 విరాళాల నుండి రూ.4.884 కోట్లు నగదు రూపంలో స్వీకరించాయి. ఇది పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాలలో 2.09% అని నివేదికలో పేర్కొన్నారు.

అత్యధికంగా మహారాష్ట్ర నుంచే
విరాళాల కింద అత్యధికంగా మహారాష్ట్ర నుంచి రూ.110.475 కోట్లు, ఢిల్లీ నుంచి రూ.46.24 కోట్లు, కర్ణాటక నుంచి రూ.9 కోట్లు అందుకున్నట్లు ప్రాంతీయ పార్టీలు ప్రకటించాయి. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీలకు కార్పొరేట్‌/వ్యాపార రంగాల నుంచి విరాళాల ద్వారా రూ.181.522 కోట్లు రాగా, 5,916 మంది వ్యక్తిగత దాతలు రూ.42.48 కోట్లు ఇచ్చారు. అదే సమయంలో మరో రూ.30.766 కోట్ల విరాళాల సమాచారాన్ని పార్టీలు బయటపెట్టలేదు.

విరాళాలు స్వీకరించినట్లు ప్రకటించిన 27 ప్రాంతీయ పార్టీలలో 16 పార్టీలు శాశ్వత ఖాతా సంఖ్య(పాన్‌) వివరాలు లేకుండా రూ.24.779 కోట్ల విరాళాలు స్వీకరించినట్లు వెల్లడించాయి. కాగా, 14 ప్రాంతీయ పార్టీలు.. టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ, టీడీపీ, బీజేడీ, డీఎంకే, శివసేన, ఆప్, జేడీయూ, ఎస్పీ, జేడీఎస్, శిరోమణి అకాలీదళ్, ఏఐఏడీఎంకే, ఆర్‌జేడీ, జేఎంఎంలు రూ.447.498 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా విరాళాలు అందుకున్నట్లు పేర్కొన్నాయి. అయితే 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను ఎన్‌డీపీపీ, డీఎండీకే, జేకేఎన్‌సీ పార్టీలు తాము అందుకున్న విరాళాల వివరాలను ప్రకటించలేదు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top