‘రాజద్రోహం’పై విస్తృత ధర్మాసనం అనవసరం

SC to decide if larger bench should hear challenges to sedition law - Sakshi

సుప్రీంకోర్టుకు తెలిపిన ఏజీ కె.కె.వేణుగోపాల్‌

కేంద్రం కౌంటర్‌ దాఖలు చేయలేదని ధర్మాసనం అసహనం

తదుపరి విచారణ 10కి వాయిదా

సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటిష్‌ కాలం నాటి రాజద్రోహం చట్టంపై విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఈ చట్టం దుర్విని యోగం కాకుండా నియంత్రించగలిగామని చెప్పా రు. దీనిపై మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. రాజద్రోహం చట్టాన్ని సవాలు చేస్తూ ఎస్‌జీ వొంబట్కెరే, ఎడిటర్స్‌ గిల్డ్‌ తదితరులు వేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమా కోహ్లిల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

ఇటీవల మహారాష్ట్రలో ఎంపీ నవనీత్‌ కౌర్‌ రాణా దంపతుల అరెస్టు కేసును ధర్మాసనం ప్రస్తావించింది. ‘‘దేశంలో ఏం జరుగుతోందో కోర్టుకు తెలుసు. హనుమాన్‌ చాలీసా చదువుతామన్న వారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారు. చట్టం దుర్వినియోగం కాకుండా మార్గదర్శకాలు జారీ చేయాలే గానీ విస్తృత ధర్మాసనం అవసరం లేదు. సెక్షన్‌ 142ఏ చెల్లుబాటుపై  కేదార్‌నా«థ్‌సింగ్‌ కేసులో ఇచ్చిన తీర్పును సమర్థించాల్సి ఉంది. కేంద్రం వైఖరి చెప్పాల్సి ఉంది’’ అని ఏజీ వేణుగోపాల్‌ తెలిపారు.

సెక్షన్‌ 124ఏను రద్దు చేయొచ్చు
రాజద్రోహం చట్టంపై దాఖలైన పిటిషన్లపై కౌంటరు దాఖలు చేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించడం లేదంటూ కేంద్రంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. న్యాయవాదులు సిద్ధం చేసిన ముసాయిదాకు ఆమోదం రాలేదని, ఈ నేపథ్యంలో మరింత గడువు కావాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోరారు. భారతదేశంలో తమ పాలనను కాపాడుకోవడానికి బ్రిటిషర్లు చేసిన రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలని పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోరారు.  ఈ చట్టం కారణంగా స్వేచ్ఛాభారతంలో జర్నలిస్టులు, విద్యార్థులు అరెస్టవుతున్నారని వాపోయారు. ‘‘సొలిసిటర్‌ జనరల్‌ అభ్యర్థన మేరకు కౌంటర్‌ దాఖలుకు సోమవారం వరకూ సమయం ఇస్తున్నాం. విస్తృత ధర్మాసనం ఏర్పాటుపై వాదప్రతివాదులు లిఖితపూర్వక అభ్యర్థనలను శనివారం ఉదయం అందజేయాలి. మే 10 మధ్యాహ్నం విచారిస్తాం. వాయిదాకు అంగీకరించబోం’’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది.

ఇక పూర్తి సామర్థ్యంతో సుప్రీంకోర్టు!
సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉండాలి. ప్రస్తుతం రెండు ఖాళీలున్నాయి. వీటి భర్తీ ప్రక్రియ మొదలయ్యింది. కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు నియమితులైతే సుప్రీంకోర్టు ఇక పూర్తి సామర్థ్యంతో పనిచేయనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఇద్దరి పేర్లను ప్రతిపాదించింది. గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుధాంశు ధూలియా, గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జంషెడ్‌ బి.పార్దివాలాను సుప్రీం జడ్జీలుగా నియమించాలని కేంద్రానికి సూచించినట్లు సమాచారం. దీనిని ఆమోదిస్తే జస్టిస్‌ జంషెడ్‌ బి.పార్దివాలా జడ్జిగా, ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top