Varsha Raut: సంజయ్‌ రౌత్‌ భార్య వర్ష రౌత్‌కు ఈడీ సమన్లు

Sanjay Raut Wife Varsha Receives ED Summons Custody Extended - Sakshi

ముంబై: మనీలాండరింగ్‌ కేసులో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ను ఇటీవలే అరెస్ట్‌ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. తాజాగా ఆయన కస్టడీని పొడింగించింది ముంబై ప్రత్యేక కోర్టు. సోమవారం వరకు ఈడీ అధీనంలోనే విచారణ ఎదుర్కోనున్నారు రౌత్‌. కస్టడీ పొడిగించిన క్రమంలో.. ఈ కేసు దర్యాప్తులో ఈడీ పురోగతి సాధించినట్లు ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది.

ముంబైలోని ఛాల్‌ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని గత ఆదివారం సంజయ్‌ రౌత్‌ను సుమారు ఆరు గంటల పాటు విచారించింది ఈడీ. అనంతరం అర్ధరాత్రి అరెస్ట్‌ చేసింది. అలాగే.. ఆయన భార్య, ఇతరులకు ప్రమేయం ఉన్న ట్రాన్సాక్షన్స్‌లను సైతం పరిగణనలోకి తీసుకుంది. ఆ తర్వాత సోమవారం కోర్టులో ప్రవేశపెట్టగా ఆగస్టు 4 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. దీంతో గురువారం పీఎంఎల్‌ఏ కోర్టు జడ్జి ఎంజీ దేశ్‌పాండే ముందు రౌత్‌ను హాజరుపరిచింది ఈడీ. లోతైన విచారణ జరిపేందుకు కస్టడీ పొడగించాలని కోరింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి రౌత్‌ కస్టడీని ఆగస్టు 8 వరకు పొడిగించారు. హౌసింగ్‌ పునర్నిర్మాణ ప్రాజెక్ట్‌లో రౌత్‌, ఆయన కుటుంబం సుమారు రూ.కోటి వరకు అవకతవకలకు పాల్పడినట్లు గతంలో పేర్కొంది ఈడీ. అయితే.. ఈ వాదనలు తోసిపుచ్చారు రౌత్‌. 

సంజయ్‌ రౌత్‌ భార్యకు ఈడీ సమన్లు..
పార్థ ఛాల్‌ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ భార్య వర్ష రౌత్‌కు గురువారం సమన్లు జారీ చేసింది ఈడీ. ఈ కేసులో రౌత్‌ కస్టడీ పొడిగించిన కొన్ని గంటల్లోనే సమన్లు జారీ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. వర్ష రౌత్‌ ఖాతాల ద్వారా ట్రాన్సాక్షన్స్‌ జరిపినట్లు బయటకి రావటంతో ఈ సమన్లు జారీ చేసినట్లు ఈడీ పేర్కొంది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వర్ష రౌత్‌ ఖాతాలోకి సుమారు రూ.1.08 కోట్లు నగదు వచ్చినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: సంజయ్‌ రౌత్‌ అరెస్ట్‌.. ఈడీ తరువాత టార్గెట్‌ ఎవరో? 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top