అసమర్ధత కప్పిపుచ్చకునేందుకు దేవుడిపై నెపమా..?

Sanjay Raut Criticises Nirmala Sitharamans Act Of God Remark - Sakshi

నిర్మలా సీతారామన్‌ దైవ ఘటన వ్యాఖ్యలపై సంజయ్‌ రౌత్‌

ముంబై : కోవిడ్‌-19 ప్రభావంతో నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన దేవుడి చర్య (యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌) వ్యాఖ్యలను శివసేన నేత, ఎంపీ సంజయ్‌ రౌత్‌ తప్పుపట్టారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుతూ దేవుడ్ని నిందించడం హిందుత్వకు అవమానకరమని సామ్నా పత్రికలో రాసిన వ్యాసంలో ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ భేటీలో నిర్మలా సీతారామన్‌ ఇటీవల మాట్లాడుతూ కరోనా వైరస్‌ను ఉద్దేశించి దేవుడి చర్య కారణంగా ఆర్థిక కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థ దైవ చర్యతో కుప్పకూలిందని ఆర్థిక మంత్రి చెప్పడం సరైంది కాదని సంజయ్‌ రౌత్‌ మండిపడ్డారు.

ప్రభుత్వ వైఫల్యాన్ని దేవుడిపై నెపం వేసి ఎలా చేతులుదులుపుకుంటారని ఆయన నిలదీశారు. ‘దేవుడి తప్పిదమే అయితే ఏ కోర్టులో ఆయనను విచారిసారు..? ప్రభుత్వ చేతికానితనానికి దేవుడిపై నెపం మోపడం హిందుత్వకు అవమానకరమ’ని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనా శివసేన నేత విమర్శలు గుప్పించారు. ‘మన ప్రధాని అన్ని విషయాల గురించి మాట్లాడతారు..దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థపై మాత్రం నోరుమెదపరు..నోట్ల రద్దు నుంచి లాక్‌డౌన్‌ వరకూ సాగిన ప్రయాణంలో మన ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైంద’ని రౌత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్‌-19 ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు బ్రెజిల్‌ సహా పలు దేశాలు తమ పౌరులకు ఆర్థికంగా చేయూత అందించాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆయా ప్రభుత్వాలు కోవిడ్‌-19 సమస్యను దైవ ఘటనగా చూడలేదని, ఆర్థిక సంక్షోభంగానే పరిగణించి పౌరులను ప్రభుత్వాలు ఆదుకున్నాయని అన్నారు. చదవండి : ‘కంగనా ఓ మెంటల్‌ కేసు’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top