మోదీ, అమిత్ షా ఇలాఖాలో దాడులు.. సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు

Sanjay Raut Comments On Madhya Pradesh Violence - Sakshi

సాక్షి, ముంబై: కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌పై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి సందర్బంగా చోటుచేసుకున్న ఘర్షణలపై రౌత్‌.. ‘సామ్నా’ పత్రిక వేదికగా స్పందించారు. ఈ క్రమంలో బీజేపీ వ్యూహాలను ఎండగట్టారు.

కాగా, దేశంలో మ‌త‌క‌ల్లోలాల‌ను రేకెత్తించి, ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందాల‌న్న‌దే బీజేపీ వ్యూహ‌మ‌ని సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఖర్గోన్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను చూసి శ్రీరాముడే విసుగెత్తిపోయాడ‌ని ఎద్దేవా చేశారు. పండుగ సంద‌ర్భంగా చెల‌రేగిన హింస‌ శ్రీరాముడి ఆలోచ‌న‌కే వ్య‌తిరేక‌మ‌ని అన్నారు. రామ మందిర ఉద్య‌మాన్ని మ‌ధ్య‌లోనే నిలిపేసిన వారే, ఇప్పుడు శ్రీరాముడి పేరుతో క‌త్తులు దూస్తున్నార‌ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా మ‌తక‌ల్లోలాల‌ను రేకెత్తించి రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ఈ సందర్బంగానే కొన్నేళ్ల క్రితం శ్రీరామ న‌వమి వేడుక‌లు సంస్కృతికి వార‌ధిగా ఉండేవ‌ని, ఇప్పుడు మ‌త విద్వేషాల‌కు రెచ్చగొట్టేందుకు వేదిక అయ్యాయని విమ‌ర్శించారు. ఇలాంటి ప‌నులు శ్రీరాముడి ఆలోచ‌న‌ల‌కే విరుద్ధ‌మ‌ని తెలిపారు. ‘అస‌లు శ్రీరామ‌నవ‌మి రోజు ఎందుకు హింస జ‌రిగింది? ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సొంత ఇలాఖా అయిన గుజ‌రాత్‌లో శ్రీరామ న‌వమి యాత్ర‌పై ముస్లింలు దాడి చేస్తార‌ని ఎవ‌రైనా న‌మ్ముతారా?’ అంటూ సంజ‌య్ రౌత్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే నవమి రోజున దేశంలోని వివిధ ప్రాంతాల్లో మత ఘర్షణలను ప్రస్తావిస్తూ, ఇది మంచి సంకేతం కాదని రౌత్ పేర్కొన్నారు. అలాగే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే బీజేపీ ఎజెండాను అమలు చేస్తున్నారని రౌత్ ఆరోపించారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top