తెలంగాణలో కాషాయ జెండా ఎగరాల్సిందే

The saffron flag should fly in Telangana - Sakshi

రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్‌ షా పిలుపు

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర బీజేపీ నాయకులకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సహాయక చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, అదే సమయంలో క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువయ్యేలా కార్యకర్తలు, నాయకులు సహాయక చర్యల్లో పాల్గొనేలా చూడాలని ఆదేశించారు.

శనివారం తనను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌లు తరుణ్‌ ఛుగ్, సునీల్‌ బన్సల్‌తో అమిత్‌ షా రాష్ట్రంలోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతో భేటీ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై ఆరా తీసిన అమిత్‌ షా... రాష్ట్ర నాయకులకు పార్టీ వ్యవహారాలు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలు, బీఆర్‌ఎస్‌ ప్రభు త్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం, ప్రధాని సహా కేంద్రమంత్రుల పర్యటనలు సహా పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు మరింత దూకుడుగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన పరిస్థితుల గురించి కిషన్‌రెడ్డి సహా రాష్ట్ర నాయకులు అమిత్‌ షాకు వివరించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top