
భారత - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌లో మరో జవాన్ వీరమరణం పొందారు. సరిహద్దుల్లో పోరాడుతూ.. మహారాష్ట్ర - తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లా తమ్లూర్ గ్రామానికి చెందిన ఆర్మీ సోల్జర్ 'సచిన్ యాదవ్‌రావు వనాంజే' (29) జమ్మూ కాశ్మీర్‌లో నేలకొరిగారు. సచిన్ మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
యుద్ధంలో ఇప్పటికే తెలుగు జవాన్ మురళీ నాయక్ (22) వీర మరణం పొందారు. దేశ రక్షణలో శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో దాయాది బుల్లెట్‌కు బలయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద పని చేస్తున్నారు.
ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స నిమిత్తం విమానంలో ఢిల్లీకి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే తనువు చాలించారు. దేశ భద్రతలో తన ప్రాణాలను పణంగా పెట్టిన మురళీ నాయక్ త్యాగం మన దేశం ఎప్పటికీ మరువలేనిదని కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు నివాళులర్పించారు.