కీలక పదవిలో అరుణ్‌ జైట్లీ కుమారుడు!

Rohan Jaitley files nomination for DDCA president - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి, దివంగత బీజేపీ నేత అరుణ్‌ జైట్లీ కుమారుడు రోహాన్‌ జైట్లీ ఓ కీలక పదవి కోసం పోటీపడుతున్నారు. ఢిల్లీ డిస్ట్రిక్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ (డీడీసీఏ) ప్రెసిడెంట్‌ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ మేరకు రోహాన్ జైట్లీ బుధవారం నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. సభ్యులంతా ఆయననే మద్దతు తెలుపుతుండటంతో ఎన్నికల లాంఛనం కానున్నట్లు సమాచారం. ఇక డీసీసీఏ పదవికి నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం పలువురు ప్రముఖలు జైట్లీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఢిల్లీ డాషింగ్ బ్యాట్స్‌మెన్‌ శిఖర్‌ దావన్‌ ట్విటర్‌ వేదికగా విషెష్‌ తెలియజేశాడు. అతను విజయం సాధించాలని, డీడీసీఏ మరింత అభివృద్ధి చెందాలని  ఆకాంక్షించాడు. మరోవైపు రోహాన్‌ ఎన్నికకు తామంతా సహకరిస్తామని డీసీఏ సభ్యులు తెలిపారు.

ఢిల్లీ క్రికెట్‌ సంఘానికి కేంద్రమాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ ఎంతో సేవ చేసిన విషయం తెలిసిందే. 1999 నుంచి 2013 వరకు ఢిల్లీ క్రికెట్‌ అసోషియేషన్‌కు అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం సేవలు అందించారు.  ఆయన సారథ్యంలో ఎంతో మంది ఆటగాళ్లు జాతీయ జట్టుకు సైతం ఎంపికయ్యారు. ఆయన సేవలను గుర్తించిన డీసీఏ జైట్లీ మరణాంతరం ఢిల్లీలోని ప్రముఖ ఫిరోజ్ ‌షా కోట్ల మైదానానికి అరుణ్‌ జైట్లీ పేరు పెట్టి ఘనంగా సత్కరించింది. అయితే తండ్రి వారసత్వంలో కొనసాగాలి అనుకున్న రోహాన్‌.. స్థానిక పెద్దల సహకారంతో డీడీసీఏ పదవికి నామినేషన్‌ వేశారు. అయితే రోహాన్ ఎన్నికకు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో ఎన్నిక నల్లేరు మీద నడకే కానుంది.

మరోవైపు డీడీసీఏలో తారాస్థాయిలో అంతర్యుద్దం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక గత కొంతకాలంగా ముఖ్య కార్యదర్శి వినోద్‌ తిహారాతో అధ్యక్షుడు రజత్‌ శర్మకు పొసగటం లేదు. అరుణ్‌ జైట్లీ మరణం తర్వాత డీడీసీఏ సభ్యుల మధ్య బేదాభిప్రాయాలు రావడం అంతేకాకుండా రజత్‌ శర్మపై అన్ని వైపులా ఒత్తిడి పెరిగిపోయింది. ముఖ్యంగా తమ నిర్ణయాలకు అధ్యక్షుడు వ్యతిరేకించడంతో సంఘం సభ్యులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ, డిస్ట్రిక్ట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ)  అధ్యక్ష పదవికి గత ఏడాది నవంబర్‌లో సీనియర్‌ జర్నలిస్టు రజత్‌ శర్మ రాజీనామా చేయడంతో ఒక్కసారిగా కలకలం రేపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top