మహిళా రిజర్వేషన్ల క్రెడిట్‌ ప్రతిపక్షాలకే | Respect For Women is Respect for Nation: PM Modi on Womens Reservation Bill Ahead of Special Parliament Session | Sakshi
Sakshi News home page

మహిళా రిజర్వేషన్ల క్రెడిట్‌ ప్రతిపక్షాలకే

Apr 17 2026 4:54 AM | Updated on Apr 17 2026 4:54 AM

Respect For Women is Respect for Nation: PM Modi on Womens Reservation Bill Ahead of Special Parliament Session

వారికే ఖాళీ చెక్కు ఇచ్చేస్తున్నాం..  

బిల్లు ఆమోదం పొందాక ప్రభుత్వ ఖర్చుతో ప్రతిపక్షాలకు ప్రచారం చేస్తాం

హోర్డింగ్‌లపై విపక్ష నాయకుల ఫొటోలు ఉంచేందుకు సిద్ధంగా ఉన్నాం

రిజర్వేషన్ల అమలును మీరు వ్యతిరేకిస్తే మాకే రాజకీయ ప్రయోజనం  

2024లో తక్కువ సమయం ఉండడం వల్లే రిజర్వేషన్లు అమలు చేయలేకపోయాం

2029లో కూడా రిజర్వేషన్లు కల్పించకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు  

పునర్వీభజనలో ఏ ఒక్క రాష్ట్రంపైనా వివక్ష చూపే ప్రసక్తే లేదు  

లోక్‌సభ స్థానాల నిష్పత్తిలో ఎటువంటి మార్పు ఉండదు  

లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టికరణ  

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుతో ముడిపడి ఉన్న నియోజకవర్గాల పునర్వీభజనలో ఏ ఒక్క రాష్ట్రంపైనా వివక్ష చూపే ప్రసక్తే ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. అది పెద్ద రాష్ట్రమైనా లేక చిన్న రాష్ట్రమైనా.. ఉత్తర, దక్షి ణ, తూర్పు, పశ్చిమ రాష్ట్రమైనా కూడా ఎలాంటి అ న్యాయం జరగదని స్పష్టంచేశారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్వీభజనలో సంస్కరణలను వ్యతిరేకించేవారిని మహిళలు ఎప్పటికీ క్షమించబోరని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ప్రధాని మోదీ జోక్యం చేసుకున్నారు. దాదాపు 40 నిమిషాలపాటు మాట్లాడారు. నియోజకవర్గాల పునర్వీభజన ప్రక్రియతో ఏ ఒక్క రాష్ట్రంలోనూ లోక్‌సభ స్థానాల నిష్పత్తి తగ్గదని వెల్లడించారు.

లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఆ నిష్పత్తిలో ఎటువంటి మార్పు ఉండదని, పెరుగుదల కూడా అదే నిష్పత్తిలో ఉంటుందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుపై అధికార పక్షం ఘనతను(క్రెడిట్‌) ఆశించడం లేదని.. ఆ క్రెడిట్‌ను ప్రతిపక్షాలే తీసుకోవచ్చని సూచించారు. ప్రతిపక్షాలకే ఖాళీ చెక్కు ఇచ్చేస్తున్నానని తెలిపారు. అంతేకాకుండా బిల్లు ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వ ఖర్చుతో ప్రతిపక్షాలకు ప్రచారం చేస్తామని, హోర్డింగ్‌లపై ప్రతిపక్ష నాయకుల ఫొటోలు ఉంచేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ల అమలును ఒకవేళ ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తే తనకు సహజంగానే రాజకీయ ప్రయోజనం దక్కుతుందన్నారు. కానీ, విపక్షాలు సహకరిస్తే ఎవరికీ ఎలాంటి రాజకీయ ప్రయోజనమూ లభించదని చెప్పారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే..  

ఉద్దేశం స్పష్టంగా ఉన్నప్పుడు..  
‘‘చట్టసభల్లో రిజర్వేషన్‌ అనేది ఈ దేశ మహిళల హక్కు. కాబట్టి వారికి తాము ఏదో ఇస్తున్నామనే భ్రమలో ఎవరూ ఉండకూడదు. రిజర్వేషన్లపై మాకు క్రెడిట్‌ వద్దు. ఈ విషయంలో హామీ(గ్యారంటీ) అనే పదాన్ని వాడాలని మీరు కోరుకుంటే నేను ఆ పదాన్నే వాడతాను. నేను వాగ్దానం(ప్రామిస్‌) చేయాలని మీరు కోరుకుంటే నేను ఆ పదాన్నే ఉపయోగిస్తా. ఎందుకంటే ఉద్దేశం స్పష్టంగా ఉన్నప్పుడు పదాలతో ఆడుకోవాల్సిన అవసరమే ఉండదు. నియోజకవర్గాల పునర్వీభజనపై ఎవరికీ ఎలాంటి సందేహాలు, భయాందోళనలు అవసరం లేదు. ఏ ఒక్క రాష్ట్రానికీ అన్యాయం జరగదు, వివక్ష చూపడం ఉండదు.  

దయచేసి రాజకీయ కోణంలో చూడొద్దు  
మహిళలకు హక్కులు కల్పించడాన్ని గతంలో వ్యతిరేకించినవారు మహిళల నుంచి ఆగ్రహాన్ని చవిచూశారు. తగిన పర్యవసానాలు ఎదుర్కొన్నారు. అలాంటి వారిని మహిళలు క్షమించలేదు. మహిళా రిజర్వేషన్లను దయచేసి రాజకీయ కోణంలో చూడొద్దని అందరినీ కోరుతున్నా. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు మనల్ని గమనిస్తున్నారు. వారు మన నిర్ణయాలను పరిశీలిస్తారు. నిర్ణయం కంటే కూడా మన ఉద్దేశాన్ని ఎక్కువగా బేరీజు వేస్తారు.

మన ఉద్దేశంలో ఏమాత్రం లోపం ఉన్నా మహిళలు మనల్ని ఎప్పటికీ క్షమించరు. 2023లో పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్లపై చర్చ జరుగుతున్న సమయంలో ‘త్వరపడండి’అంటూ ప్రజలు గొంతెత్తారు. కానీ, 2024లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయలేకపోయాం. చాలా తక్కువ సమయం ఉండడమే అందుకు కారణం. ఇప్పుడు మనకు తగినంత సమయం ఉంది. 2029లో కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఇకపై ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. అదే నేటి అనివార్యత.  

ఆ ధైర్యం లేక సాంకేతిక సాకులు వెతుకుతున్నారు 
మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని వ్యతిరేకిస్తే ప్రతిపక్షాలకే ప్రమాదం. దేశంలోని నారీ శక్తి అంతా నిశితంగా గమనిస్తోంది. మహిళల హక్కులను వ్యతిరేకించిన వారి పట్ల చరిత్ర ఎప్పుడూ దయతో వ్యవహరించలేదు. ఎంపీలందరినీ మహిళలు గమనిస్తున్నారు. రిజర్వేషన్ల విషయంలో ఎంపీల్లో తప్పుడు ఉద్దేశాలు ఉంటే ఆ విషయం మహిళలు ఎప్పటికీ మర్చిపోరు. అందుకే మన ఉద్దేశాల్లో నిజాయతీ ఉండాలి. మహిళా రిజర్వేషన్ల అమల్లో ఇప్పటికే 30 ఏళ్లు ఆలస్యం జరిగింది. మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు సాంకేతిక సాకులు (టెక్నికల్‌ బహనేబాజీ) వాడుతున్నాయి. మహిళల హక్కులను బహిరంగంగా తిరస్కరించే ధైర్యం వారికి లేదు. అందుకే సాంకేతిక సాకులు వెతుకుతున్నారు. కానీ, ఇప్పుడు మీరు మహిళలను మోసం చేయలేరు.

నల్ల రంగు దుస్తులు ధరించినవారికి కృతజ్ఞతలు  
మహిళా కోటా చట్ట సవరణ బిల్లుకు నిరసనగా కొందరు నల్ల రంగు దుస్తులు ధరించి సభకు రావడాన్ని గమనించాం. నల్ల రంగు దుస్తులు దిష్టి తగలకుండా కాపాడే ‘కాలా టికా’లాగా పనిచేస్తాయి. కొందరు కొన్నిచోట్ల నల్ల జెండాలు కూడా ఎగురవేశారు. మన దేశంలో ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు దిష్టి పోవడానికి నల్లటి తిలకం దిద్దుకొనే సంప్రదాయం ఉంది. ఈ రోజు నల్ల రంగు దుస్తులు ధరించి వచి్చనవారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’’అని ప్రధాని మోదీ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement