భారత రాజకీయ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డు నరేంద్ర మోదీ ఖాతాలో జమ కానుంది. అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నేతగా ఆయన చరిత్ర సృష్టించబోతున్నారు. తద్వారా.. స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ఇన్నేళ్ల తర్వాత మోదీ చెరిపేయబోతున్నారు.
మోదీ ఇవాళ్టితో.. ప్రధానిగా నెహ్రూ పదవి కాలాన్ని సమం చేయబోతున్నారు. రేపటితో(జూన్ 10) 4,399 రోజులతో అత్యధిక కాలం నిరవధిక ప్రధానమంత్రి పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటారు. నెహ్రూ తరహాలోనే.. వరుస ఎన్నికల్లో ఎన్నికై మోదీ ఈ రికార్డును నెలకొల్పడం గమనార్హం.
2014 మే 26న తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ.. 2019, 2024 ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించి అధికారంలో కొనసాగుతున్నారు. దీంతో ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి అత్యధిక కాలం నిరవధికంగా ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నాయకుడిగా నిలిచారు.
ఇప్పటివరకు ఈ రికార్డు జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉంది. 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల తర్వాత నెహ్రూ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 1964 మే 27న మరణించే వరకు 4,398 రోజుల పాటు పదవిలో కొనసాగారు. ఇక మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1966 జనవరి నుంచి 1977 మార్చి వరకు 4,077 రోజుల పాటు ప్రధానమంత్రి పదవిలో కొనసాగి.. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు.
భారత ప్రధానమంత్రుల పదవీకాలం – టాప్ లిస్ట్
- జవహర్‌లాల్ నెహ్రూ – 4,398 రోజులు (ఎన్నికల తర్వాత నిరవధిక పదవీకాలం)
- నరేంద్ర మోదీ – 4,399+ రోజులు (ప్రస్తుత ప్రధానమంత్రి)
- ఇందిరా గాంధీ – 4,077 రోజులు
- మన్మోహన్ సింగ్ – 3,652 రోజులు (2004–2014)
- అటల్ బిహారీ వాజ్‌పేయి – 2,272 రోజులు (మూడు విడతలు కలిపి)
- పి.వి. నరసింహారావు – 1,827 రోజులు
- రాజీవ్ గాంధీ – 1,826 రోజులు
- మొరార్జీ దేశాయ్ – 857 రోజులు
- లాల్ బహదూర్ శాస్త్రి – 576 రోజులు
అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. జవహర్‌లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలా.. 1964 మే 27న మరణించే వరకు మొత్తం 6,131 రోజులు పదవిలో కొనసాగారు. అయితే 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల తర్వాత ఎన్నికైన ప్రధానమంత్రిగా ఆయన కొనసాగిన కాలాన్ని మాత్రమే అధికారిక రికార్డుగా పరిగణిస్తారు. అందుకే ప్రస్తుతం నరేంద్ర మోదీ అధిగమిస్తున్నది నెహ్రూ మొత్తం పదవీకాల రికార్డు కాదు.. ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి నిరవధికంగా కొనసాగిన ప్రధానమంత్రి రికార్డు మాత్రమే.
అంటే.. ఆ రికార్డు ఇంకా నెహ్రూ పేరిటే పదిలంగా ఉందన్నమాట. మోదీ ప్రధానిగా ఇంకో 1,732 రోజులు.. అంటే దాదాపు 4 సంవత్సరాలు 9 నెలలు పూర్తి చేసుకుంటే ఆ రికార్డు కూడా బద్ధలు కానుంది.
మరోవైపు మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. గత 12 ఏళ్లలో దేశంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, ఆ మార్పుల కేంద్రబిందువు పేదలు, అట్టడుగు వర్గాల సంక్షేమమేనని పేర్కొన్నారు. జన్‌ధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు, స్వచ్ఛ భారత్, ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా కోట్లాది మందికి ప్రయోజనం చేకూర్చామని మోదీ తెలిపారు. అభివృద్ధి ఫలాలు అందని వర్గాలకు చేరేలా పనిచేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
అయితే మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వానికి పలు సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. నీట్, సీబీఎస్‌ఈ పరీక్షల వ్యవహారాలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రతిపక్షాల నుంచి విమర్శలకు దారితీస్తున్నాయి. అదే సమయంలో మహిళా రిజర్వేషన్, ఒకే దేశం-ఒకే ఎన్నిక, నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక అంశాలను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
మొత్తానికి, ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి నిరవధికంగా అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన నేతగా నరేంద్ర మోదీ కొత్త చరిత్ర సృష్టించడం భారత రాజకీయాల్లో మరో ముఖ్య ఘట్టంగా నిలవనుంది.


