చంపత్ రాయ్ రాజీనామాపై తుది నిర్ణయం
సిట్ మధ్యంతర విచారణ నివేదికపై చర్చ
అయోధ్య: అయోధ్య రామాలయం శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక సమావేశం సోమవారం జరగనుంది. ఆలయ విరాళాల చోరీ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడి ఆశ్రమంలో జరిగే ఈ భేటీకి ట్రస్ట్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులంతా హాజరు కావాలని ట్రస్ట్ ట్రెజరర్ గోవింద్ కోరారు.
వయో సంబంధ సమస్యలతో చికిత్స పొందుతూ శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 89 ఏళ్ల ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ సమావేశానికి వస్తారని తెలుస్తోంది. ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసుకునేందుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి(సీఈవో)ని నియమించే విషయం చర్చకు రానుంది. ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న గోపాల్ రావు పాత్రపైనా చర్చ జరిగే అవకాశముందంటున్నారు. ఆలయంలో విరాళాల మాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అందజేసిన మధ్యంతర నివేదికలోని అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.
ఈ భేటీలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆలయ ఆదాయ వ్యయాల నివేదికను ఆమోదించనున్నారు. ప్రస్తుతం ట్రస్ట్ అధ్యక్షుడు నృత్యగోపాల్ దాస్‌తోపాటు 11 మంది రెగ్యులర్ సభ్యులున్నారు. ఆలయ విరాళాల వ్యవహారంపై ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే వ్యక్తం చేసిన అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు సంస్థ చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ వ్యవహారం హిందూ సమాజం నమ్మకాన్ని తీవ్రంగా గాయపరిచిందని ఇటీవల హొసబలే పేర్కొన్నారు. ఈ దురదృష్టకర ఘటనను ఆసరాగా చేసుకుని కొన్ని శక్తులు హిందూ ధర్మం ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. వీటిని హిందూ సమాజం ఓపిక, నిగ్రహంతో ఐక్యంగా ఎదుర్కోవాలని ఆయన కోరారు.


