1000 కోట్లు దాటిన అయోధ్య విరాళాలు

Ram Temple donations cross Rs 1500 crore - Sakshi

అయోధ్య మందిరానికి పెద్ద ఎత్తున అందుతున్న విరాళాలు

సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయి. తన ఆరాధ్య దైవం రాముడి మందిర నిర్మాణంలో తామూ భాగస్వామ్యం కావాలని దేశ వ్యాప్తంగా హిందువులు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. హిందువులే కాకుండా వివిధ వర్గాలకు చెందిన రామభక్తులు సైతం దీనిలో పాలుపంచుకుంటున్నారు. దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం మందిర నిర్మాణం జరుగుతుండటంతో ఆలయ కమిటీ సైతం పెద్ద ఎత్తున నిధులను సేకరిస్తోంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా అయోధ్యలో రామమందిరం నిర్మించాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యులు భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల గ్రామాల్లో 11 కోట్లు కుంటుంబాలను ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యులను చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే దేశ వ్యాప్తంగా నిధులను సమీకరిస్తున్నారు.

ఆలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతులు మంజూరు చేసినప్పటి నుంచి ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు విరాళాలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు (ఫిబ్రవరి 12) వచ్చిన విరాళాల వివరాలను తీర్థక్షేత్ర నిర్వహకులు వెల్లడించారు. శుక్రవారం నాటికి 1511 కోట్ల రూపాయాలు అందాయని తెలిపారు. ఫిబ్రవరి 27 వరకు విరాళాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. జనవరి 15 నుంచి పిబ్రవరి 27 వరకు దేశవ్యాప్తంగా విరాళాల కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. కాగా అయోధ్యలోని 2.7 ఎకరాల స్థలంలో రామమందిర నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. హిందువులు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ దేవాలయల పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 1500 కోట్లతో ఆలయాన్ని నిర్మించాలని ప్రణాళికలు తయారు చేశారు.

భూకంపాలు, తుపాన్‌ బీభత్సాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునేలా ఆలయ నిర్మాణం సాగుతుంది. అందుకే ఈ నిర్మాణంలో ఇనుము వాడడం లేదు. వేల ఏళ్లయినా చెక్కు చెదరకుండా ఉండడానికి రాతితో నిర్మించే మందిరంలో ప్రతీ రాయికి మధ్య రాగి పలకల్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 18 అంగుళాల పొడవు, 30 మి.మీ. వెడల్పు, 3 మి.మీ. లోతు కలిగిన 10 వేల రాగి పలకలు అవసరమవుతాయి. ఈ రాగి పలకల్ని విరాళంగా అందివ్వాలని మందిరం ట్రస్ట్‌ రామ భక్తులకు పిలుపునిచ్చింది. దాతలు వాటిపై తమ కుటుంబ సభ్యుల పేర్లు, వంశం పేరు రాయవచ్చునని పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top