ఎన్‌వైఏవై అమలు చేయండి: రాహుల్‌ గాంధీ డిమాండ్‌

Rahul Gandhi Demands For Implementation of NYAY  - Sakshi

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో కుదేలయిన పేదలను ఆదుకునేందుకు తాము ప్రతిపాదించిన ఎన్‌వైఏవై(న్యూన్‌తమ్‌ ఆయ్‌ యోజన) పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఈ పథకంతో పేదలకు ప్రత్యక్ష నగదు బదిలీ చేయాలని, చిన్న, సన్నకారు వ్యాపారాలను ఆదుకోవాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని ఆయన కోరారు.  2019 ఎన్నికల వేళ కాంగ్రెస్‌ ఈ పథకానికి రూపకల్పన చేసింది. పేదలకు ఏడాదికి రూ.72వేలను నేరుగా అందించడమే ఈ పథకం ముఖ్యోద్దేశం.

గురువారం ఉదయం పదిగంటల నుంచి పదిగంటల పాటు కాంగ్రెస్‌ ‘స్పీకప్‌ ఫర్‌ జాబ్స్‌’ పేరిట ఉపాధి అవకాశాల కల్పనపై ప్రచారం జరిపింది. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్‌ నేతలు తాము ప్రకటించిన ఎన్‌వైఏవై కార్యక్రమాన్ని అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. ప్రభుత్వం ప్రస్తుత సంక్షోభ సమయంలో ఉద్యోగాలు కోల్పోతున్నా పట్టించుకోవడం లేదంటూ ఈ సందర్భంగా రాహుల్‌ ఆరోపించారు. దేశ ఎకానమీ, చైనాతో సమస్యల విషయంలో మౌనంగా ఉండడంపై ప్రధానిని ఆయన నిలదీశారు. కరోనా సంక్షోభానికి ముందే త్వరలో ఇబ్బందులొస్తాయని తాను హెచ్చరించినా మోదీ పట్టించుకోలేదన్నారు.

పేదలను ఆదుకోకుండా ప్రధానికి సన్నిహితులైన కొంతమందికి లక్షల కోట్ల రూపాయల రుణమాఫీలు, పన్ను రాయితీలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఎకానమీ నాశనమయిందని, యువత నిర్వీర్యమవుతోందని, ప్రధాని ఇప్పటికైనా వీటిపై దృష్టి పెట్టాలని కోరారు. పేదలను ప్రత్యక్ష నగదు బదిలీతో ఆదుకోవడం, ఎంఎస్‌ఎంఈలను రక్షించడం, ప్రైవేటీకరణను ఆపడం చేయాలని కోరారు. మోదీ విధానాల వల్ల లక్షలాది ఉద్యోగాలు పోవడం, జీడీపీ చారిత్రక కనిష్ఠాలకు పడిపోవడం జరిగిందన్నారు. కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా సైతం రాహుల్‌ విమర్శలను సమర్ధించారు. దేశ భవిష్యత్‌ కోసం అందరూ గళం విప్పాలన్నారు. పలువురు కాంగ్రెస్‌ నేతలు సైతం ఉద్యోగ కల్పన జరగడం లేదంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు.

చదవండి: పార్లమెంట్‌ సెషన్‌.. సిద్ధమవుతోన్న కాంగ్రెస్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top