Sakshi News home page

బెంగాల్‌లోకి అడుగుపెట్టిన రాహుల్‌ యాత్ర

Published Thu, Jan 25 2024 12:45 PM

Rahul Gandhi Bharat Jodo Nyay Yatra enters Bengal - Sakshi

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర గురువారం పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోకి ప్రవేశించింది. అస్సాం నుంచి బెంగాల్‌లోని కూచ్‌ బెహార్‌ జిల్లాలోకి రాహుల్‌ అడుగుపెట్టారు. వయనాడ్‌ ఎంపీకి స్వాగతం పలికేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నారు.

అయితే ఇండియా కూటమిలో కీలక భాగస్వామి అయిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో తాము ఒంటరిగా పోటి చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌తో సీట్ల పంపకంపై చర్చలు విఫలమయ్యాయని, దీంతో ఆ పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదని ఆమె స్పష్టం చేశారు. అంతేగాక రాహుల్‌ యాత్ర రాష్ట్రంలోకి(పశ్చిమ బెంగాల్‌) వస్తున్న సమయంలో దీనిపై తమకు కనీస సమాచారం ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. 

వచ్చే ఎన్నికల్లో బెంగాల్‌లో పోటీ సీట్ల పంపకంపై కాంగ్రెస్‌, టీఎంసీ మధ్య విభేదాలు నెలకొన్న వేళ రాహుల్‌ యాత్ర ఎలా సాగబోతుంది. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారనే విషయాలపై ఉత్కంఠ నెలకొంది. బెంగాల్‌లో యాత్ర ప్రారంభమైన సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జరుగుతోన్న అన్యాయానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి పోరాడుతుందని తెలిపారు.
చదవండి: అస్సాంలో రాహుల్ గాంధీపై నమోదైన కేసు సీఐడీకి బదిలీ 

దేశంలో అన్యాయం రాజ్యమేలుతోందని అందుకే తమ యాత్రకు ‘న్యాయ’ అనే పదాన్ని చేర్చినట్లు చెప్పారు.  పశ్చిమ బెంగాల్‌కు రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల మాటలు వినడానికి, వారికి అండగా ఉండేందుకు ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. దేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విద్వేషాలు పెంపొందిస్తుందని మండిపడ్డారు. హింస, అన్యాయాన్ని వ్యాప్తి చేస్తున్నాయని విమర్శించారు. అందుకే ఇండియా కూటమి సమిష్టిగా అన్యాయంపై పోరాడబోతోందని తెలిపారు.

జనవరి 14న  ప్రారంభించిన రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ యాత్ర గురువారం 12వ రోజుకు చేరుకుంది. మణిపూర్‌, నాగాలాండ్‌, మేఘాలయా, అస్సాం రాష్ట్రంలో ఇప్పటి వరకు పర్యటించారు. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాహుల్‌ యాత్ర తీవ్ర ఉద్రిక్తల నడుమ సాగుతోంది. మార్చి 20న ముంబైలో రాహుల్‌ యాత్రం ముగియనుంది. మొత్తం 15 రాష్ట్రాల గుండా 6,200 కి.మీ పర్యటించనున్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement