
గురుగ్రామ్: టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య కేసుకు సంబంధించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కూతుర్ని ఆంక్షల నడుమ బంధించడానికి యత్నించే క్రమంలోనే ఈ హత్య జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రాధిక ప్రాణ స్నేహితురాలు స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తల్లిదండ్రులు.. రాధికను నియంత్రించారని పేర్కొంది. రాధికను తనకు నచ్చిన విధంగా జీవించనివ్వలేదని తెలిపారు.
రాధిక ప్రాణ స్నేహితురాలు హిమాన్షిక సింగ్ తాజాగా మాట్లాడుతూ.. రాధిక నాకు 2012 నుంచి తెలుసు. రాధిక ఎంతో సున్నితమైన మనసు కలిగి ఉంది. రాధిక కుటుంబ సభ్యులు.. ఆమెను నియంత్రించే వారు. ఆమె నాతో వీడియో కాల్‌లో ఉన్నప్పుడు, ఆమె ఎవరితో మాట్లాడుతుందో తల్లిదండ్రులకు చూపించాల్సి వచ్చింది. టెన్నిస్ అకాడమీ తన ఇంటి నుంచి కేవలం 15 నిమిషాల దూరంలో ఉన్నప్పటికీ, ఆమె ఎప్పుడు తిరిగి రావాలన్న దానిపై డెడ్‌లైన్ ఉండేది. రాధికది సంప్రదాయ కుటుంబమని, దాదాపు ప్రతి దానితోనూ సమస్యలు ఉండేవని తెలిపింది. ప్రతి విషయంలోనూ నియంత్రణ విధిస్తూ రాధిక జీవితాన్ని ఆమె తండ్రి దుర్భరం చేశాడు.
బయటకు వెళ్లాక పలానా సమయంలో తిరిగి ఇంటికి రావాలని ఆంక్షలు విధించేవారు. రాధిక కదలికలను ఇంట్లోవారు నియంత్రించారు. అతను తన నియంత్రణ, ప్రవర్తన, నిరంతర విమర్శలతో కుమార్తె జీవితాన్ని సంవత్సరాలుగా దుర్భరంగా మార్చాడు. షార్ట్స్ ధరించినందుకు, అబ్బాయిలతో మాట్లాడినందుకు, తన సొంత నిబంధనల ప్రకారం జీవించినందుకు వారు ఆమెను అవమానించారు. క్రమంగా వీడియోలు చిత్రీకరించడం వంటి ఆమె అభిరుచులన్నీ కనుమరుగయ్యాయి. ఆమె ఇంట్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. కుటుంబంపై సామాజిక ఒత్తిడి ఉంది. ప్రజలు ఏమనుకుంటారో అని తల్లిదండ్రులు ఎల్లప్పుడూ ఆందోళన చెందేవారు. ఇంట్లోని ఆంక్షలతో ఆమె ఊపిరాడనట్టు ఉండేది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ రాధిక హత్యకు కారణమని తెలిపారు. రాధిక.. తన పేరెంట్స్‌కు నచ్చని కొని పనుల కారణంగానే హత్యకు గురైందని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. రాధికా యాదవ్ టెన్నిస్ కోచ్‌లలో ఒకరైన అజయ్ యాదవ్ కూడా ఆమె హత్యపై స్పందించారు. ఈ సందర్భంగా యాదవ్ మాట్లాడుతూ..‘ఇంట్లోని కొన్ని పరిమితులు, ఆంక్షలతో రాధిక సతమతమైనట్లు వెల్లడించారు. తనకు వాట్సాప్ చాట్ టెక్ట్స్ మెసేజ్‌లు, వాయిస్ చాట్‌లలో ఆమె చెప్పిన కొన్ని విషయాలను జాతీయ మీడియాకు చూపించారు. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.