‘సరిగానే వేశానా.. బుట్టలో పడిందా?’

Priyanka Gandhi Tries Hand at plucking Tea Leaves in Assam - Sakshi

అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక

తేయాకు కార్మికులు కోసం పోరాడతాం: ప్రియాంక

గువాహటి: త్వరలో దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన నాయకులు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలు పార్టీ తరఫున ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రచారం విషయలో గతంతో పోలిస్తే.. ఈ సారి వీరద్దరూ తమ పంథాను మార్చుకున్నారు. ప్రజలతో మమెకమవతూ.. వారు చేసే పనుల్లో పాలుపంచుకుంటూ.. కష్టసుఖాలు తెలుసుకుంటూ.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తమిళనాడు ప్రచారంలో రాహుల్‌ గాంధీ బస్కీలు తీస్తూ.. ముంజలు తింటూ.. డ్యాన్స్‌ చేస్తూ ఆకట్టుకోగా.. తాజాగా ప్రియాంక గాంధీ కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రియాంక గాంధీ టీ ఎస్టేట్‌లో పని చేస్తోన్న వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక టీ ఎస్టేట్‌లో పని చేస్తోన్న కూలీలతో కలిసి తేయాకు తెంపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. 

బిశ్వనాథ్‌ ప్రాంతంలోని సాధురు టీ ఎస్టేట్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రచారంలో భాగంగా టీ తోటల్లోకి వెళ్లిన ప్రియాంక.. అక్కడి కూలీలతో కలిసి కాసేపు పనిచేశారు. తలకు బుట్టవేసుకుని తేయాకు తెంపారు. దాన్ని బుట్టలో వేసే సమయంలో ‘‘సరిగానే వేశానా.. కరెక్ట్‌గా బుట్టలో పడిందా’’ అంటూ పక్కన ఉన్న వారిని ప్రశ్నించారు. అనంతరం తోట పక్కనే కూర్చుని కూలీలతో ముచ్చటించారు. ‘‘తేయాకు కూలీలు అస్సాంతో పాటు ఈ దేశానికి కూడా విలువైనవారు. మీ హక్కులను పరిరక్షించేందుకు, మీకు గుర్తింపు తెచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ అన్నివేళలా పోరాడుతూనే ఉంటుంది’’ అని తెలిపారు ప్రియాంక గాంధీ. 

ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట అయిన అస్సాంలో గత ఎన్నికల్లో భారీ షాక్‌ తగిలింది. అక్కడ ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను గద్దెదించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఈ సారి అస్సాం ఎన్నికలు కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అయితే కీలక నేత, మాజీ సీఎం తరుణ్‌ గొగొయి మరణం కాంగ్రెస్‌కు లోటుగా మారింది. దీంతో ఈశాన్య రాష్ట్రంలో రంగంలోకి దిగిన ప్రియాంక గాంధీ.. ప్రజలతో మమేకమవుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

చదవండి:
రాహుల్‌ కండలపై నెటిజన్ల ట్రోలింగ్‌
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సీఏఏ నిలిపేస్తాం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top