పుణే పోర్షే కేసు: మకందర్‌కు ఫోన్‌ చేసిందెవరు? | Porsche case: Bribe was paid at juvenile board over swap teen blood sample | Sakshi
Sakshi News home page

పుణే పోర్షే కేసు: మకందర్‌కు ఫోన్‌ చేసిందెవరు?

Published Thu, Jun 13 2024 9:00 AM | Last Updated on Thu, Jun 13 2024 1:13 PM

Porsche case: Bribe was paid at juvenile board over swap teen blood sample

ముంబై: పుణేలో సంచలనం రేపిన పోర్షే కారు ప్రమాదం దర్యాప్తులో పోలీసులు మరో కీలక విషయం బయటపెట్టారు. బ్లడ్‌ శాంపిళ్లు తారుమారు చేయాలని నిందితుడు (మైనర్‌ బాలుడు) తండ్రి డాక్టర్లకు రూ. 3 లక్షల లంచం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ లంచం జువైనల్  జస్టిస్‌ బోర్డు ఆవరణంలో డాక్టర్ల సూచనతో హాస్పిటల్‌ వార్డు బాయ్‌కి అందజేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

నిందితుడి తండ్రి విశాల్‌ అగర్వాల్‌.. బ్లడ్‌ శాంపిళ్లను తన భార్య బ్లడ్‌ శాంపిళ్లతో తారుమారు చేయాలని సూసాన్ ఆస్పత్రి వార్డు బాయ్‌ అతుల్ ఘట్కాంబ్లేకు లంచం ఇచ్చినట్లు తెలిపారు. ఆ లంచాన్ని విశాల్‌ అగర్వాల్‌ ఏకంగా జువైనల్‌ జస్టిస్‌ బోర్టు ఆవరణంలో ఇచ్చారని దర్యాప్తులో వెల్లడైంది. పుణే క్రైం బ్రాంచ్‌ పోలీసులు జువైనల్‌ జస్టిస్ బోర్టు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఈ విషయం బయటపడింది. సూసాన్‌ ఆస్పత్రి ఫొరెన్సిక్‌ విభాగం హెడ్‌ డా.అజయ్‌ తవారే, డా.శ్రీహరి హాల్కర్‌ (చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్) సూచన మేరకు వార్డుబాయ్‌ అతుల్ ఘట్కాంబ్లే లంచం తీసుకోవడానికి అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

చదవండి: పుణే కేసు నిందితుడిపై ‘బుల్డోజర్’ప్రయోగం

మొదట బాలుడి బ్లడ్‌ శాంపిల్‌ నెగటివ్‌ వచ్చింది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు మరోసారి పరీక్ష నిర్వహించగా  రెండు వేర్వేరు వ్యక్తుల రిపోర్టులు వచ్చినట్లు తేలింది. బాలుడి బ్లడ్‌ శాంపిల్‌ను అతని తల్లి శాంపిల్‌తో డాక్టర్లు తారుమారు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. 

మరోవైపు.. ఈ కేసుతో సంబంధం ఉన్న అష్ఫాక్ మకందర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్‌  చేశారు. మకందర్‌.. డాక్టర్లకు, బాలుడి తండ్రి విశాల్‌ అగర్వాల్‌కు మధ్యవర్తిగా పనిచేశాడని క్రైం బ్రాంచ్‌ పోలీసులు వెల్లడించారు.

చదవండి: పూణే ప్రమాదంలో కీలక పరిణామం!.. తెరపైకి ఎమ్మెల్యే కుమారుడు

మే 20న మకందర్‌ సాసూన్‌ ఆస్పత్రికి చేరుకునే ముందు ‘విశాల్‌ అగర్వాల్‌కు సాయం చేయండి’ అని అతనికి ఒకఫోన్‌ కాల్‌ వచ్చింది. తర్వాత మకందర్‌, డాక్టర్‌ తవారే మధ్య సంభాషణ జరిగింది. అయితే మకందర్‌ కాల్‌ చేసి.. విశాల్‌కు సాయం చేయాలన్నది ఎవరూ? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మకందర్ ఫోన్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. మే 19 ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే సునీల్‌ టింగ్రేతో పాటు ఎరవాడ పోలీసు స్టేషన్‌  వద్ద మకందర్‌ ఉండటం గమనార్హం. 

మే19న మైనర్‌ బాలుడు చేసిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ పుణేలో సంచలనం రేపుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement