సాక్షి బెంగళూరు: కర్ణాటకలో కారుతో బీభత్సం సృష్టించిన ఒక ఆకతాయికి పోలీసులు తగిన శిక్ష వేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నడిరోడ్డుపై మాడిఫై చేసిన కారుతో సినిమా స్టంట్‌లు చేస్తూ ఓ ఇంజినీరింగ్ విద్యార్థి బీభత్సం సృష్టించాడు. అనంతరం దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది వైరల్‌గా మారి పోలీసుల వరకూ చేరడంతో రూ. లక్షకు పైగా జరిమానా విధించారు.
ఇటీవలే న్యూఇయర్ వేడుకలు జరుపకోవడానికి కేరళ కన్నూరుకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి బెంగళూరుకు వచ్చారు. అయితే అతను 2002కు చెందిన హోండా సిటీ కారును రూ. 70 వేలకు కొనుగోలు చేశాడు. అనంతరం దానిని రూ. లక్ష ఖర్చు చేసి ఆధునాతనంగా మాఢిపై చేయించాడు. ఈ కారుతో బెంగళూరు రోడ్లపై ప్రమాద కరంగా విన్యాసాలు చేశాడు. మంటలు విదజిమ్ముతూ కారును నడిపాడు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
దీంతో వీటిని చూసి భయాందోళనలకు గురైన ప్రజలు వాటి వివరాలను పోలీసులకు తెలియజేశారు. దీంతో వారు ఆ కారును స్వాధీన పరుచుకొని అనంతరం దానిపై రూ. 1,11,500 భారీ జరిమానా విధించారు. ఆ యువకుడు ఆ మెుత్తాన్ని చెల్లించడంతో కారును అతనికి అప్పజెప్పినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఈ విధంగానే జరిమానా విధిస్తామని పోలీసులు పేర్కొన్నారు.


