
ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన, తృణధాన్యాల మిషన్ ప్రారంభం
ఆహార దిగుమతులు తగ్గించుకోవాలి, ఎగుమతులు పెంచుకోవాలి
వికసిత్ భారత్ సాధనలో రైతన్నలదే కీలకపాత్ర
ప్రజలకు ప్రొటీన్ భద్రత కోసం తృణధాన్యాల సాగును పెంచాలి
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
పలు వ్యవసాయ ప్రాజెక్టులు ప్రారంభం.. మరికొన్నింటికి శంకుస్థాపన
న్యూఢిల్లీ: దేశంలో తృణధాన్యాల ఉత్పత్తిని భారీగా పెంచడంతోపాటు దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో సాగును ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు కీలక పథకాలకు శ్రీకారం చుట్టారు. రూ.24,000 కోట్లతో అమలు చేసే ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన(పీఎం–డీడీకేవై)తోపాటు రూ.11,440 కోట్లతో అమలయ్యే ‘మిషన్ ఫర్ ఆత్మనిర్భర్ ఇన్ పల్సెస్’ను లాంఛనంగా ప్రారంభించారు. అలాగే వ్యవసాయం, పశు పోషణ, మత్స్య, ఆహార శుద్ధి రంగాలకు సంబంధించి రూ.5,450 కోట్ల విలువైన ప్రాజెక్టులు సైతం ప్రారంభించారు. రూ.815 కోట్ల విలువైన మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆహారం విషయంలో దిగుమతులపై ఆధారపడడం తగ్గించుకోవాలని, ఎగుమతులు పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. గతంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే వ్యవసాయ రంగం వెనుకంజలో ఉందని ఆరోపించారు. వ్యవసాయం, దాని బంధాల రంగాలపై కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఏనాడూ ఒక వ్యూహం గానీ, లక్ష్యం గానీ లేవని మండిపడ్డారు.
అంతర్జాతీయ మార్కెట్ల తలుపులు తట్టాలి
పీఎం–డీడీకేవైతోపాటు తృణధాన్యాల మిషన్ అమలుకు రూ. 35,000 కోట్లకుపైగా ఖర్చు చేయబోతున్నామని, దీనివల్ల కోట్లాది మంది రైతన్నలకు లబ్ధి చేకూరుతుందని, వారి జీవితాల్లో మార్పులు వస్తాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ రెండు పథకాలను రాబోయే రబీ సీజన్ నుంచి 2030–31 దాకా అమలు చేస్తారు. 2047నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. వికసిత్ భారత్ సాధనలో అన్నదాతలదే కీలక పాత్ర అని తేల్చిచెప్పారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించామంటే ఆ ఘనత రైతులదేనని ప్రశంసించారు. అదే స్ఫూర్తితో వికసిత్ భారత్ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ మార్కెట్ల అవసరాలకు తగ్గట్టుగా ఆహారం ఉత్పత్తి చేయాలని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్ల తలుపులు తట్టాలని, విదేశాల్లోని డిమాండ్‌ను తీర్చే పంటలు పండిస్తే మనకు లాభదాయకమని పేర్కొన్నారు. ఆహార దిగుమతులు తగ్గించుకోవడం, ఎగుమతులు పెంచుకోవడం అనే రెండు కీలక లక్ష్యాలు కచ్చితంగా సాధించుకోవాలని వివరించారు. ఇందుకు నేడు ప్రారంభించిన రెండు కొత్త పథకాలు దోహదపడతాయని తెలిపారు.
పంటల వైవిధ్యంపై దృష్టి పెట్టాలి
కేవలం వరి, గోధుమలే కాకుండా పంటల వైవిధ్యంపై దృష్టి పెట్టాలని రైతులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ప్రొటీన్ భద్రత కల్పించడానికి తృణధాన్యాల సాగును పెంచాలని చెప్పారు. తృణధాన్యాల ఉత్పత్తి, వినియోగంలో ప్రపంచంలో మన దేశమే తొలిస్థానంలో ఉందన్నారు. అయినప్పటికీ మన అవసరాల కోసం విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘తృణధాన్యాల మిషన్’ కింద తృణధాన్యాల సాగును 2030 నాటికి 35 లక్షల హెక్టార్లకు పెంచనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఏటా 252.38 లక్షల టన్నుల తృణధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయని, 2030–31 నాటికి దీన్ని 350 లక్షల టన్నులకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు.
సాగులో సంస్కరణలకు పెద్దపీట
ఇక పీఎం–డీడీకేవై కింద 100 జిల్లాలో పంటల సాగు పెంచబోతున్నామని, వేర్వేరు శాఖలకు సంబంధించిన 36 పథకాలను మిళితం చేయబోతున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పంటల ఉత్పత్తిని పెంచడం, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, సాగునీరు సదుపాయం, పంటల నిల్వ సామర్థ్యం మెరుగుపర్చడం, రైతులకు రుణాలు ఇవ్వడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల వల్ల అధోగతి పాలైన వ్యవసాయ రంగాన్ని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గాడిలో పెట్టామని గుర్తుచేశారు. ఈ రంగంలో సంస్కరణలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు.
పెట్టుబడులు పెంచుతున్నామని, విత్తనాల నుంచి మార్కెట్ల దాకా సంస్కరణలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. గత 11 ఏళ్లలో వ్యవసాయ బడ్జెట్‌ను ఆరు రెట్లు పెంచామని తేల్చిచెప్పారు. తమ ప్రభుత్వ చర్యల వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు రెండు రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు రూ.2 లక్షల కోట్లు అందజేశామని, ఇది చిన్న మొత్తం కాదని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చాక పదేళ్లలో రైతన్నల బాగు కోసం ఎరువులపై రూ.13 లక్షల కోట్ల రాయితీ ఇచ్చామన్నారు. తృణధాన్యాలు సాగు చేస్తున్న పలువురు రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా సంభాíÙంచారు.