breaking news
Indian Agricultural Research Institute
-
ఐసీఏఆర్ డైరెక్టర్‌గా శ్రీనివాసరావు
సాక్షి, అమరావతి: భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–న్యూఢిల్లీ) సంచాలకులుగా డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు చేపట్టారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి ఈయనే. కృష్ణా జిల్లా అవనిగండ్లపాడుకు చెందిన చెరుకుమల్లి..బాపట్ల వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. ఐసీఏఆర్‌లో పీహెచ్డీ పట్టా పొంది, అదే సంస్థలో ట్రైనీ సైంటిస్ట్‌గా చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ డైరెక్టర్ అయ్యారు. 30 ఏళ్లుగా ఐసీఏఆర్‌లో సేవలందిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ భూ విజ్ఞాన శాస్త్రవేత్తగా చెరుకుమల్లి పేరొందారు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో వస్తోన్న మార్పులు, విధాన నిర్ణయాలపై అంతర్జాతీయ స్థాయి సమావేశాలకు భారత ప్రతినిధిగా హాజరయ్యారు. 300కు పైగా ఈయన సమర్పించిన పరిశోధనా పత్రాలు జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. 8 ఏళ్లుగా హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధనా, విస్తరణ యాజమాన్య అకాడమీ (ఎన్‌ఏఏఆర్‌ఎం) డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వ్యవసాయ పరిశోధన మండలిలో కొత్తగా చేరే యువ శాస్త్రవేత్తలకు దిశా నిర్దేశం చేస్తూ, బోధనలో మార్పులు తీసుకువస్తున్నారు. అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో ఎంబీఏ ప్రొగ్రామ్‌ను ప్రవేశపెట్టి దానికి జాతీయ స్థాయి గుర్తింపును తీసుకువచ్చిన ఘనత చెరుకుపల్లిదే. అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ పొటాష్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్ఏఐ) అవార్డుతో పాటు ఎన్ఏఏఎస్, గోల్డెన్ జూబ్లీ, ఐసీఏఆర్ సంస్థల నుంచి యంగ్ సైంటిస్ట్ అవార్డులు అందుకున్నారు. ఇటీవలే పద్మశ్రీ డాక్టర్ ఐవీ సుబ్బారావు రైతు నేస్తం పురస్కారాన్ని కూడా చెరుకుమల్లి అందుకున్నారు. -
వ్యవసాయంపై మరో గుదిబండ
ఆహార ఉత్పత్తులు, ఉద్యానవన పంటలు, పళ్లు, కాయగూరలు, ప్రాసెస్డ్ ఫుడ్ దిగుమతులు వరదలా వచ్చిపడటంతో ఇప్పటికే కునారిల్లుతున్న భారత వ్యవసాయ రంగం మరింత అధ్వాన్నంగా మారింది. కాబట్టి, ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒడంబడిక (ఆర్సీఈపీ)లో మనం ఎందుకు చేరాలి? చివరికి అమెరికాలో ఉద్యోగావకాశాలను కాపాడటానికి డొనాల్డ్ ట్రంప్ 12 దేశాల ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్షిప్ ఒప్పందం నుంచి బయటకు రావాలనుకుంటున్నప్పుడు, దశాబ్దాలుగా నిర్మించుకున్న ఆహార భద్రతను రక్షించుకోవాల్సిన అవసరం భారత్‌కు ఉంది. ఆహారాన్ని దిగుమతి చేసుకుంటున్నామంటే నిరుద్యోగాన్ని కొనితెచ్చుకోవడమే. ప్రపంచీకరణకు వ్యతిరేక వాతావరణం పుంజుకుంటూ, స్వీయ సంరక్షణతత్వం పెరుగుతున్న వాతావరణంలో ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో వాణిజ్యరంగంలో ప్రపంచ ఆర్థికాభివృద్ధి క్షీణిం చింది. ఇలాంటి నేపథ్యంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని 16 దేశాల మధ్య కుదిరిన భారీ వాణిజ్య ఒడంబడిక ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒడంబడిక (ఆర్సీఈపీ)లో భారత్ చేరుతుండటమనేది రిస్క్‌తో కూడుకున్న సాహసమేనని చెప్పాలి. పైగా దేశీయ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభం గుండా పయనిస్తున్నప్పుడు, వస్తూత్పత్తి రంగం నిత్యం దిగజారిపోతున్న సమయంలో భారత్ పయనం వాంఛనీయం కాదనే చెప్పాలి. నవంబర్ మధ్యలో సింగపూర్‌లో జరిగిన తాజా సంప్రదింపుల్లో ఈ సంవత్సరం చివరినాటికి కూటమి దేశాల మధ్య ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకోవాలన్న ప్రతిపాదనను వదిలివేశారు. 2019 చివరి నాటికి అంతిమ అవగాహనకు వద్దామంటూ కొత్త లక్ష్యం విధించుకున్నారు. ఎందుకంటే భారత్, థాయ్‌లాండ్, ఇండోనేషియాలు వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి కాబట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి ముందుగా రిస్క్ తీసుకోవడానికి ఈ మూడు దేశాల్లో ఏ ఒక్కటీ సంసిద్ధత వ్యక్తం చేయలేదు. ఈ విషయమై భారతీయ దౌత్యప్రతినిధి అభిప్రాయాన్ని న్యూస్ ఏజెన్సీ నిక్కీ వెల్లడించింది. ’’పన్నులు తగ్గించడంపై ఆర్సీఈపీ ప్రాథమిక ఒప్పందాన్ని ప్రకటించిన మరుక్షణం న్యూఢిల్లీలో కేంద్రప్రభుత్వం కుప్పకూలడం ఖాయం’’వాణిజ్యాన్ని మరింత సరళీకరించాలని భావిస్తూ, 10 ఆసియా దేశాలు వాటి భాగస్వామ్య దేశాలైన జపాన్, దక్షిణ కొరియా, చైనా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఇండియా మధ్య కుదిరిన భారీ వాణిజ్య ఒప్పందమే ఆర్సీఈపీ (ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒడంబడిక). ఈ ఒప్పందం అమల్లోకి రాగానే ఈ వాణిజ్యమండలి ప్రపంచ జనాభాలో 45 శాతానికి, ప్రపంచ జీజడీపీలో 25 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే ప్రపంచ వాణిజ్యంలో దీని వాటా 40 శాతం అన్నమాట. ఈ ఒడంబడిక గత ఆరేళ్లుగా చర్చలు సాగిస్తూ సరకులు, సేవలు, మదుపు అనే మూడు కీలకాంశాలపై దృష్టి సారించింది. ఒప్పందంపై సంతకాలు చేశాక ఆర్సీఈపీ ప్రపంచంలోనే అతి పెద్ద వాణిజ్య మండలిగా అవతరించనుంది. దిగుమతి సుంకాల భారీ తగ్గింపు విధ్వంసకరమే! ఆర్సీఈపీ దేశాలతో భారత వాణిజ్యలోటు 100 బిలియన్ డాలర్లను అధిగమించింది. అంటే భారతీయ మొత్తం వాణిజ్య లోటులో ఇది 64 శాతం అన్నమాట. అందుకే ఈ భారీ వాణిజ్య లోటు అంతరాన్ని రాబోయే సంవత్సరాల్లో పూడ్చుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే చైనా, కొరియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియాలతో భారత్‌కు భారీస్థాయిలో వాణిజ్య లోటు ఉండటమే కాకుండా, దిగుమతి సుంకాలను జీరోకి తొలగించి అతిపెద్ద దేశీయ మార్కెట్ తలుపులు తెరిచేస్తే పరస్పర వాణిజ్యం జరగాల్సిన సరకుల స్థానంలో చౌక ధరలతో కూడిన దిగుమతులు దేశంలోకి వెల్లువెత్తుతాయి. ఇప్పటికే ఈ విషయంలో పలు శాఖల కేంద్రమంత్రులు ప్రమాద హెచ్చరికలు చేసేశారు. ఇక ఉక్కు, లోహాలు, ఫార్మాసూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పాలపరిశ్రమ వంటి దేశీయ పరిశ్రమలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒడంబడిక కార్యచట్రం పరస్పర వాణిజ్యం జరగాల్సిన 92 శాతం సరకులపై జీరో శాతం సుంకాలను విధిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో మరొక 5 శాతం దీనికి తోడవుతుంది. భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్న ఆసియన్ దేశాలు, జపాన్ ఈ విషయంలో బలంగా ఒత్తిడి తీసుకొస్తున్నాయి. శాశ్వత భాగస్వామ్యం లేని మూడు ప్రముఖ దేశాలు కూడా 80 శాతం ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పూర్తిగా తొలగించాలని పట్టుబడుతున్నాయి. ఇప్పటికే అందుతున్న నివేదికల ప్రకారం భారత్ 72 నుంచి 74 శాతం సరకులపై చైనా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాలకు దిగుమతి సుంకాలను తొలగించడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సుంకాలను తొలగించడానికి 20 సంవత్సరాల సమయం కావాలని భారత్ కోరుకుంటోంది. కానీ చైనా మాత్రం సుంకాలను పూర్తిగా తొలగించడానికి తనకు మరింత సమయం కావాలని కోరుతోంది. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ గోప్యత ఎవరి ప్రయోజనాల కోసం? గత కొన్ని దశాబ్దాల్లో, ప్రత్యేకించి ప్రపంచ వాణిజ్య సంస్థ ఉనికిలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ సబ్సిడీలను బాగా తగ్గించాలని, మార్కెట్‌కు మరింతగా అవకాశం కల్పించాలని సంపన్న దేశాలు ప్రయత్నిస్తూ వచ్చాయి. ఈ విషయమై ప్రపంచ వాణిజ్య సంస్థ చేసిన ప్రారంభ ప్రయత్నాలను తదనంతరం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, పలు ద్వైపాక్షిక ఒప్పందాలు మరింత దూకుడుగా ముందుకు నెట్టాయి. దిగుమతి సుంకాలను తగ్గించిన తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలావరకు ఆహార దిగుమతి దేశాలుగా దిగజారిపోయిన వైనాన్ని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ క్రమంలో లక్షలాది వ్యవసాయ కుటుం బాలు ధ్వంసమైపోయాయి. భారతీయ ఆహార భద్రతపై ప్రతిపాదిత ఆర్సీఈపీ ఒడంబడిక ప్రభావాల గురించి అంతగా అధ్యయనం చేసినట్లు లేదు. పైగా ఈ ట్రీటీలో భాగంగా జరుగుతున్న సంప్రదింపులు అత్యంత రహస్యాన్ని పాటిస్తుండటంతో జరగబోయే పరిణామాలు కలవరం కలిగిస్తున్నాయి. పైగా పరిశ్రమలు, ఎన్జీవోలలో ఏ ఒక్కరికీ ఈ చర్చల్లో భాగస్వామ్యం కల్పించలేదు. ఆర్సీఈపీ సంప్రదింపులు ప్రారంభమైన ఆరేళ్ల తర్వాత ప్రతిపాదిత ఒప్పందం వలన ఏర్పడే లాభనష్టాలపై అధ్యయనం ప్రారంభించడం విచిత్రంగా లేదూ? న్యూఢిల్లీలోని ప్రాంతీయ అధ్యయన కేంద్రం, బెంగళూర్ లోని ఐఐఎంలను ఈ అధ్యయనం చేయాల్సిందిగా ప్రభుత్వం చాలా ఆలస్యంగా కోరింది. ఇదిలావుంటే, స్టీల్, ఫార్మా రంగాలకు చెందిన ప్రతినిధులు, పలువురు నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్సీఈపీ ఒప్పందం వలన పాల ఉత్పత్తులపై ఆధారపడిన 15కోట్లమంది తీవ్రంగా నష్టపోతారని అముల్ డైరీ కోపరేటివ్ సీనియర్ జనరల్ మేనేజర్ జయన్ మెహతా చెబుతున్నారు. దీనివల్ల ఇబ్బందులేమిటో ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ ఏడాది 176 మిలియన్ టన్నుల ఉత్పత్తిని దాటితే భారత దేశం ప్రపంచంలోనే పెద్ద పాల ఉత్పత్తిదారుగా నిలుస్తుంది. ప్రస్తుతం, 40 నుంచి 60 శాతం సుంకంతో పాలు, పాల ఉత్పత్తుల దిగుమతిని అనుమతిస్తున్నారు. దీంతో స్థానిక డైరీలో తమ స్థాయిలో పోటీపడటానికి ఇది దోహదపడుతోంది. అమెరికా, యూరప్ డైరీ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి చౌకపాలకు భారత్ గేట్లు బార్లా తెరిచింది. ఆస్ట్రేలియా లోని 6,300మంది పాలఉత్పత్తిదార్లు, న్యూజిలాండ్ లోని 12వేలమంది పాల ఉత్పత్తిదారులు తీవ్రంగా స్పందించి చిన్నదైన తమ పాల ఉత్పత్తి వర్గాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే, భారత్ మాత్రం తమ పాల ఉత్పత్తిని తగ్గించుకోడానికి సిద్ధపడిందని మనం మరిచిపోకూడదు. ఆహార ఉత్పత్తులలో భారత్ కోలుకోలేని దెబ్బ అదే సమయంలో దిగుమతి సుంకాలు తగ్గించడంతో దేశంలోకి వంట నూనెలు విపరీతంగా వచ్చిపడ్డాయి. భారత్‌ను ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దిగుమతిదారుగా నిలబెట్టాయి. గత మూడేళ్లుగా పప్పుధాన్యాలపై దిగుమతి సుంకం కూడా లేకపోవడంతో పాల ఉత్పత్తిదారుల ధరలు స్వల్పంగా పడిపోయాయి. ఎన్నో ఏళ్లుగా భారత్ దిగుమతి సుంకం తగ్గించాలని కోరుతున్న ఆస్ట్రేలియా నుంచి గోధుమలు దిగుమతి చేసుకోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. పబ్లిక్ వాటాదారులకు కనీస మద్దతుధర చెల్లించాలన్న ప్రపంచ వాణిజ్య కేంద్రం ఒత్తిడితో ఆహార ఉత్పత్తుల విషయంలో భారత్ కోలుకోలేని దెబ్బతింది. వ్యవసాయదారుల జీవితాలు రోడ్డున పడ్డాయి. ఆహార ఉత్పత్తులు, ఉద్యానవన పంటలు, పళ్లు, కాయగూరలు, ప్రాసెస్డ్ ఫుడ్ దిగుమతులు వరదలా వచ్చిపడటంతో ఇప్పటికే కునారిల్లుతున్న భారత వ్యవసాయ రంగం మరింత అధ్వాన్నంగా మారింది. మరోవైపు సభ్య దేశాలు ఇప్పటికే విస్తృతమైన వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకున్నాయి. తమ దేశం నుంచి బాదంపప్పును ఎగుమతి చేయడం ద్వారా గత దశాబ్దంలో ఐదింతలు లాభం చేకూరిందని గతవారం ఢిల్లీ వచ్చిన ఆస్ట్రేలియా వాణిజ్యమంత్రి సిమాన్ బిర్మింగ్హమ్ చెప్పారు. కాబట్టి ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒడంబడిక (ఆర్సీఈపీ)లో మనం ఎందుకు చేరాలి? చివరికి అమెరికాలో ఉద్యోగావకాశాలను కాపాడటానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 12దేశాల ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్షిప్ ఒప్పందం నుంచి బయటకు రావాలనుకుంటున్నప్పుడు, దశాబ్దాలుగా నిర్మించుకున్న ఆహార భద్రతను రక్షించుకోవాల్సిన అవసరం భారత్‌కు కూడా ఉంది. ఆహారాన్ని దిగుమతి చేసుకుంటున్నామంటే నిరుద్యోగాన్ని కొనితెచ్చుకోవడమేనని మనం మరిచిపోకూడదు. బహుముఖమైన వ్యవసాయరంగమే నిరుద్యోగం లేని దేశప్రగతికి దోహదం చేస్తుంది. వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
చేజారిన సేంద్రియ వర్సిటీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రానికి దక్కాల్సిన సేంద్రియ విశ్వవిద్యాలయం చేజారింది. కేంద్రానికి సకాలంలో ప్రతిపాదనలు పంపకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శలు వస్తున్నాయి. మనకు దక్కాల్సిన విశ్వవిద్యాలయం గుజరాత్‌కు తరలిపోవడంతో వ్యవసాయశాఖ నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతేడాది ఫిబ్రవరిలో భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) సేంద్రియ విశ్వవిద్యాలయాల స్థాపనకు తీర్మానం చేసింది. వాతావరణ జోన్లను ఆధారంగా దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రైతాంగానికి ఎంతో మేలు సేంద్రియ విశ్వవిద్యాలయం స్థాపన వల్ల రాష్ట్రంలో రసాయన పురుగు మందుల వాడకం తగ్గించడానికి వీలుంటుంది. అలాగే సేంద్రియ పద్ధతిలో పంటలు పండించడానికి ఉన్న అవకాశాలపై మరిన్ని పరిశోధనలు జరుగుతాయి. రాష్ట్ర అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా జరిగే పరిశోధనల ప్రభావం రైతులపై ఉంటుంది. రాష్ట్రంలో రసాయన పురుగు మందుల వాడకం తగ్గి సేంద్రియ పంటలు ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే రైతులు పండించే సేంద్రియ ఆహార ఉత్పత్తులకు మార్కెట్, ప్రాసెసింగ్ ప్రక్రియ కూడా జరుగుతుంది. సేంద్రియ ఉత్పత్తులకు ధరలు, సూపర్ మార్కెట్లు వంటివి ఏర్పాటు చేసే అవకాశముంది. రాష్ట్రంలో సేంద్రియ ఆహారంపై ప్రజల్లోనూ అవగాహన ఏర్పడుతుంది. ఇప్పటికైనా ప్రతిపాదనలు పంపొచ్చు.. తెలంగాణకు సేంద్రియ విశ్వవిద్యాలయం తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఐకార్ జనరల్ బాడీ సభ్యుడు, భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యదర్శి కొండెల సాయిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతిపాదనలు పంపిస్తే విశ్వవిద్యాలయాన్ని తీసుకురావడానికి ప్రయత్నించవచ్చని ‘సాక్షి’తో చెప్పారు. సేంద్రియ విశ్వవిద్యాలయానికి కేంద్రం కనీసం 50 శాతం నిధులు ఇస్తుందన్నారు. ఇప్పటికే సిక్కింలో సేంద్రియ విశ్వవిద్యాలయం ప్రారంభమైందని తెలిపారు. గుజరాత్లో వచ్చే ఏడాదికి విశ్వవిద్యాలయం పూర్తికానుందన్నారు. సేంద్రియ విశ్వవిద్యాలయం ఏర్పాటుపై తాను సీఎం కేసీఆర్‌కు లేఖ రాశానని.. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి కూడా దీనిపై విన్నవించామన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రానికి రాలేదని విమర్శించారు. -
రెండో హరిత విప్లవం కావాలి
తూర్పు భారత్ నుంచే తక్షణం మొదలవ్వాలి: మోదీ ♦ దేశంలో వ్యవసాయ రంగం వెనుకబడి ఉంది.. ♦ ఆధునీకరించేందుకు సర్కారు కట్టుబడి ఉంది ♦ యూపీ, బిహార్, బెంగాల్, జార్ఖండ్, అస్సాం, ♦ ఒడిశాల్లో రెండో హరిత విప్లవం మొదలవ్వాలి ♦ భూసారం, విత్తనాలు, నీటి వినియోగంపై పరిశోధనలు జరగాలి ♦ జార్ఖండ్‌లో వ్యవసాయ పరిశోధన సంస్థకు శంకుస్థాపన చేసిన ప్రధాని హజారీబాగ్(జార్ఖండ్): దేశంలో రెండో హరిత విప్లవం కావాలని.. అది తక్షణమే తూర్పు భారతదేశం నుంచి మొదలవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. భారత వ్యవసాయ రంగం పెట్టుబడులు, సాగునీరు, విలువ పెంపు, మార్కెట్ అనుసంధానం వంటి వివిధ అంశాల్లో వెనుకబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ రంగాన్ని ఆధునీకరించి, మరింత ఉత్పాదకంగా మలచేందుకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆదివారం జార్ఖండ్‌లోని బార్హీలో భారత వ్యవసాయ పరిశోధన సంస్థకు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో హరిత విప్లవానికి సమయం ఆసన్నమైందని.. ఇందులో ఇక ఏమాత్రం జాప్యం ఉండకూడదని పేర్కొన్నారు. ఇది తూర్పున ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, అస్సాం, ఒడిషాలలో జరగాలన్నారు. అందుకే ఈ రంగం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తోందని.. అందులో భాగంగానే ఈ వ్యవసాయ పరిశోధన సంస్థను ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాంతంలో కొన్ని ఎరువుల కర్మాగారాలు మూతపడ్డాయంటూ.. రైతులకు ఎరువులు అవసరమైనందున వాటిని తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఉత్పాదకతను పెంచటంలో శాస్త్రీయ పద్ధతులను వినియోగించాల్సిన అవసరాన్ని మోదీ నొక్కిచెప్పారు. విస్తృతమైన సమగ్ర ఏకీకృత ప్రణాళికను రూపొందించనిదే.. రైతుల జీవితాలను మార్చలేమని పేర్కొన్నారు. ‘ప్రతి బొట్టుకూ మరింత పంట’ అని నినదిస్తూ.. భూసారం ఆరోగ్యాన్ని నిర్ధారించేందుకు.. దానికి తగ్గ విత్తనాలు, నీటి పరిమాణం, ఎరువుల వినియోగం పరిమాణం వంటి అవసరాలపై పరిశోధనలు జరగాల్సిన అవసరముందన్నారు. భూసార పరీక్షలో ప్రభుత్వం యువతకు శిక్షణనిస్తోందని.. తద్వారా మనుషుల రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాల తరహాలో భూసార పరీక్షా కేంద్రాలనూ నెలకొల్పేందుకు వీలుంటుందని చెప్పారు. దీనివల్ల ఉద్యోగాల సృష్టి కూడా జరుగుతుందన్నారు. దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తి తక్కువగా ఉన్నందున భారత్ వీటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని.. పప్పుధాన్యాలు సాగు చేసే రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వటం జరిగిందని గుర్తుచేశారు. రైతులకు ఐదు ఎకరాల సాగు భూమి ఉంటే.. అందులో కనీసం ఒక్క ఎకరాలోనైనా పప్పు ధాన్యాలు సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. భూసార ఆరోగ్య కార్డులు, నాణ్యమైన విత్తనాలు, విద్యుత్తు, సాగునీరు అందించటం ద్వారా భూమిని సక్రమంగా నిర్వహించేలా సాయం చేసే ప్రక్రియ మొదలైందని, విలువను చేర్చి సరైన మార్కెట్ కల్పిస్తామని మోదీ చెప్పారు. జనాభా పెరుగుదల, భూ వనరులు కుదిచుకుపోవటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘యాభై ఏళ్ల కిందట ఒక కటుంబానికి 20 ఎకరాల భూమి ఉండేది. కానీ.. భూమిని ముక్కలు చేస్తూ పోవటం వల్ల ఒక కుటుంబానికి ఎకరం, అర ఎకరం పొలం మాత్రమే ఉంది’’ అని వ్యాఖ్యానించారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తి పెరగకపోతే ఆహార ధాన్యాల కొరత తలెత్తుతుందని, అది రైతుల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. వర్షాలతో ప్రధాని వారణాసి పర్యటన రద్దు వారణాసి: ప్రధాని మోదీ తన లోక్‌సభ నియోజకవర్గం వారణాసి పర్యటనను భారీ వర్షాల కారణంగా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. మోదీ ఆదివారం వారణాసిలో పర్యటించి పలు ప్రాజెక్టులను ప్రారంభించాల్సి ఉంది. అయితే.. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోయాయి. వర్షాల కారణంగా పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని.. అందుకు వారణాసి ప్రజలకు క్షమాపణ చెప్తున్నానని ఆయన జార్ఖండ్ పర్యటన ముగిసిన తర్వాత ట్విటర్లో వ్యాఖ్యానించారు.