breaking news
Cereal production
-
అన్నదాతకు అభయం
న్యూఢిల్లీ: దేశంలో తృణధాన్యాల ఉత్పత్తిని భారీగా పెంచడంతోపాటు దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో సాగును ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు కీలక పథకాలకు శ్రీకారం చుట్టారు. రూ.24,000 కోట్లతో అమలు చేసే ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన(పీఎం–డీడీకేవై)తోపాటు రూ.11,440 కోట్లతో అమలయ్యే ‘మిషన్ ఫర్ ఆత్మనిర్భర్ ఇన్ పల్సెస్’ను లాంఛనంగా ప్రారంభించారు. అలాగే వ్యవసాయం, పశు పోషణ, మత్స్య, ఆహార శుద్ధి రంగాలకు సంబంధించి రూ.5,450 కోట్ల విలువైన ప్రాజెక్టులు సైతం ప్రారంభించారు. రూ.815 కోట్ల విలువైన మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆహారం విషయంలో దిగుమతులపై ఆధారపడడం తగ్గించుకోవాలని, ఎగుమతులు పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. గతంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే వ్యవసాయ రంగం వెనుకంజలో ఉందని ఆరోపించారు. వ్యవసాయం, దాని బంధాల రంగాలపై కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఏనాడూ ఒక వ్యూహం గానీ, లక్ష్యం గానీ లేవని మండిపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్ల తలుపులు తట్టాలి పీఎం–డీడీకేవైతోపాటు తృణధాన్యాల మిషన్ అమలుకు రూ. 35,000 కోట్లకుపైగా ఖర్చు చేయబోతున్నామని, దీనివల్ల కోట్లాది మంది రైతన్నలకు లబ్ధి చేకూరుతుందని, వారి జీవితాల్లో మార్పులు వస్తాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ రెండు పథకాలను రాబోయే రబీ సీజన్ నుంచి 2030–31 దాకా అమలు చేస్తారు. 2047నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. వికసిత్ భారత్ సాధనలో అన్నదాతలదే కీలక పాత్ర అని తేల్చిచెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించామంటే ఆ ఘనత రైతులదేనని ప్రశంసించారు. అదే స్ఫూర్తితో వికసిత్ భారత్ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ మార్కెట్ల అవసరాలకు తగ్గట్టుగా ఆహారం ఉత్పత్తి చేయాలని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్ల తలుపులు తట్టాలని, విదేశాల్లోని డిమాండ్‌ను తీర్చే పంటలు పండిస్తే మనకు లాభదాయకమని పేర్కొన్నారు. ఆహార దిగుమతులు తగ్గించుకోవడం, ఎగుమతులు పెంచుకోవడం అనే రెండు కీలక లక్ష్యాలు కచ్చితంగా సాధించుకోవాలని వివరించారు. ఇందుకు నేడు ప్రారంభించిన రెండు కొత్త పథకాలు దోహదపడతాయని తెలిపారు. పంటల వైవిధ్యంపై దృష్టి పెట్టాలి కేవలం వరి, గోధుమలే కాకుండా పంటల వైవిధ్యంపై దృష్టి పెట్టాలని రైతులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ప్రొటీన్ భద్రత కల్పించడానికి తృణధాన్యాల సాగును పెంచాలని చెప్పారు. తృణధాన్యాల ఉత్పత్తి, వినియోగంలో ప్రపంచంలో మన దేశమే తొలిస్థానంలో ఉందన్నారు. అయినప్పటికీ మన అవసరాల కోసం విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘తృణధాన్యాల మిషన్’ కింద తృణధాన్యాల సాగును 2030 నాటికి 35 లక్షల హెక్టార్లకు పెంచనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఏటా 252.38 లక్షల టన్నుల తృణధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయని, 2030–31 నాటికి దీన్ని 350 లక్షల టన్నులకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించారు. సాగులో సంస్కరణలకు పెద్దపీట ఇక పీఎం–డీడీకేవై కింద 100 జిల్లాలో పంటల సాగు పెంచబోతున్నామని, వేర్వేరు శాఖలకు సంబంధించిన 36 పథకాలను మిళితం చేయబోతున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. పంటల ఉత్పత్తిని పెంచడం, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, సాగునీరు సదుపాయం, పంటల నిల్వ సామర్థ్యం మెరుగుపర్చడం, రైతులకు రుణాలు ఇవ్వడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల వల్ల అధోగతి పాలైన వ్యవసాయ రంగాన్ని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గాడిలో పెట్టామని గుర్తుచేశారు. ఈ రంగంలో సంస్కరణలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. పెట్టుబడులు పెంచుతున్నామని, విత్తనాల నుంచి మార్కెట్ల దాకా సంస్కరణలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. గత 11 ఏళ్లలో వ్యవసాయ బడ్జెట్‌ను ఆరు రెట్లు పెంచామని తేల్చిచెప్పారు. తమ ప్రభుత్వ చర్యల వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు రెండు రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు రూ.2 లక్షల కోట్లు అందజేశామని, ఇది చిన్న మొత్తం కాదని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చాక పదేళ్లలో రైతన్నల బాగు కోసం ఎరువులపై రూ.13 లక్షల కోట్ల రాయితీ ఇచ్చామన్నారు. తృణధాన్యాలు సాగు చేస్తున్న పలువురు రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా సంభాíÙంచారు. -
జొన్న కిచిడీ, రాగుల పట్టీ
సాక్షి, హైదరాబాద్: తృణధాన్యాలకు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) అందిపుచ్చుకుంటోంది. తృణధాన్యాలతో వివిధ రకాల ఆహార ఉత్పత్తులను తయారు చేసేందుకు జీసీసీ శ్రీకారం చుడుతోంది. అత్యాధునిక పరిజ్ఞానం, రుచి, పోషక విలువలకు ప్రాధాన్యతనిస్తూ ఉత్పత్తులను త్వరలో మార్కెట్లోకి తేనుంది. ఈ మేరకు అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్‌తో అవగాహన కుదుర్చుకుంది. భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరులో 3 చోట్ల రూ.1.20 కోట్లు వెచ్చించి తృణధాన్యాల ఉత్పత్తుల తయారీ కేంద్రాలను జీసీసీ ఏర్పాటు చేస్తోంది. ఈ తయారీ కేంద్రాల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. జీసీసీ ద్వారా ప్రస్తుతం గిరి ప్రొడక్ట్స్ పేరిట మార్కెట్లో వివిధ రకాల ఉత్పత్తులున్నాయి. జీసీసీ ద్వారా విక్రయిస్తున్న గిరి హనీ(తేనె)కి మార్కెట్లో అత్యంత ప్రజాదరణ ఉంది. ఏటా సగటున 1,200 క్వింటాళ్ల తేనెను విక్రయిస్తోంది. అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు సబ్బులు, షాంపూలు, కారం, చింతపండు, పసుపు తదితరాలను ప్రాసెస్ చేసి సరఫరా చేస్తోంది. తాజాగా తృణధాన్యాల ఉత్పత్తులను కూడా పెద్దఎత్తున మార్కెట్లోకి తేనుంది. గిరిపోషణ్లో భాగంగా.. ఐటీడీఏలు, గిరిజన ప్రాంతాల్లో పౌష్టికాహార లోపాలను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన గిరిపోషణ్ పథకం కింద ఈ ఉత్పత్తులను సరఫరా చేయాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఆరేళ్లలోపు చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు కూడా వీటిని పంపిణీ చేసేలా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖతో అవగాహన కుదుర్చుకోనుంది. ప్రస్తుతం ప్రారంభదశలోనే ఈ తయారీ కేంద్రాలున్నాయి. డిసెంబర్ నెలాఖరులోగా తృణధాన్యాల తయారీ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు జీసీసీ కసరత్తు చేస్తోంది. ఆదివాసీలకు ఉపాధి.. తయారీ కేంద్రాల్లో పని చేసేందుకు మహిళలకు మాత్రమే జీసీసీ ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం ఈ యూనిట్లు ఐటీడీఏ కేంద్రాల్లో ఉండటంతో అక్కడున్న ఆదివాసీ కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వారికి ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పటికే తయారీ యూనిట్లలో పనిచేసేందుకు దాదాపు 120 మంది మహిళలను జీసీసీ ఎంపిక చేసింది. వీరికి ఇక్రిశాట్లో గత నెలలో శిక్షణ తరగతులు సైతం నిర్వహించారు. ఉత్పత్తులకు తగిన విధంగా వారికి పారితోషికాన్ని ఇవ్వనుంది. జీసీసీ బ్రాండ్‌కు మరింత క్రేజ్ పెరగడం, జీసీసీ బిజినెస్‌ను మరింత విస్తృతం చేసేందుకు మిల్లట్ వ్యాపారం దోహదపడుతుందని, ఈ పరిశ్రమతో ప్రత్యక్షంగా 120 కుటుంబాలు, పరోక్షంగా 150 కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు వి.సర్వేశ్వర్‌రెడ్డి ‘సాక్షి’తో అన్నారు. వంటల తయారీకి ఇక్రిశాట్ ఫార్ములా.. జొన్న రకంతో చేసిన కిచిడీ, రాగులు, నువ్వులు, కొర్రలతో చేసిన పట్టీలు(చిక్కీలు), రెండు అంతకంటే ఎక్కువ తృణధాన్యాల మిశ్రమంతో (మల్టీమిల్లట్) స్వీట్లు తయారు చేయనుంది. వీటి తయారీకి ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు రూపొందించిన ఫార్ములాను వినియోగించనుంది. ఏటా రూ.1.25 కోట్లు చెల్లించి ఇక్రిశాట్ సహకారం తీసుకుంటోంది. -
18న తాడేపల్లిగూడెంలో సిరిధాన్యాలు, ఔషధ మొక్కలపై సదస్సు
ఆంధ్రప్రదేశ్ గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, లయన్స్‌క్లబ్ సేంద్రియ సేద్య విభాగం ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలోని మాగంటి సీతారామదాసు–లలితాంబ కల్యాణ మండపంలో ఈ నెల 18న ఉ. 10 గం.కు సిరిధాన్యాల ఆహారం విశిష్టతపై మిల్లెట్స్ రాంబాబు ప్రసంగిస్తారు. మహిళలతో వంటకాలు చేయిస్తారు. కలుపు మొక్కల్లో ఔషధ మొక్కలను గుర్తించడంపై దాట్ల సుబ్బరాజు ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్ గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అధ్యక్షులు రామకృష్ణంరాజు, ప్రకృతి వ్యవసాయదారుడు సుబ్రహ్మణ్యంరాజు, లయన్స్ క్లబ్ సేంద్రియ సేద్య విభాగాధ్యక్షులు డా. పి.బి. ప్రతాప్‌కుమార్(94401 24253) ప్రసంగిస్తారు. 18న గుంటూరులో సమీకృత సహజ సేద్యంపై నారాయణరెడ్డి ప్రసంగం రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 18 ఉ. 10 గం.ల నుంచి సా. 5 గం.ల వరకు గుంటూరు బృందావన్ గార్డెన్స్ 5వ లైన్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో బాలాజీ మండపంలో గో–ఆధారిత సమీకృత సహజ సేద్యంపై గో–ఆధారిత సమీకృత సహజ సేద్య నిపుణులు ఎల్. నారాయణరెడ్డి(కర్ణాటక) శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 70939 73999. 18న సేంద్రియ పుట్టగొడుగులపై శిక్షణ: గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో ఈనెల 18న ఉ. 10 గం.ల నుంచి సేంద్రియ పుట్టగొడుగుల పెంపక విధానంపై కొప్పుల శ్రీలక్ష్మి( రాజమండ్రి) శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 83675 35439. 14న విజయవాడలో సిరిధాన్యాల సాగు–ప్రయోజనాలపై సదస్సు మధుమేహ దినోత్సవం సందర్భంగా ఈనెల 14న విజయవాడ ఆంధ్రా లయోలా కళాశాల సెమినార్ హాల్లో సిరిధాన్యాలపై అవగాహన సదస్సు, సిరిధాన్యాల మేళా జరగనుంది. రసాయనాల్లేకుండా సిరిధాన్యాలను సాగు చేయటంపై ప్రకృతి వ్యవసాయదారుడు ఎం.సి.వి. ప్రసాద్ ప్రసంగిస్తారు. సిరిధాన్యాల ప్రయోజనాలపై వీరమాచనేని రామకృష్ణ, పమ్మి సత్యనారాయణశాస్త్రి, కళ్యాణి, పద్మజ ప్రసంగిస్తారని నిర్వాహకులు జీవీ రావు (జీవామృతం)– 96180 00399 -
దేశంలో తృణధాన్యాలకు ఢోకా లేదు
న్యూఢిల్లీ: దేశీయంగా తృణధాన్యాల ఉత్పత్తి సంతృప్తికరంగా ఉందని, దేశీయ అవసరాల కోసం వంట నూనె, కాయ ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నామని సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదించింది. దేశంలో పెరిగిన రైతుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై వివరణ ఇస్తూ అఫిడవిట్లో వ్యవసాయ శాఖ ఈ వివరాలు తెలిపింది. భారత్‌లో దేశీయ అవసరాలకేకాక ఎగుమతి చేసేంత స్థాయిలో గోధుమ, బియ్యం నిల్వలున్నాయని, ఆహార భద్రత పథకం ద్వారా వంట నూనెలు, కాయధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపింది. 48 శాతం పంటభూమిలో ఆహారధాన్యాలనే పండిస్తున్నారనే అభిప్రాయాలను కేంద్రం తోసిపుచ్చింది.