జొన్న కిచిడీ, రాగుల పట్టీ

Establishment Of 3 Units For Cereal Products In Telangana - Sakshi

జీసీసీ ‘తృణ’వ్యాపారం

తృణధాన్యాల ఉత్పత్తుల కోసం 3 యూనిట్లు ఏర్పాటు

ఇక్రిశాట్‌తో గిరిజన కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌ ఒప్పందం

డిసెంబర్‌ నెలాఖరులోగా యూనిట్ల ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: తృణధాన్యాలకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను గిరిజన కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌ (జీసీసీ) అందిపుచ్చుకుంటోంది. తృణధాన్యాలతో వివిధ రకాల ఆహార ఉత్పత్తులను తయారు చేసేందుకు జీసీసీ శ్రీకారం చుడుతోంది. అత్యాధునిక పరిజ్ఞానం, రుచి, పోషక విలువలకు ప్రాధాన్యతనిస్తూ ఉత్పత్తులను త్వరలో మార్కెట్‌లోకి తేనుంది. ఈ మేరకు అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్‌తో అవగాహన కుదుర్చుకుంది. భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరులో 3 చోట్ల రూ.1.20 కోట్లు వెచ్చించి తృణధాన్యాల ఉత్పత్తుల తయారీ కేంద్రాలను జీసీసీ ఏర్పాటు చేస్తోంది. ఈ తయారీ కేంద్రాల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. జీసీసీ ద్వారా ప్రస్తుతం గిరి ప్రొడక్ట్స్‌ పేరిట మార్కెట్లో వివిధ రకాల ఉత్పత్తులున్నాయి. జీసీసీ ద్వారా విక్రయిస్తున్న గిరి హనీ(తేనె)కి మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ ఉంది. ఏటా సగటున 1,200 క్వింటాళ్ల తేనెను విక్రయిస్తోంది. అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు సబ్బులు, షాంపూలు, కారం, చింతపండు, పసుపు తదితరాలను ప్రాసెస్‌ చేసి సరఫరా చేస్తోంది. తాజాగా తృణధాన్యాల ఉత్పత్తులను కూడా పెద్దఎత్తున మార్కెట్‌లోకి తేనుంది.

గిరిపోషణ్‌లో భాగంగా.. 
ఐటీడీఏలు, గిరిజన ప్రాంతాల్లో పౌష్టికాహార లోపాలను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన గిరిపోషణ్‌ పథకం కింద ఈ ఉత్పత్తులను సరఫరా చేయాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. అదేవిధంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరేళ్లలోపు చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు కూడా వీటిని పంపిణీ చేసేలా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖతో అవగాహన కుదుర్చుకోనుంది. ప్రస్తుతం ప్రారంభదశలోనే ఈ తయారీ కేంద్రాలున్నాయి. డిసెంబర్‌ నెలాఖరులోగా తృణధాన్యాల తయారీ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు జీసీసీ కసరత్తు చేస్తోంది.

ఆదివాసీలకు ఉపాధి.. 
తయారీ కేంద్రాల్లో పని చేసేందుకు మహిళలకు మాత్రమే జీసీసీ ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం ఈ యూనిట్లు ఐటీడీఏ కేంద్రాల్లో ఉండటంతో అక్కడున్న ఆదివాసీ కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వారికి ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పటికే తయారీ యూనిట్లలో పనిచేసేందుకు దాదాపు 120 మంది మహిళలను జీసీసీ ఎంపిక చేసింది. వీరికి ఇక్రిశాట్‌లో గత నెలలో శిక్షణ తరగతులు సైతం నిర్వహించారు. ఉత్పత్తులకు తగిన విధంగా వారికి పారితోషికాన్ని ఇవ్వనుంది. జీసీసీ బ్రాండ్‌కు మరింత క్రేజ్‌ పెరగడం, జీసీసీ బిజినెస్‌ను మరింత విస్తృతం చేసేందుకు మిల్లట్‌ వ్యాపారం దోహదపడుతుందని, ఈ పరిశ్రమతో ప్రత్యక్షంగా 120 కుటుంబాలు, పరోక్షంగా 150 కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు వి.సర్వేశ్వర్‌రెడ్డి ‘సాక్షి’తో అన్నారు.

వంటల తయారీకి ఇక్రిశాట్‌ ఫార్ములా.. 
జొన్న రకంతో చేసిన కిచిడీ, రాగులు, నువ్వులు, కొర్రలతో చేసిన పట్టీలు(చిక్కీలు), రెండు అంతకంటే ఎక్కువ తృణధాన్యాల మిశ్రమంతో (మల్టీమిల్లట్‌) స్వీట్లు తయారు చేయనుంది. వీటి తయారీకి ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు రూపొందించిన ఫార్ములాను వినియోగించనుంది. ఏటా రూ.1.25 కోట్లు చెల్లించి ఇక్రిశాట్‌ సహకారం తీసుకుంటోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top