ఎల్‌ఓసీ నుంచి ఎల్‌ఏసీ వరకు గట్టిగా బుద్ధి చెప్పాం

PM Narendra Modi addresses the Nation on the 74th Independence Day - Sakshi

దేశ సార్వభౌమత్వాన్ని సవాల్‌ చేస్తే సహించం

స్వాతంత్య్ర దిన వేడుకల్లో చైనా, పాక్‌లకు ప్రధాని హెచ్చరికలు

సరిహద్దుల్లో సైనికుల ప్రతాపాన్ని చూపించారన్న నరేంద్ర మోదీ

త్వరలో కరోనాకి వ్యాక్సిన్, ప్రతీ పౌరుడికి డిజిటల్‌ హెల్త్‌ కార్డు

జవాన్లకి, కరోనా వారియర్లకి ప్రధాని సెల్యూట్‌

న్యూఢిల్లీ: దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట వేదికగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా, పాకిస్తాన్‌లకు గట్టి హెచ్చరికలే పంపారు. ఎల్‌ఓసీ (నియంత్రణ రేఖ) నుంచి ఎల్‌ఏసీ (వాస్తవాధీన రేఖ) వరకు దేశ సార్వభౌమత్వాన్ని సవాల్‌ చేసిన వారికి సాయుధ బలగాలు గట్టిగా బుద్ధి చెప్పాయన్నారు. లద్దాఖ్‌లో మన సైనికుల శౌర్య పరాక్రమాలు యావత్‌ ప్రపంచం చూసిందన్నారు.

శనివారం ఢిల్లీలో ఎర్రకోటలో జరిగిన దేశ 74వ స్వాతంత్ర దిన వేడుకలకు సంప్రదాయబద్ధంగా కాషాయం, తెలుపు రంగుల్లో ఉన్న కుర్తా, పైజామా తలపాగా ధరించి వచ్చిన ప్రధాని గంటా 26 నిమిషాల సేపు ప్రసంగించారు. కేంద్ర పథకాలైన ఆత్మ నిర్భర్‌ భారత్, వోకల్‌ ఫర్‌ లోకల్, మేకిన్‌ ఇండియా టు మేక్‌ ఫర్‌ వరల్డ్, నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌లు, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక రంగ పురోగతికి చేపట్టిన సంస్కరణల గురించి వివరించారు.

కరోనా వ్యాక్సిన్‌ నుంచి మహిళా సాధికారత వరకు ప్రతీ అంశాన్ని స్పృశిస్తూ ఆయన ప్రసంగం సాగింది. తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఇటీవల చెలరేగిన హింసాత్మక ఘర్షణల్లో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో దేశ కోసం ప్రాణాలర్పించిన వారికి ఎర్రకోట నుంచి సెల్యూట్‌ చేస్తున్నానని చెప్పారు. సరిహద్దుల్లో ఉగ్రవాదమైనా, విస్తరణ వాదమైనా భారత్‌ వాటిపై యుద్ధం చేస్తుందని స్పష్టం చేశారు. అయితే పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలకే తాము ప్రాధాన్యం ఇస్తామన్నారు.

గత ఏడాది విదేశీ పెట్టుబడుల్లో రికార్డు స్థాయిలో 18 శాతం వృద్ధి సాధించామని ప్రపంచ దేశాలు భారత్‌పై విశ్వాసం ఉంచాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. అయోధ్యలో రామ మందిర భూమి పూజను ప్రస్తావిస్తూ శతాబ్దాల సమస్యను శాంతియుతంగా పరిష్కరించమన్నారు. జమ్మూకశ్మీర్‌కు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్లను ప్రధాని మోదీ అభినందించారు.

మోదీ కొత్త మంత్ర మేక్‌ ఫర్‌ వరల్డ్‌
మోదీ తన ప్రసంగంలో ఆత్మనిర్భర్‌ భారత్‌పై అత్యధికంగా దృష్టి పెట్టారు. కరోనా వంటి సంక్షోభ పరిస్థితులు కూడా దేశ సంకల్ప బలాన్ని అడ్డుకోలేవని ధీమాగా చెప్పారు. ఇంక ఎక్కువ కాలం దిగుమతులు మీద ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించాలన్నారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అంటే దిగుమతులు తగ్గించుకోవడమే కాదు, మన సామర్థ్యం, సృజనాత్మకత, నైపుణ్యం ప్రపంచం గుర్తించేలా చేయాలని మోదీ పిలుపునిచ్చారు.

ఇక మేకిన్‌ ఇండియా కాదు, మేక్‌ ఫర్‌ వరల్డ్‌ దిశగా భారత్‌ ప్రయాణం సాగాలని అన్నారు. ప్రపంచం ఆదరించేలా భారత్‌లో నాణ్యమైన వస్తువుల్ని ఉత్పత్తి చేయాలని మోదీ అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఎన్‌–95 మాస్కులు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్ల తయారీలో నాలుగు నెలల్లోనే భారత్‌ స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ఎగుమతులు కూడా చేస్తోందని అన్నారు. దీంతో యువతకి ఉపాధి అవకాశాలను కల్పించామని ప్రధాని చెప్పారు.

మౌలిక సదుపాయాల రంగంలో విప్లవం సృష్టించేలా రూ. 110 లక్షల కోట్లతో వివిధ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏడు వేల నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఐపీ) ప్రాజెక్టుల్ని ప్రారంభించామని అన్నారు. కోవిడ్‌ విసిరిన ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్న ప్రధాని రైతులే పారిశ్రామికవేత్తలుగా మారడానికి వీలుగా లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక నిధిని ప్రారంభించామని చెప్పారు. దీనివల్ల గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

వెయ్యిరోజుల్లో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌
రాబోయే మూడేళ్ల కాలంలో దేశంలో ఆరు లక్షలకు పైగా గ్రామాలకు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించే ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌ వర్క్‌ ప్రాజెక్టుని ప్రకటించారు. గత అయిదేళ్లలో 1.5 లక్షల గ్రామ పంచాయితీలకు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పించామని మరో మూడేళ్లలో ప్రతీ గ్రామానికి నెట్‌ సదుపాయం ఉంటుందని అన్నారు. ఆన్‌లైన్‌ కార్యకలాపాలు అధికమైన నేపథ్యంలో సైబర్‌ భద్రతపై త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకొస్తామన్నారు.

తయారీలో మూడు కరోనా వ్యాక్సిన్లు
కరోనా వ్యాక్సిన్‌ త్వరలోనే ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు. భారత్‌లో మూడు వ్యాక్సిన్ల ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. వ్యాక్సిన్‌ విజయవంతంగా పనిచేస్తోందని శాస్త్రవేత్తలు ప్రకటించిన వెంటనే భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. దేశంలో ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందేలా ఇప్పటికే మౌలిక సదుపాయాల ఏర్పాటు పూర్తి చేశామన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్‌ తయారీలో అహరహం శ్రమిస్తున్న శాస్తవేత్తల్ని ప్రధాని రుషులు, మునులతో పోల్చారు.

కరోనాపై విజయం సాధించడానికి వారు ల్యాబొరేటరీల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నారు. సాధ్యమైనంత తక్కువ సమయంలో వ్యాక్సిన్‌ దేశ ప్రజలందరికీ చేరేలా చూస్తామన్నారు. భారత్‌ బయోటెక్, జైడస్‌ క్యాడిలా రూపొందించిన వ్యాక్సిన్లు ఒకటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రస్తుతం నడుస్తున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు అనుమతులు లభించాయి.   

రక్షణ రంగంలో స్వావలంబన దిశగా
రక్షణ రంగంలో స్వావలంబన దిశగా గట్టి చర్యలు చేపడుతున్నట్లు మోదీ తెలిపారు. వందకు పైగా ఆయుధాలు, రక్షణ పరికరాల దిగుమతిని నిషేధించామన్నారు. క్షిపణుల నుంచి తేలికపాటి సైనిక హెలికాప్టర్లు, రైఫిల్స్, యుద్ధ రవాణా విమానాలను భారత్‌లో తయారుచేస్తామన్నారు. తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌ ఆధునీకరణ జరుగుతోందన్నారు. దేశ రక్షణలో సరిహద్దు, తీరప్రాంత మౌలికసదుపాయాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు.

హిమాలయ పర్వతశ్రేణుల్లో, హిందూ మహాసముద్రంలోని దీవుల మధ్య, లడఖ్‌ నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ వరకు  రహదారుల నిర్మాణం జరిగిందని, రవాణా సదుపాయాలకు ప్రాధాన్య మిచ్చామన్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద ఏడాదిలో 2 కోట్ల కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చామని, ముఖ్యంగా గిరిజన, మారుమూల ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి సురక్షిత మంచినీరు అందించామని తెలిపారు.

రూపాయికే శానిటరీ ప్యాడ్‌
స్వాతంత్య్రదిన ప్రసంగంలో ఈ సారి ప్రధాని ఏనాడూ ఎవరూ మాట్లాడని మహిళల రుతు స్రావం అంశాన్ని లేవనెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన మహిళా సాధికారత గురించి వివరిస్తూ నిరుపేద మహిళలకు 6 వేల జన ఔషధి కేంద్రాల ద్వారా రూపాయికే శానిటరీ ప్యాడ్‌లు అందిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది మహిళలకు ఈ ప్యాడ్‌లు అందుతున్నాయని తెలిపారు. ప్రస్తుతమున్న 18 ఏళ్లుగా ఉన్న అమ్మాయిల పెళ్లి వయసును మార్చడానికి సన్నాహాలు చేస్తున్నామని, దీనికోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో మహిళా అధికారుల్ని కీలక పదవుల్లో తీసుకున్నామని, ట్రిపుల్‌ తలాక్‌ని రద్దు చేశామన్నారు. ప్రధాని శానిటరీ ప్యాడ్‌ల ప్రస్తావనపై సోషల్‌ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. 40 కోట్ల ‘జన్‌ధన్‌ బ్యాంకు అకౌంట’్లలో 22 కోట్ల అకౌంట్లు మహిళలవేనని, ఈ మహమ్మారి కాలంలో వారి ఖాతాల్లో రూ.30 వేలకోట్ల నిధులను వేసినట్లు ప్రధాని పేర్కొన్నారు. ‘ముద్ర’రుణాల్లో 70 శాతం చెల్లెళ్ళు, తల్లులకే ఇచ్చామని, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద అత్యధిక రిజిస్ట్రేషన్లు మహిళల పేరిటే ఉన్నాయన్నారు.

అందరికీ హెల్త్‌ కార్డులు
ఎర్రకోట సాక్షిగా ప్రధాని  మోదీ ఆరోగ్య రంగాన్ని డిజిటలైజ్‌ చేసే పథకానికి శ్రీకారం చుట్టారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో భాగంగా నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కింద ప్రతీ పౌరుడికి హెల్త్‌ ఐడీ నంబర్‌ ఇస్తారు. ఈ హెల్త్‌ ఐడీ డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. అందులో వారి ఆరోగ్య సమాచారం, వాడే మందులు, మెడికల్‌ రిపోర్ట్స్‌ నిక్షిప్తం చేస్తారు. ఈ ఐడీలన్నింటినీ దేశ వ్యాప్తంగానున్న ఆరోగ్య కేంద్రాలు, రిజిస్టర్డ్‌ వైద్యులతో అనుసంధానం చేస్తారు. దీనివల్ల దేశంలో ఎవరైనా అనారోగ్యంతో వైద్యుల్ని సంప్రదిస్తే ఒక్క క్లిక్‌తో వారి సమస్యలన్నీ తెలుసుకోవచ్చు. ఈ్త ఐడీలతో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మోదీ చెప్పారు.


ఎన్‌సీసీ కేడెట్లకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ


ఎర్రకోట వద్ద 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల దృశ్యం  


విద్యుత్‌ వెలుగుల్లో మెరిసిపోతున్న రాష్ట్రపతి నివాస ప్రాంతం రైసినా హిల్స్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top