కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టడం తథ్యం
తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ
ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఎర్రకోట వద్ద పేలుడుకు పాల్పడి, సామాన్య ప్రజల ప్రాణాలను బలితీసుకున్న ముష్కరులను కచ్చితంగా శిక్షించి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.

ఈ ఘటన వెనుక ఉన్న కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టడం తథ్యమని తేల్చిచెప్పారు. పేలుడులో గాయపడి ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రధాని మోదీ బుధవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులంతా త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రారి్థస్తున్నట్లు చెప్పారు. ఎవరూ అధైర్య పడొద్దని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Went to LNJP Hospital and met those injured during the blast in Delhi. Praying for everyone’s quick recovery.
Those behind the conspiracy will be brought to justice! pic.twitter.com/HfgKs8yeVp— Narendra Modi (@narendramodi) November 12, 2025
భూటాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న మోదీ నేరుగా ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రికి వచ్చారు. దాదాపు 25 నిమిషాలపాటు ఆసుపత్రిలోనే ఉన్నారు. అధికారులతో, డాక్టర్లతో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కారు బాంబు పేలుడు పట్ల మోదీ ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దర్యాప్తు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వివరాలు తెలుసుకుంటున్నానని మంగళవారం వెల్లడించారు.


