బ్లాక్‌ మెయిల్‌ నడవదు.. పాక్‌ బెదిరింపులకు భయపడేది లేదు: మోదీ హెచ్చరిక | PM Modi Red Fort Independence Day celebration 2025 Live Updates | Sakshi
Sakshi News home page

బ్లాక్‌ మెయిల్‌ నడవదు.. పాక్‌ బెదిరింపులకు భయపడేది లేదు: మోదీ హెచ్చరిక

Aug 15 2025 7:29 AM | Updated on Aug 15 2025 9:52 AM

PM Modi Red Fort Independence Day celebration 2025 Live Updates

సాక్షి, ఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ప్రధాని మోదీ.. కీలక వ్యాఖ్యలు చేశారు. బ్లాక్‌ మెయిల్‌కు భారత్‌ తలవంచే రోజులు పోయాయని మోదీ హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌తో మన దేశ సత్తా చాటామని చెప్పుకొచ్చారు. అణుబాంబు బెదిరింపులను సహించేది లేదు అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. ఆత్మనిర్భర్‌ అంటే డాలర్‌, పౌండ్‌పై ఆధారపడటం కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోటపై 12వసారి జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ. ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయం గురించి మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎర్రకోట వద్ద ఎంఐ-17 హెలికాప్టర్‌ పూల వర్షం కురిపించింది. 

ఎర్రకోటపై జాతినుద్దేశించి మోదీ ‍ప్రసంగిస్తూ.. ప్రతీ ఇంటిపై మువ్వెన్నల జెండా ఎగిరే సమయం ఇది. 140 కోట్ల మంది సంకల్ప పండుగ ఇది. సమైక్య భావంతో దేశం ఉప్పొంగే సమయం. కోట్ల మంది త్యాగాలతో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం కోసం ప్రాణ త్యాగం చేశారు. దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం.

ఉగ్రవాదులకు బుద్ది చెప్పాం.. 
పహల్గాంలో ఉగ్రవాదులు నరమేథం సృష్టించారు. భార్య ముందే భర్తలను చంపేశారు. పిల్లల ముందే తండ్రిని చంపేశారు. మతం అడిగి మరీ మారణహోమం సృష్టించారు. ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌ ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం. మన సైన్యం పాక్‌ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌తో మన దేశ సత్తా చాటాం. ఆపరేషన్‌ సిందూర్‌ హీరోలకు నా సెల్యూట్‌. అణుబాంబు బెదిరింపులను సహించేది లేదు. మన సైనికులు ఊహకందని విధంగా శత్రువులను దెబ్బతీశారు. 

పాక్‌ బ్లాక్‌ మెయిల్‌ నడవదు.. 
ఇకపై ఎవరి బ్లాక్‌ మెయిల్‌ నడవదు. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించలేవు. ఉగ్రమూకలకు మన సైన్యం బుద్ది చెప్పింది. మన సైన్యానికి పూర్తి స్వేచ్చ ఇచ్చాం​. ఉగ్రవాదులకు సాయం చేసే వారినీ వదలిపెట్టం. బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడితే ధీటుగా జవాబిస్తాం. ఎన్నో ఏళ్లుగా అణుబాంబుల పేరిట బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు. సింధూ నది జలాలపై భారత్‌కు పూర్తి హక్కులున్నాయి. ఏడు దశాబ్దాలుగా మన రైతులు ఇబ్బంది పడ్డారు. సింధూ నదిలో నీరు భారతీయుల హక్కు. సింధూ ఒప్పందాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. ఉగ్రవాదం మానవాళి మనుగడకే ముప్పు. 

ఆత్మ నిర్భర్‌ భారత్‌తో స్వయం సమృద్ది..
ఆపరేషన్‌ సిందూర్‌తో మేడిన్‌ ఇండియా సత్తా ప్రపంచానికి చాటి చెప్పాం. ఆత్మనిర్భర్‌ అంటే డాలర్‌, పౌండ్‌పై ఆధారపడటం కాదు. అనేక సవాళ్లు ఎదుర్కొన్న భారత్‌.. ఇప్పుడు స్వయం సమృద్ధి దిశగా నడుస్తోంది. న్యూక్లియర్‌ ఎనర్జీపై భారత్‌ చొరవ చూపిస్తోంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా స్వయం సమృద్ధిపై వెనక్కి తగ్గేది లేదు. ప్రతీ రంగంలో భారత్‌ అడుగులు ముందుకు వేస్తోంది. 2030లోగా భారత్‌లో 50 శాతం క్లీన్‌ ఎనర్జీ తీసుకురావడం లక్ష్యం. ఎగుమతి, దిగుమతులు, ఆదాయ వ్యయాలే స్వయం సమృద్ధి కాదు. స్వయం సమృద్ధి అంటే సమున్నతంగా నిలబడటం. మేక్‌ ఇన్‌ ఇండియా నినాదం రక్షణ రంగంలో మిషన్‌ మోడ్‌లో పనిచేస్తోంది. టెక్నాలజీ సాయం కోసం భారత్‌ ఇప్పుడు ప్రపంచాన్ని అర్థించడం లేదు. ప్రపంచ దేశాలకు సాయం, టెక్నాలజీ అందిస్తున్నాం. ఆత్మ నిర్భర్‌ భారత్‌తో మన సామర్థ్యం ప్రపంచ దేశాలకు తెలిసింది. 

దీపావళి బహుమతి ఇవ్వబోతున్నాం..
సైబర్‌ టెక్నాలజీ, డీప్‌ టెక్నాలజీల్లో భారత్‌ బలమైన పాత్ర. ప్రపంచ వాణిజ్యంలో మన సామర్థ్యం చాటాల్సి ఉంది. అంతరిక్ష పరిశోధనాల్లోనూ భారత్‌ తనదైన ముద్ర వేసింది. గగన్‌యాన్‌తో భారత్‌ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసింది. మన యువ శాస్త్రవేత్తలు, నిపుణులు నిరంతరం శ్రమిస్తున్నారు. వ్యాక్సిన్‌ పరిశోధనల్లో భారత్‌ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాం. అనేక క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచానికి భారత్‌ అండగా నిలిచింది. జీఎస్టీలో సంస్కరణలు తీసుకువస్తున్నాం. సామాన్యులు చెల్లించే పన్నుల్లో భారీగా కోత పెట్టబోతున్నాం. దీని వల్ల వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయి. దేపావళికి దేశ ప్రజలకు బహుమతి ఇవ్వబోతున్నాం. ఈసారి దీపావళికి రెండింతల సంతోషం తీసుకురాబోతున్నాం. 

ఖనిజాలే ముఖ్యం.. 
నాకు యువత శక్తి, సామర్థ్యాలపై నమ్మకం ఉంది. సొంత సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌వైపు దేశ  యువత దృష్టి పెట్టాలి. ఫైటర్‌ జెట్లకు మేడిన్‌ ఇండియా ఇంజిన్లపై దృష్టిపెడతాం. గ్రీన్‌హైడ్రోజన్‌ ప్రాజెక్ట్‌లను ముందుకు తీసుకెళ్తున్నాం. కొత్త ఇందనాల అభివృద్ధితో పెట్రోలియం దిగుమతులు తగ్గించాలన్నది లక్ష్యం. 2047 నాటికి న్యూక్లియర్‌ ఎనర్జీని 10 రేట్లు పెంచాలన్నది టార్గెట్‌. 10 కొత్త అణు రియాక్టర్లపై వేగంగా పనులు జరుగుతున్నాయి. ఇవాళ ప్రపంచమంతా కీలక ఖనిజాల చుట్టే తిరుగుతుంది. కీలక ఖనిజాల విషయంలో స్వయం సమృద్ధికి కృషి చేస్తున్నాం. ఖనిజాల కోసం 1200 ప్రాంతాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలో మేడిన్‌ ఇండియా చిప్స్‌ మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. సెమీ కండక్టర్ల విషయంలో భారత్‌ ఎప్పుడో ఆలోచన చేసింది. 

యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త పథకం. పీఎం వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన పేరుతో పథకం. పంద్రాగస్ట్‌ సందర్భంగా పథకం ప్రారంభం. సంస్కరణల విషయంలో మాకు మద్దతు పలకాలి. తొలిసారి ఉద్యోగం పొందిన యువతీయువకులకు 15వేలు అందజేస్తాం. కంపెనీలకు ప్రోత్సాహం అందిస్తాం. 

ఇక, అంతకుముందు.. ఎర్రకోటలో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. కాగా, 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్రం నయా భారత్‌ థీమ్‌తో ఉత్సవాలు జరుపుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement