పదిహేడవ లోక్‌సభ.. ప్రధాని మోదీ లాస్ట్‌ స్పీచ్‌ ఇదే.. | Sakshi
Sakshi News home page

పదిహేడవ లోక్‌సభ.. ప్రధాని మోదీ లాస్ట్‌ స్పీచ్‌ ఇదే..

Published Sat, Feb 10 2024 5:33 PM

Pm Modi Last Speech In Parliament Before 2024 General Elections - Sakshi

న్యూఢిల్లీ: తమ పాలనలో దేశ ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ముందు 17వ లోక్‌సభ చివరిరోజు సమావేశాల్లో అయోధ్య రామమందిర తీర్మానంపై ప్రధాని మాట్లాడారు. గత ఐదేళ్లలో అద్భుతమైన మార్పులు ఆవిష్కరణలు తీసుకువచ్చామని చెప్పారు. దేశాన్ని తామెప్పుడూ వెనకడుగు వేయనివ్వలేదన్నారు. 17వ లోక్‌సభను దేశం తప్పకుండా ఆశీర్వదిస్తుందన్నారు. 

‘ఎన్నో ఏళ్ల కల అయిన కొత్త పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించుకున్నాం. మార్గదర్శకంగా సెంగోల్‌ను స్థాపించుకున్నాం. కరోనా లాంటి విపత్కర పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం. జీ20 సమావేశాన్ని నిర్వహించడం వల్ల భారత్‌ ప్రతిష్ట పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్పు కనిపిస్తోంది. పేపర్‌లెస్‌ పార్లమెంట్‌, డిజిటలైజేషన్‌ సభ్యులకు ఎంతగానో​ ఉపయోగపడుతుంది. పార్లమెంట్‌కు హాజరయ్యే సభ్యుల సంఖ్య పెరిగింది. 

ఈ ఐదేళ్లలో పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాం. రీ ఫార్మ్‌, పర్‌ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌ లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం. మార్పు దిశగా భారత్‌ కీలక ముందడుగు వేసింది. గత పదేళ్లలో దేశంలో ఉత్పాదకత పెరిగింది. ఈ టర్ములో పార్లమెంట్‌ సమావేశాల్లో చేసిన అనేక సంస్కరణలు గేమ్‌ చేంజర్లుగా మారాయి. ఉగ్రవాద నిర్మూళనకు తీసుకున్న చర్యల వల్ల కాశ్మీర్‌లో శాంతి పెరిగింది. ఆర్టికల్‌ 370 తొలగింపుతో రాజ్యాంగ నిర్మాతల ఆత్మకు శాంతి చేకూరింది.

మహిళల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు నారీశక్తి వందన్ చట్టం తెచ్చాం. ట్రిపుల్ తలాక్‌ను నిషేధించి ముస్లిం మహిళల హక్కులను కాపాడాం. మేం చేసిన పనులు చూసి ముస్లిం ఆడబిడ్డలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మరో పాతికేళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుంది. వికసిత్ భారత్ ఫలాలు మన భావితరాలకు అందుతాయి. రాబోయే 25 ఏళ్లు భారత్‌కు ఎంతో కీలకం. 

ప్రశ్న ప్రతాల లీకేజీ యువత పాలిట శాపంగా మారింది. యువతకు అన్యాయం జరగకుండా గొప్ప నిర్ణయం తీసుకున్నాం. పేపర్ లీకేజీకి పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడేలా చట్టం తెచ్చాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చట్టాలను 17వ లోక్ సభ ఆమోదించింది. డిజిటల్ డేటా ప్రొటెక్షన్ చట్టం భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. అంతరిక్ష రంగంలో మనదేశ సత్తా చాటాం. ఆర్థిక సంస్కరణల ప్రక్రియలో ఎంపీలంతా పాలుపంచుకున్నారు’ అని ప్రధాని మోదీ తెలిపారు. 

ఇదీ చదవండి.. ఇండియా కూటమికి కేజ్రీవాల్‌ షాక్‌ 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement