కేవలం ముడి సరుకుల ఎగుమతిని అంగీకరించను | PM Modi Inaugurates Utkarsh Odisha 2025 | Sakshi
Sakshi News home page

కేవలం ముడి సరుకుల ఎగుమతిని అంగీకరించను

Jan 29 2025 4:46 AM | Updated on Jan 29 2025 4:46 AM

PM Modi Inaugurates Utkarsh Odisha 2025

వాటికి విలువ జోడించి ఎగుమతి చేస్తేనే మనకు లాభం  

ఉత్కర్ష్ ఒడిశా సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టికరణ  

భువనేశ్వర్‌: మన దేశం నుంచి కేవలం ముడి సరుకులు ఎగుమతి చేయడాన్ని తాను అంగీకరించనని, వాటికి విలువ జోడించి ఎగుమతి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) చెప్పారు. మన ముడి సరుకులతో విదేశాల్లో తయారైన వస్తువులను దిగుమతి చేసుకొనే విధానం మారాలని అన్నారు. మంగళవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ‘ఉత్కర్ష్ ఒడిశా(Utkarsh Odisha): మేక్‌ ఇన్‌ ఇండియా సదస్సు’ను ఆయన ప్రారంభించారు. తూర్పు ఇండియాను గ్రోత్‌ ఇంజన్‌గా పరిగణిస్తున్నామని తెలిపారు. బహుముఖ అభివృద్ధికి ఇక్కడ ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఉద్ఘాటించారు.

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతిలో ఒడిశా పాత్ర అత్యంత కీలకమని వెల్లడించారు. కేవలం ముడి సరుకుల ఎగుమతి వల్ల దేశం అభివృద్ధి చెందదని తేల్చిచెప్పారు. ఈ పరిస్థితి పూర్తిగా మారాలని, మనమంతా నూతన దార్శనికతతో పనిచేయాలని సూచించారు. ‘‘ఇక్కడ తవి్వతీసిన ముడి ఖనిజాలను విదేశాలకు ఎగుమతి చేయడం. అక్కడ వాటికి విలువను జోడించి, వస్తువులు తయారీ చేసి తిరిగి మన దేశానికి పంపడం సరైన విధానం కాదు. మన సముద్ర ఉత్పత్తులను ప్రాసెసింగ్‌ కోసం విదేశాలకు పంపుతున్నారు. వాటినే మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇదంతా నాకు నచ్చడం లేదు.

అది నేను అంగీకరించను. మన ముడి సరుకులకు ఇక్కడే విలువను జోడించాలి. ఆ తర్వాత విదేశాలకు ఎగుమతి చేయాలి. దానివల్ల మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో లాభం చేకూరుతుంది’’ అని మోదీ స్పష్టంచేశారు. నానాటికీ మారుతున్న ఆధునిక ప్రపంచంలో గ్లోబల్‌ సప్లై చైన్‌కు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని గుర్తుచేశారు. కేవలం దిగుమతుల ఆధారిత సప్లై చైన్‌పై ఆధారపడడం తెలివైన పని కాదని పేర్కొన్నారు. అంతర్జాతీయ తలెత్తే ఒడిదొడుకుల ప్రభావాన్ని తట్టుకోవడానికి మన దేశంలోనే పటిష్టమైన సప్లై, వాల్యూ చైన్‌ను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ బాధ్యత ప్రభుత్వాలతోపాటు పరిశ్రమ వర్గాలపైనా ఉందన్నారు.  

కాన్సర్ట్‌ ఎకానమీని ప్రోత్సహిస్తాం..  
భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగానికి ఇక ఎంతో దూరం లేదని ప్రధాని మోదీ వివరించారు. మన ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా రెండు మూలస్తంభాలపై ఆధారపడి ఉందన్నారు. అవి వినూత్నమైన సేవా రంగం, నాణ్యమైన ఉత్పత్తులు అని తెలిపారు. గ్రీన్‌ టెక్నాలజీ, గ్రీన్‌ ఫ్యూచర్‌పై అధికంగా దృష్టి పెట్టామని అన్నారు. ఈ రంగంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, సది్వనియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ముంబై, అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన కోల్డ్‌ప్లే కార్యక్రమాల(కాన్సర్ట్స్‌) గురించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కోల్డ్‌ప్లే టూర్లు విజయవంతమయ్యాయని గుర్తుచేశారు. ఇండియాలో కాన్సర్ట్‌ ఎకానమీ ప్రగతికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

ఈ రంగంలోమౌలిక సదుపాయాల కల్పనకు, నైపుణ్యాభివృద్ధికి పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేట్‌ రంగానికి సూచించారు. కాన్సర్ట్‌ ఎకానమీని ప్రోత్సహిస్తామని వెల్లడించారు. లైవ్‌ ఈవెంట్లకు డిమాండ్‌ భారీగా పెరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా పేరున్న కళాకారులు ఇండియాలో ప్రదర్శనలు ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారని నరేంద్ర మోదీ చెప్పారు. వచ్చే నెలలో మన దేశంలో తొలిసారిగా ‘వరల్డ్‌ ఆడియో విజువల్, ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మట్‌’ జరగబోతోందని వివరించారు. మన సృజనాత్మకు ప్రపంచానికి చాటడానికి ఇదొక చక్కటి వేదిక అని తెలిపారు. ఉత్కర్ష్ ఒడిశా సదస్సులో ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీతోపాటు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement