PM Modi Inaugurates 108th Indian Science Congress - Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ లీడర్లుగా ఎదగండి 

Jan 4 2023 2:53 AM | Updated on Jan 4 2023 9:57 AM

PM Modi Inaugurates 108th Indian Science Congress - Sakshi

నాగపూర్‌: భారత్‌ను స్వావలంబన దేశంగా తీర్చిదిద్దడానికి సైంటిస్టులు కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వారు తమ పరిజ్ఞానాన్ని ప్రజల రోజువారీ జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఉపయోగించాలని కోరారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో 108వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఐదు రోజులపాటు ఈ సదస్సు జరుగనుంది.

శాస్త్రీయ విధానాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. క్వాంటమ్‌ టెక్నాలజీ, డేటా సైన్స్‌తోపాటు కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పరిశోధకులకు సూచించారు. కొత్తగా పుట్టకొచ్చే వ్యాధులపై నిఘా పెట్టే చర్యలను వేగవంతం చేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా నానాటికీ ఆదరణ పొందుతున్న క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ రంగంలో విశేష కృషి చేయడం ద్వారా గ్లోబల్‌ లీడర్లుగా ఎదగాలని సైంటిస్టులకు ఉద్బోధించారు. సెమి కండక్టర్ల రంగంలో నూతన ఆవిష్కరణలతో ముందుకు రావాలని కోరారు. పరిశోధకులు తమ ప్రాధాన్యతల జాబితాలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, అగ్‌మెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీని చేర్చుకోవాలని చెప్పారు.  

ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో 40వ స్థానం  
సైంటిస్టులు ప్రయోగశాలల నుంచి క్షేత్రస్థాయికి రావాలని, అప్పుడే వారి ప్రయత్నాలు గొప్ప ఘనతలుగా కీర్తి పొందుతాయని ప్రధానమంత్రి వెల్లడించారు. సైన్స్‌ ప్రయోగాల ఫలితాలను సామాన్య ప్రజలకు అందించాలన్నారు. టాలెంట్‌ హంట్, హ్యాకథాన్లతో యువతను సైన్స్‌ వైపు ఆకర్షితులను చేయాలని కోరారు. ప్రైవేట్‌ కంపెనీలు, స్టార్టప్‌లను రీసెర్చ్‌ ల్యాబ్‌లు, విద్యాసంస్థలతో అనుసంధానిస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని స్పష్టం చేశారు. క్వాంటమ్‌ కంప్యూటర్స్, కెమిస్ట్రీ, కమ్యూనికేషన్, సెన్సార్స్, క్రిప్టోగ్రఫీ, న్యూ మెటీరియల్స్‌ దిశగా మన దేశం వేగంగా ముందుకు సాగుతోందని మోదీ వివరించారు.

మన దేశంలో ఇంధన, విద్యుత్‌ అవసరాలు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయని, ఈ రంగంలో కొత్త ఆవిష్కరణ ద్వారా దేశానికి లబ్ధి చేకూర్చాలని సైంటిఫిక్‌ సమాజానికి పిలుపునిచ్చారు. దేశంలో అభివృద్ధి కోసం శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించుకుంటున్నామని తెలియజేశారు.  గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో మనదేశం 2015లో 81వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు 40వ స్థానానికి చేరిందని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement