
సాక్షి, న్యూఢిల్లీ: ఉప ఎన్నికలు జరిగే జిల్లాలు, నియోజకవర్గాలకు అనుకునే ఉండే ప్రాంతాల్లో ఉప ఎన్నికలపై ప్రత్యక్ష ప్రభావం చూపే ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదని ఎన్నికల సంఘం (ఈసీ) రాజకీయ పార్టీలను కోరింది. కొన్ని రాజకీయ పార్టీలు ఉప ఎన్నికలు జరిగే జిల్లాలు, నియోజకవర్గాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నికల కార్యకలాపాలు చేపట్టడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఉప ఎన్నికలు జరిగే పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గంలో అమలయ్యే ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని నిబంధనలు సంబంధిత జిల్లా అంతటికీ వర్తిస్తాయని స్పష్టతనిచ్చింది. ఉప ఎన్నికలు జరిగే జిల్లా, నియోజకవర్గాన్ని ఆనుకుని ఉండే ప్రాంతాల్లో ఎన్నికల నియమావళితోపాటు భౌతికదూరం పాటించడం వంటి కోవిడ్–19 నిబంధనలు అమలయ్యేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది.