ఇంత అవమానమా.. ఆలస్యంగా వెలుగులోకి.. | Sakshi
Sakshi News home page

మహిళా అధ్యక్షురాలికి అవమానం 

Published Sun, Oct 11 2020 8:17 AM

Panchayat Chief In Cuddalore Forced To Sit On Floor - Sakshi

సాక్షి, చెన్నై: వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు అగ్రవర్ణాల తీరుకు అవమానాల్ని ఎదుర్కొనాల్సిన పరిస్థితి తప్పడం లేదు. ఇటీవల తిరువళ్లూరులో ఓ మహిళా ప్రజాప్రతినిధిని జాతీయ జెండా ఎగురవేయకుండా అడ్డుకుంటే, తాజాగా, కడలూరులో ఓ మహిళా అధ్యక్షురాల్ని ఏకంగా నేలపై కూర్చోబెట్టి అవమానించడం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన అధికార వర్గాలు అట్రాసిటీ కేసు నమోదు చేయడమే కాదు, పంచాయతీ కార్యదర్శిని అరెస్టు చేయించారు. కడలూరు జిల్లా మేల్‌ భువనగిరి యూనియన్‌ పరిధిలో తెర్కుదిట్టై పంచాయతీ ఉంది. ఈ పంచాయతీ అధ్యక్షురాలుగా దళిత సామాజిక వర్గానికి చెందిన రాజేశ్వరి గెలిచారు.  బాధ్యతలు స్వీకరించిన నాటిని నుంచి ఎన్నో అవమానాల్ని ఆమె చవిచూశారు. ఆమెకు ఇటీవల ఎదురైన అవమానాన్ని ఫొటో చిత్రీకరించిన ఎవరో వ్యక్తులు, దానిని శుక్రవారం సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కించడం వివాదానికి దారి తీసింది. (చదవండి: పాదరసం.. అంతా మోసం

పంచాయతీ పాలక వర్గ సమావేశంలో కుర్చీలో ఉపాధ్యక్షుడు మోహన్‌రాజ్, పంచాయతీ కార్యదర్శి సింధుజా కుర్చీలో కూర్చోగా, అధ్యక్షురాలు నేలపై కూర్చున్న ఫోటో వైరల్‌ అయింది. కడలూరు ఎస్పీ అభినవ్‌ దృష్టికి ఈ ఫొటో చేరడంతో భువనగిరి ఇన్‌స్పెక్టర్‌ రాబిన్సన్‌ నేతృత్వంలో బృందాన్ని రంగంలోకి దించారు. శనివారం ఆ గ్రామానికి చేరుకుని రాజేశ్వరి, ఆమె భర్త శరవణన్‌ల వద్ద విచారించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమె ఎదుర్కొంటున్న అవమానాలు, వేధింపులు వెలుగులోకి వచ్చా యి. ఆమె నుంచి తీసుకున్న ఫిర్యాదుతో  ఉపాధ్యక్షుడు మోహన్‌ రాజ్, కార్యదర్శి సింధుజాలపై  అట్రాసిటీ కేసు నమోదు చేశారు.  సింధుజాను సస్పెండ్‌ చేస్తూ పంచాయతీ రాజ్‌ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అయితే, తనకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని సింధుజా పేర్కొన్నారు.  శనివారం ఆమెను అరెస్టు చేశారు.  మోహన్‌ రాజ్‌ కోసం గాలిస్తున్నారు. ఈ వ్యవహారాల గురించి రాజేశ్వరి పేర్కొంటూ, తాను గెలిచానే గానీ, ఏ రోజూ ఆ పదవికి తగిన  న్యాయం చేయలేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement