Viral Video: తల్లి కోసం భగీరథుడిలా.. ఆ 14 ఏళ్ల బాలుడు..

Palghar Boy Digs Well To Save Mom Trips To River To Fetch Water - Sakshi

తల్లి కష్టం చూసి చలించిపోయి 14 ఏళ్ల బాలుడు భగీరథుడిలా శ్రమించి.. నీటిని రప్పించాడు. ఆ ప్రాంతం కరువుకు ప్రసిద్ధి.  ఎండాకాలం వచ్చేటప్పటికీ నీటి సంక్షోభంతో అల్లాడుతుంటుంది. అలాంటి చోట తన తల్లి పడుతున్న నీటి కష్టాన్ని దూరం చేయాలని ఓ బాలుడు సంకల్పించాడు. అనుకున్నది సాధించి ఆ ప్రాంతంలో సెలబ్రెటీగా మారిపోయాడు. 

మహారాష్ట్ర పాల్ఘర్‌ జిల్లాలోని కెల్వె గ్రామంలో  తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల ప్రణవ్‌ అనే బాలుడు తన తల్లి కోసం వయసుకు మించిన సాహసం చేశాడు. అతను చేసిన పనితో ఒక్కసారిగా తన ఊరిలో హీరోగా మారిపోయాడు. ప్రణవ్‌ తల్లి దర్శన నీటి కోసం రోజు ఎంతో ప్రయాస పడి నది వద్దకు వెళ్లాల్సి వచ్చేది. ఈ కష్టాన్ని ఎలాగైనా  తీర్చాలని నిర్ణయిచుకున్నాడు. అనుకున్నదే తడువుగా బావి ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. అందుకోసం భూమిని తవ్వడం ప్రారంభించాడు.

రోజుకి కేవలం 15 నిమిషాలు మాత్రమే భోజనానికి బ్రేక్‌ తీసుకునేవాడని ప్రణవ్‌ తండ్రి వినాయక్‌ చెబుతున్నాడు. తాను ఒక్కడినే తన కొడుకు సాయం చేసేవాడినని, ప్రణవ్‌ తవ్వుతుంటే రాళ్లను తొలగించడం వంటివి చేసేవాడినని చెప్పుకొచ్చాడు. ఎట్టకేలకు ప్రణవ్‌ ప్రయత్నం చూసి గంగమ్మ రకలేసుకుంటూ భూమి నుంచి ఉబికి వచ్చింది. ఇక ప్రణవ్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొత్తం ఐదు రోజుల్లో పని పూర్తి చేశాడు ప్రణవ్‌.

ఇక మా అమ్మ రోజు ఉదయం నీళ్ల కోసం బకెట్లు, బిందెలతో అంతదూరం నుంచి నీళ్లు తీసుకురావాల్సిన కష్టం తప్పిందని ప్రణవ్‌ సంబరంగా చెప్పాడు. తల్లి కోసం ఓ బాలుడు బావిని తవ్వాడన్న విషయం గ్రామమంతా దావానంలా వ్యాపించడంతో.. ఆ ఊరి ప్రజలు, ప్రణవ్‌ స్నేహితులు ఆ బావిని చూసేందుకు తండోపతండాలు తరలి వచ్చారు. బావిని చూసేందుకు తన టీచర్‌ స్వయంగా తన ఇల్లుని వెతుక్కుంటూ వచ్చినట్లు ఆనందంగా చెబుతున్నాడు ప్రణవ్‌.

అంతేగాదు ప్రణవ్‌ పడిన కష్టాన్ని వివరించేలా బావి వద్ద బోర్డుని కూడా ఏర్పాటు చేశారు అతని స్నేహితులు. వాస్తవానికి మహారాష్ట్రాలోని ఓ మారుమూల ప్రాంతమైన కెల్వె గ్రామం సరైన నీటి వసుతులు లేవు. ఆ గ్రామంలోని ప్రజలందరికీ సమీపంలో ఉ‍న్న నదే ఆధారం. మిగతా మహిళల తోపాటు తన తల్లి పడుతున్న కష్టమే ప్రణవ్‌ని ఈ సాహసానికి పురిగొల్పింది.  కాగా, అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి: 'మా స్టాండ్‌ని వదిలిపెట్టం'! అందుకు మూల్యం చెల్లించేందుకు రెడీ: శరద్‌ పవార్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top