
ఒడిశా: ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో ప్రేమికులను నాగలికి కట్టి ఊరేగించిన ఘటన సంచలనం రేకెత్తించింది. జిల్లాలోని నారాయణ పట్న సమితి, బొరికి గ్రామ పంచాయతీ పెద్ద ఇటికి గ్రామంలో ఒకే వంశానికి చెందిన ఇద్దరు గిరిజనులు ప్రేమించుకున్నారు. ఈ విషయం రథయాత్ర సమయంలో వెలుగులోకి రావడంతో పెద్దలు కఠిన శిక్ష విధిస్తారనే భయంతో వీరు ఆంధ్రాకు పారిపోయారు. కానీ, వారి ఆచూకీని ఇరు కుటుంబాల వారు పసిగట్టి గ్రామ పెద్దలకు నివేదించారు.
ఒకే వంశానికి చెందిన వీరిద్దరూ అన్నాచెల్లెళ్లు అవుతారు. వీరిద్దరూ ప్రేమించుకోవడం గ్రామానికే అరిష్టమని, పంటలు పండవని, పాపశుద్ధి జరగాలని పేర్కొంటూ వీరిని ఆదివారం ఊరికి రప్పించారు. అయితే ప్రేమికులు తాము ఎలాంటి శిక్షనైనా భరిస్తాం గానీ విడిపోయి ఉండలేమని తేల్చి చెప్పారు. దీంతో వారిని గ్రామం నడిబొడ్డున నాగలికి కట్టి ఊరేగించి శుద్ధిజలం చల్లారు. శిక్ష అమలు తర్వాత ఇద్దరూ కలిసి ఉండొచ్చని పెద్దలు నచ్చజెప్పి తీసుకురావడం గమనార్హం.