
సాక్షి, భువనేశ్వర్: ఒడిషాలో విషాదం నెలకొంది. కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య శాఖ మంత్రి నబ కిషోర్ దాస్ మృతిచెందారు. కాల్పుల తర్వాత భువనేశ్వర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా.. ఆరోగ్యం విషమించి కిషోర్‌దాస్ తుదిశ్వాస విడిచారు.
కాగా, ఝార్సిగూడ జిల్లా బ్రజరాజునగర్‌లోని గాంధీచౌక్ వద్ద నబ కిషోర్ దాస్‌పై ఏఎస్‌ఐ గోపాల్ దాస్ కాల్పలు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో మంత్రి ఛాతిలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. ఈ ఘటనలో మంత్రితో పాటూ మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. ఇక, ఇప్పటికే గోపాల్ దాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఏ కారణంతో మంత్రిపై ఏఎస్ఐ కాల్పులు జరిపాడనేది తెలియాల్సి ఉంది.
మంత్రి నబ కిషోర్ దాస్ కి సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం దిగ్భ్రాంతికరమని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు మంత్రిపై కాల్పులు జరపడంతో బిజూ జనతాదళ్ కార్యకర్తలు ఆ ప్రాంతంలో ఆందోళనకు దిగారు. తమ నాయకుడిపై కాల్పులు జరిగిన నిందితుడిని తమకి అప్పగించాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.