తుపాను ముప్పు

Odisha: Cyclone Alert In Bay Of Bengal - Sakshi

భువనేశ్వర్‌ / బరంపురం: రాష్ట్రానికి మరో తుపాను ముప్పు పొంచి ఉందని భారతీయ వాతావరణ విభాగం బుధవారం హెచ్చరించింది.  బంగాళాఖాతంలో ఈ నెల 22వ తేదీన అల్ప పీడనం ఏర్పడి తుపానుగా మారి ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరం దాటుతుందనిæ ముందస్తు సమాచారం జారీ చేసింది. అయితే తుపాను చిత్రం అస్పష్టంగా ఉంది. ఉత్తర అండమాన్‌ సాగరం,  తూర్పు కేంద్ర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం చిత్రం స్పష్టమైతే తప్ప తుపాను తీవ్రత అంచనా వేయలేమని భారతీయ వాతావరణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్రో తెలిపారు. వాతావరణ కదలిక పరిశీలనలో సమాచారం తెలుస్తుందని, తుపాను చిత్రం స్పష్టమైతే దాని పేరు ఖరారవుతుందన్నారు.

వర్ష సూచన
అల్ప పీడనం ప్రభావంతో ఈ నెల 25వ తేదీ సాయంత్రం నుంచి రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. ఒకటి, రెండు చోట్ల కుండపోత వర్షం కురుస్తుంది. 

బలమైన గాలులు
ఈ నెల 23వ తేదీ నుంచి అండమాన్‌ సాగరం, పరిసర తూర్పు కేంద్రియ బంగాళాఖాతం తీరంలో గంటకు 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ వేగం గంటకు 65 కిలో మీటర్ల వరకు ఉండే అవకాశాలున్నాయి. ఈ నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు తీర ప్రాంతాల్లో గాలులు బలంగా వీస్తాయి. ఈ వ్యవధిలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ వేగం గంటకు 70 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 
చేపల వేట నివారణ
సముద్రంలో అలజడి వాతావరణం నెలకొనడంతో ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు బంగాళాఖాతం నడి భాగం, ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉత్తర బంగాళాఖాతం, ఒడిశా కోస్తా ప్రాంతంలో  మత్స్యకారులకు చేపల వేట నివారించారు. సముద్రం నడి బొడ్డున ఉన్న మత్స్యకారులు ఈ నెల 23వ తేదీ నాటికి తీరం చేరాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
  
తీరంలో కమ్ముకున్న మేఘాలు
ఉపరితల ఆవర్తనం నెల కొన్న నేపథ్యంలో బుధవారం గంజాం జిల్లాలోని గోపాల్‌పూర్‌ తీరంలో సముద్రంపై మేఘాలు కమ్ముకున్నాయి. ఉపరితలంలో విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా సముద్రం నీటిమట్టం పెరగడంతో గోపాల్‌పూర్‌ తీరం  అల్లకల్లోలంగా మారింది. సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతూ తీరాన్ని తాకుతున్నాయి. సముద్ర పోటు ఎక్కువగా   ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా తీరంలో పడవలు నిలిపివేశారు.  

భయాందోళన వద్దు
రాష్ట్రానికి తుపాను ముప్పు పరిస్థితి ఇంతవరకు స్పష్టం కాలేదు. ప్రజలు ఆందోళన చెందాలి్సన పరిస్థితులు లేనట్లు రాష్ట్ర ప్రత్యేక సహాయ కమిషనర్‌ (ఎస్సార్సీ) ప్రదీప్‌ కుమార్‌ జెనా ధైర్యం చెప్పారు. తుపానుకు సంబంధించి అనుక్షణం తాజా సమాచారం జారీ అవుతుంది. భారతీయ వాతావరణ విభాగం ముందస్తు సూచన మాత్రమే జారీ చేసింది. తుపాను తీవ్రత, ఉపరితలాన్ని తాకే ప్రాంతం వివరాలేమీ జారీ చేయనట్లు ఆయన స్పష్టం చేశారు. వాతావరణ విభాగం ముందస్తు సమాచారం మేరకు రాష్ట్రంలో జాతీయ, ఒడిశా విపత్తు స్పందన దళాలు, అగ్నిమాపక దళం, కోస్తా ప్రాంతాల జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లతో సమావేశాలు ప్రారంభించారు.   తుపాను హెచ్చరికల నేపథ్యంలో విపత్తు నిర్వహణ సరంజామాతో జిల్లా యంత్రాంగం సిద్ధం కావాలని ఆదేశించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top