ఉద్యోగం లేదని కుటుంబ బాధ్యతల నుంచి భర్త తప్పించుకోజాలడు | No Job Is No Excuse: Delhi Court Orders Man to Pay Child Support to Minor Son | Sakshi
Sakshi News home page

ఉద్యోగం లేదని కుటుంబ బాధ్యతల నుంచి భర్త తప్పించుకోజాలడు

Jun 7 2026 7:48 AM | Updated on Jun 7 2026 7:48 AM

No Job Is No Excuse: Delhi Court Orders Man to Pay Child Support to Minor Son

న్యూఢిల్లీ: కేవలం ఉద్యోగం లేదనే సాకుతో భార్య, కుమారుడి పోషణ బాధ్యతల నుంచి భర్త తప్పించుకోజాలడని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. బాలుడైన కుమారుడి పోషణ కోసం నెలకు రూ.6 వేల చొప్పున చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఓ గృహ హింస కేసులో అదనపు సెషన్స్‌ జడ్జి శీతల్‌ చౌదరి ప్రధాన్‌ ఈ మేరకు 2వ తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గృహ హింసనివారణ చట్టం కిందభర్త నుంచి తనకు సాయం మందించేలా ఆదేశాలించాలంటూ వేసిన పిటిషన్‌కు దిగువ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్‌ చేస్తూ ఓ మహిళ వేసిన అర్జీపై న్యాయమూర్తి.. ‘తనకు వేరే బాధ్యతలున్నాయని, ఉద్యోగం లేదని కారణాలు చూపుతూ భర్త చట్టబద్ధంగా వివాహమాడిన భార్య, మైనర్‌ సంతానం పోషణ బాధ్యతల నుంచి తప్పించుకోలేడు’అని పేర్కొన్నారు. 

ఉద్యోగం చేయగలిగి ఉండీ కూడా ఇలాంటి కారణాలను చూపరాదన్నారు. కుమారుడు మేజర్‌ అయ్యే వరకు ఈ భరణం చెల్లించాల్సిందేనన్నారు. 2013లో తమకు వివాహమైనప్పటి నుంచి కట్నం కోసం వేధిస్తూ, శారీరకంగా, మానసికంగా భర్త, అతడి కుటుంబం తన పట్ల క్రూరంగా వ్యహరించారని పిటిషన్‌ ఆరోపించారు. గర్భవతిగా ఉండగానే 2015లో తనను ఇంట్లోంచి గెంటి వేశారని, అప్పటి నుంచి కుమారుడితో కలిసి వేరుగా ఉంటున్నట్లు ఆమె తెలిపారు. కుటుంబ న్యాయస్థానం రాజీ కుదర్చడంతో 2015లో ఈ దంపతులు వేరు కాపురం పెట్టినా, కొద్ది నెలలపాటే కలిసి ఉన్నారు. అయితే, భర్త గృహ హింసకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు ఆమె చూపించ లేకపోయారంటూ ట్రయల్‌ కోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.

ఇప్పటికే అనేక సంవత్సరాలుగా ఆ చిన్నారి తండ్రి నుంచి ఎటువంటి సాయం అందకుండానే తల్లి కస్టడీలో ఉంటున్నందున భరణం అవసరం లేదని పేర్కొంది. పిటిషనర్‌ విద్యావంతురాలైనందున ఆమెకు సాయం అవసరం లేదని కూడా పేర్కొంది. అయితే, తాజాగా విచారించిన సెషన్‌ జడ్జి.. పిటిషనర్‌ తన కుమారుడిని పోషించుకునేందుకు అవసరమైన మేర సంపాదిస్తున్నట్లు చూపించడంలో భర్త విఫలమయ్యారని తెలిపారు. విద్యావంతురాలైనందున భరణం అవసరం లేదన్న వాదనను కూడా ఆమె తోసిపుచ్చారు. దిగువ కోర్టు పలుమార్లు అవకాశమిచ్చినప్పటికీ పిటిషనర్‌ భర్త తన ఆదాయ ధ్రువీకరణ అఫిడవిట్‌ను సమర్పించలేకపోయిన విషయాన్ని జడ్జి ఎత్తి చూపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement