Cow Hug Day: వాలంటైన్స్‌ డే రోజు ‘కౌ హగ్‌ డే’.. నిర్ణయంపై వెనక్కి తగ్గిన కేంద్రం

No Cow Hug Day On February 14,Centre Withdraws Appeal - Sakshi

ఫిబ్రవరి 14న ప్రజలు ఆవును కౌగించుకోవాలన్న నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గింది. ప్రేమికుల దినోత్సవం రోజున కౌ హగ్‌ డే జరుపుకోవాంటూ ఇచ్చిన పిలుపును ఉపసంహరించుకుంది. ఈ మేరకు భారత జంతు సంరక్షణ బోర్డు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మత్స్య, పశుసంవర్థక, డెయిరీ మంత్రిత్వశాఖ నుంచి అందిన ఆదేశాల మేరకు ఫిబ్రవరి 14న కౌ హగ్ డే జరుపుకోవాలంటూ ఇచ్చిన పిలుపును వెనక్కి తీసుకొంటున్నట్టు కేంద్ర పశు సంరక్షణ బోర్డు కార్యదర్శి ఎస్‌కే దత్తా ఓ నోటీసులో పేర్కొన్నారు.

కాగా గోవులను ప్రేమించేవారు ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డేకి బదులుగా కౌ హగ్‌ డే జరుపుకోవాలని కేంద్ర జంతు సంక్షేమ శాఖ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతున్న నేపథ్యంలో భారతీయ పురాతన సంప్రదాయాలు అంతరించిపోతున్నాయని.. గోమాత ప్రాధాన్యతను గుర్తించి ఫిబ్రవరి 14న గోవులను ఆలింగనం చేసుకోవాలంటూ పేర్కొంది. గోవును కౌగిలించుకోవడం ద్వారా భావ సంపద వృద్ధి చెందుతుందని.. తద్వారా వ్యక్తిగత, సామూహిక సంతోషం పెరుగుతుందని తెలిపింది.

అయితే ఈ ప్రకటన చే'rనప్పటి నుంచి కౌ హగ్‌ డే అంశం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అప్పటి నుంచి దీనిపై రచ్చ జరుగుతూనే ఉంది. కొంతమంది దీనిపై సానుకూలంగా స్పందిస్తుంటే.. మరికొందరు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ విమర్శిస్తున్నారు. దీంతో నెట్టింట్లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. అటు విపక్షాలు కౌ హగ్‌ డేపై సైతం విమర్శలు గుప్పించాయి.  కౌ హగ్‌ డే పిలుపు హాస్యాస్పదమని.. ప్రధాని మోదీకి పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీ ఓ ‘పవిత్ర గోవు’ అంటూ మండిపడ్డాయి.  ఈ నేపథ్యంలో జంతు సంరక్షణ బోర్డు  ‘కౌ హగ్‌ డే’ పాటించాలంటూ ఇచ్చిన పిలుపును తాజాగా ఉపసంహరించుకోవడం గమనార్హం.
చదవండి: మోదీ సర్కార్‌ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైంది: ఎమ్మెల్సీ కవిత

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top