
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడుల కేసులో కీలక నిందితుడు తహవ్వుర్ రాణా కస్టడీని ఎన్‌ఐఏ కోర్టు మరో 12 రోజులు పొడిగించింది. 18 రోజుల కస్టడీ గడువు ముగియడంతో సోమవారం ప్రత్యేక కోర్టు జడ్జి చందర్ జిత్ సింగ్ ఎదుట ఎన్‌ఐఏ హాజరు పరిచింది. ముఖానికి ముసుగు తొడిగిన రాణాను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టుకు తీసుకువచ్చారు.
తమ వద్ద ఉన్న కీలకమైన పత్రాలపై అతడి నుంచి సమాచారం రాబట్టాల్సి ఉందని ఎన్‌ఐఏ తెలిపింది. కస్టడీ సమయంలో సాధించిన దర్యాప్తు పురోగతిని జడ్జికి ప్రత్యేకంగా వివరించింది. విచారణలో అతడు తమకు సహకరించడం లేదని ఎన్‌ఐఏ లాయర్లు వాదించారు. ఎన్‌ఐఏ అధికారుల సమక్షంలోనే అతడు లాయర్‌ను కలుసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.