దేశ రాజధానిలో టపాసులపై నిషేధం

NGT bans firecrackers in places where air quality is poor  - Sakshi

అమ్మకాలపై కూడా నిషేధం

జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ఆదేశాలు

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దీపావళికి టపాసులు కాల్చడంతోపాటు అమ్మకాలను కూడా నిషేధిస్తున్నట్లు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. ‘‘ప్రజలకు స్వచ్ఛమైన గాలిని పీల్చుకొనే హక్కు ఉంది’’ అని పేర్కొన్న ఎన్జీటీ దేశ రాజధానితోపాటు గాలి నాణ్యత చాలా తక్కువగా  ఉన్న నగరాల్లోనూ నిషేధాజ్ఞలు ఉంటాయని పేర్కొంది. ఈ నిబంధనలు సోమవారం అర్ధరాత్రి నుంచి నవంబర్‌ 30 అర్ధరాత్రి వరకు అమలులో ఉంటాయని తెలిపింది. గాలి నాణ్యత మోడరేట్‌ నుంచి కింది స్థాయి ఉన్న నగరాల్లో హరిత క్రాకర్స్‌కు అనుమతిచ్చింది. టపాసులు కాల్చడం ద్వారా దేశ రాజధాని ప్రాంతంలో వచ్చే కాలుష్యంపై నివారణ చర్యలు కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను విచారించిన జస్టిస్‌ ఆదర్శకుమార్‌ గోయెల్‌ ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.

ఆదేశాల్లో ముఖ్యాంశాలు
► దేశరాజధాని పరిధిలో ఈనెల 9 అర్ధరాత్రి నుంచి 30 అర్ధరాత్రి వరకు అన్ని రకాల క్రాకర్స్‌ అమ్మకం, కాల్చడంపై నిషేధం విధించడం.
► గతేడాది నవంబర్‌లో గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా గాలి నాణ్యత పూర్‌ ఆపై స్థాయి ఉన్న అన్ని నగరాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి.
► గాలి నాణ్యత మోడరేట్‌ అంతకన్నా తక్కువస్థాయి ఉన్న నగరాల్లో దీపావళి, ఛట్, క్రిస్‌మస్, న్యూఈయర్‌ సందర్భంగా ఆయా రాష్ట్రాలు తమ నిబంధనల ప్రకారం కేవలం 2 గంటలపాటు మాత్రమే గ్రీన్‌ క్రాకర్స్‌ కాల్చుకోవచ్చు.  

టపాసులు నో.. చిచ్చుబుడ్లు ఓకే
టపాసుల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు శివసేన నాయకత్వంలోని ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌ (బీఎంసీ) ప్రకటించింది. తక్కువ కాలుష్యం విడుదల చేసే టపాకాయలను, చిచ్చుబుడ్లను ఇళ్ళవద్ద కాల్చవచ్చునని బీఎంసీ తెలిపింది. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఈ చర్యలు చేపట్టినట్లు బీఎంసీ తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top